కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ ఉపాధి కల్పన విధానాల వలన దేశంలో 7.4 శాతం నిరుద్యోగిత రేటు నమోదయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తన 2023 రిపోర్టులో ప్రకటించింది. జాతీయ సగటు కంటే 12 రాష్ట్రాలలో నిరుద్యోగితా రేటు ఎక్కువ. అలాగే హర్యానా, రాజస్థాన్, బీహార్, ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాలలో నిరుద్యోగిత రేటు 20 శాతం కంటే ఎక్కువగా ఉంది అని సీ ఎం ఐ ఈ నివేదిక స్పష్టం చేస్తుంది. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా నిరుద్యోగం, ఉపాధి కల్పన ఉద్యోగాల భర్తీ ప్రధాన అజెండాగా నిలుస్తుంది. అంటే దేశంలో, రాష్ట్రాలలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే కేంద్ర ప్రభుత్వ హామీ తో పాటు, రాష్ట్రాలు కూడా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామనే హామీలు ఎన్నికల వాగ్దానాలుగా మిగిలిపోవడం, ప్రభుత్వాలు ఆ విధంగా ఉద్యోగాల కల్పనకి ప్రణాళికలు, విధానాలు సిద్ధం చేయకపోవడంతో దేశంలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా మారిపోయింది.
అన్ని పార్టీలదీ అదే తీరు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, నిర్వహించిన పోటీ పరీక్షలలో అవినీతి పేపర్ల లీకేజీ వలన నిరుద్యోగులకు ప్రభుత్వంపై అపనమ్మకం ఏర్పడటమే కాకుండా లక్షలాది మంది నిరుద్యోగులు నిరాశకు గురైనారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైతే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దాన్ని రాజకీయ అవకాశంగా మలుచుకున్నాయి. కానీ బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ నిరుద్యోగంలో మొదటి రెండు స్థానాలలో ఉన్నాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తన నివేదికలో పేర్కొంది. అంటే దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో విఫలమైనాయి అనేది వాస్తవం.
పని ఉంటే సంపన్నం, లేకపోతే నరకం
ఐక్యరాజ్యసమితి జనాభా నిధి రిపోర్ట్ ప్రకారంగా భారతదేశం 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఆవిర్భవించిన సందర్భంలో 142 కోట్ల జనాభాని 142 కోట్ల అవకాశాలుగా భావించాలని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి చెప్పారు. అలాగే 15 నుంచి 64 సంవత్సరాల వయసుగల జనాభా దేశంలో 68 శాతం ఉన్నట్లుగా రిపోర్టు వెల్లడించింది. అయితే ప్రభుత్వాలు ఈ 68 శాతం పని చేసే సామర్థ్యం ఉన్న జనాభాకి అవకాశాలు కల్పించినప్పుడే దేశం సంపన్న దేశం మారుతుంది. కానీ వారికి అవకాశాలు సృష్టించలేనప్పుడు, ప్రతి అదనపు జనాభా ఒక ఆర్థిక నరకాన్ని సృష్టిస్తుందని ప్రఖ్యాత జనాభా ఆర్థికవేత్త మాల్తస్ అభిప్రాయపడ్డారు. చైనాలో కూడా జనాభా 142 కోట్లకు పైగా ఉన్నా అది ఆ దేశ అభివృద్ధికి ఆటంకంగా మారకపోవటానికి ప్రధాన కారణం ఆదేశం నైపుణ్యాలు కలిగిన జనాభాను కలిగి ఉండటమే.
ఉద్యోగ, ఉపాధి ప్రాధాన్యాలు కావాలి
భారతదేశం ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగినా ఉపాధి ఉద్యోగ అవకాశాలను విస్తృతపరిచి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించలేకపోతే సాధించిన అభివృద్ధి నిష్ప్రయోజనమే. నిరుద్యోగ సమస్యను రాజకీయ అవకాశాలను సృష్టించే సమస్యగా కాకుండా, ఉపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యతగా భావించాలి. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను క్రమం తప్పకుండా భర్తీ చేయడం, ఉపాధిని కల్పించే పరిశ్రమలకు ప్రాధాన్యత ప్రోత్సాహకాలు ఇవ్వటం, స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపట్టడం నైపుణ్యాలను పెంచడం లాంటి చర్యల ద్వారా కొంత మేరకు నిరుద్యోగ సమస్యకి పరిష్కారం చూపించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ ప్రాధాన్యతా క్రమంలో ఉపాధి ఉద్యోగాల కల్పన ప్రధానమైన అంశంగా మారనంత కాలం నిరుద్యోగానికి పరిష్కారం దొరకదు.
- డాక్టర్ తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్