వాపస్ పోయిన రుణమాఫీ పైసలు రాలే.. క్రాప్​లోన్ ​అకౌంట్లు ఇన్​యాక్టివ్​ కావడమే కారణం

  • రైతులకు మెసేజ్​లు వచ్చినా డబ్బులు జమ కాలే  
  • కరీంనగర్ జిల్లాలోనే 9 వేల మంది.. 
  • రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది బాధితులు 
  • సేవింగ్స్​ అకౌంట్లలోనైనా వేయాలని అన్నదాతల రిక్వెస్ట్​

కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో రైతులందరికీ రూ.లక్ష లోపు రుణమాఫీ కాలేదు. క్రాప్ లోన్ అకౌంట్లు పని చేయక డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్​ఫర్​(డీబీటీ) ఫెయిల్యూర్ కారణంగా అప్పట్లో వెనక్కిపోయిన పైసలు మళ్లీ జమకాలేదు. గత బీఆర్ఎస్​ప్రభుత్వం ఆగస్టు నుంచి నవంబర్ వరకు విడతలవారీగా, జిల్లాలవారీగా రుణమాఫీ డబ్బులు రైతుల అకౌంట్లలో జమ చేసిన విషయం తెలిసిందే. 

రైతులందరి సెల్ ఫోన్లకు మెసేజ్​లు వచ్చినప్పటికీ కొందరికి డబ్బులు క్రెడిట్ కాలేదు. డీబీటీ ద్వారా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తుంటే, వేసినవి వేసినట్లే రిటర్న్ అయ్యాయి. దీంతో రైతులు తరచూ బ్యాంకులకు వెళ్తూ అడుగుతుంటే డబ్బులు పడలేదని బ్రాంచ్ మేనేజర్లు చెప్తున్నారు. లోన్ అకౌంట్ క్లోజ్ కావడంతో డీబీటీ ఫెయిల్యూర్ అని వస్తోందని సమాధానమిస్తున్నారు. రైతుల ఆధార్ నంబర్ ఆధారంగా అకౌంట్లను గుర్తించి..వాటిలో రుణమాఫీ పైసలు జమ చేయాలని భావించినప్పటికీ ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. 

ఎన్పీఏ కేటగిరీలోకి వెళ్లడం వల్లే.. 

ఆర్బీఐ నిబంధనల ప్రకారం..లోన్ అమౌంట్ ఎప్పటికప్పుడు చెల్లించకుండా, రెన్యూవల్ చేయించుకోకుండా ఉంటే లోన్ అకౌంట్లు మూడేండ్లు మాత్రమే యాక్టివ్ గా ఉంటాయి. తర్వాత ఆ అకౌంట్లు నాన్ పర్ఫామింగ్ అసెట్స్ (ఎన్పీఏ) కేటగిరీలోకి వెళ్తాయి. ఏటా రెన్యూవల్ చేసుకుంటే ఎన్నేండ్లయినా అకౌం ట్లు యాక్టివ్ గా ఉంటాయని బ్యాంకర్లు చెప్తున్నారు. 

కానీ, ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే భరోసాతో చాలామంది రెన్యూవల్ చేసుకునేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా ఇలాంటి అకౌంట్లన్నీ ఇన్ యాక్టివ్ అయ్యాయి. అలాగే, కొన్ని బ్యాంకులు లోన్ రెన్యూవల్ చేసుకున్నవారికి కూడా పాత అకౌంట్ ను క్లోజ్ చేసి కొత్త అకౌంట్లను తెరిచాయి. దీంతో లోన్ అకౌంట్ మారిపోవడం, ఇవి 2018 డిసెంబరు 11 వరకు ఉన్న అకౌంట్లు కాకపోవడంతో ఆర్థికశాఖ డీబీటీ చేసిన నిధులు ట్రెజరీకి రిటర్న్ అవుతున్నాయి. 

డీబీటీ ఫెయిల్యూర్​తోనే...

రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ రెండోసారి ఎన్నికలకు వెళ్లే ముందు 2018 డిసెంబర్ 11 నాటికి రూ.లక్ష వరకు క్రాప్ లోన్  తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కానీ గెలిచాక ఐదేండ్లు ఇలాగే నెట్టుకువచ్చారు. తొలుత రూ.50 వేలలోపు రుణాలున్న 7.19 లక్షల మంది రైతులకు రూ.1,943.64 కోట్లను అప్పటి సర్కారు బ్యాంకులకు చెల్లించింది. 

తర్వాత రూ.లక్షలోపు లోన్ తీసుకున్న 10. 79 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.6,546.05 కోట్లను సరిగ్గా ఎన్నికలకు ముందు విడుదల చేసింది. కానీ, డీబీటీ ఫెయిల్యూర్ వల్ల ప్రతి బ్యాంకులో కనీసం10 నుంచి 15 శాతం మంది రైతులకు డబ్బులు జమ కాలేదు. కరీంనగర్ జిల్లాలో 9 వేల మంది, పెద్దపల్లి జిల్లాలో 4,500 మంది రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది బాధిత రైతులు ఉంటారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

మాఫీ అయినట్టు మెసేజ్​ వచ్చింది 

నాకు పంట రుణ మాఫీ పథకం కింద రూ.75,432 మాఫీ అయినట్లు ఆగస్టు 14న మెసేజ్​వచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తపల్లి బ్రాంచ్ లో డబ్బులు వేశామని, కొత్త లోన్ తీసుకోవాలనుకుంటే బ్యాంకులో కలవండని అందులో ఉంది. నేను బ్యాంకుకు వెళ్లి అడిగితే క్రాప్ లోన్ పైసలు వెనక్కి వెళ్లాయని చెప్పారు. ఆధార్ నంబర్ ఆధారంగా లోన్ పైసలు మళ్లీ వేస్తారని అన్నారు. కానీ, ఇంతవరకు పైసలు తిరిగి రాలేదు. క్రాప్ లోన్ అకౌంట్ పని చేయకపోతే నా సేవింగ్స్ అకౌంట్ లోనైనా డబ్బులు జమ చేయాలి.

 విలాసాగరం రమేశ్, రైతు, వెదిర, కరీంనగర్