- జీడీడీపీ, తలసరి ఆదాయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలే టాప్
- చిట్టచివరన ములుగు, ఆసిఫాబాద్ జిల్లాలు
- కేంద్రీకృత అభివృద్ధి వల్ల
- ఆదాయ పంపిణీలో అసమానతలు
- అర్బన్, రూరల్ మధ్య స్పష్టమైన అంతరాలు
- తెలంగాణ తలసరి ఆదాయం 3.47 లక్షలు
- సోషియో ఎకనమిక్ సర్వే వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య అభివృద్ధిలో అంతరాలు.. పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య ఆదాయంలో అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు అభివృద్ధిని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితం చేయడంతో సంపద సృష్టిలో, తలసరి ఆదాయంలో ఆ రెండు జిల్లాలే టాప్‌లో నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన 2023–24 సోషియో ఎకానమిక్ సర్వే ఈ విషయాన్ని బయటపెట్టింది.
తలసరి ఆదాయం కూడా ఈ రెండు జిల్లాల్లోనే ఎక్కువుంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో సగటు వ్యక్తి సంవత్సర ఆదాయం రూ. 9 లక్షల46 వేల 862 కాగా, చిత్రంగా పక్కనే ఉన్న వికారాబాద్ జిల్లాలో రూ. 1,80,241, అడవుల జిల్లా కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో రూ.1,81,825 ఉంది. అంటే ఆసిఫాబాద్‌తో పోల్చినప్పుడు రంగారెడ్డి జిల్లావాసుల ఆదాయం 5 రెట్ల కన్నా ఎక్కువుంది. మొత్తంగా హైదరాబాద్, దాని చుట్టూఉన్న జిల్లాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే జగిత్యాల, కుమ్రంభీం, వికారాబాద్ జిల్లాలు చివరి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో రూ.2.22 లక్షలకు అటు ఇటుగా వరంగల్, కరీంనగర్ వరుసగా 15,16 స్థానాల్లో ఉన్నాయి. దీనిని బట్టి రాష్ట్రంలో ని వివిధ జిల్లాల ప్రజల మధ్య జీవనప్రమాణాల్లో స్పష్టమైన తేడా ఉన్నట్టు అర్థమవుతోంది.
తలసరి ఆదాయంలో తెలంగాణ ముందంజ..
జాతీయ స్థాయిలో గడిచిన మూడేండ్లలో తలసరి ఆదాయంలో తెలంగాణ దూసుకెళ్తోంది. 2021–22లో రూ.2,69,161, 2022–23లో రూ.3,11,649 గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం క్రమంగా పెరిగి 2023–24లో రూ.3,47,299కు చేరింది. జాతీయ తలసరి ఆదాయం(1.84 లక్షలు) కన్నా తెలంగాణ తలసరి ఆదాయం రెండు రెట్ల కన్నా ఎక్కువ కావడం విశేషం. 2014–15లో 1.24 లక్షలు ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం పదేండ్లలో రూ.3.47 లక్షలకు పెరిగింది. అదే సమయంలో పదేండ్ల కింద 2014–15లో రూ.72,658 కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు 6 లక్షల71వేల 757 కోట్లకు చేరాయి.
అంటే రాష్ట్ర అప్పులు 824.5శాతం పెరిగితే తలసరి ఆదాయం కేవలం 279 శాతం మాత్రమే పెరిగినట్టు స్పష్టమవుతోంది. అప్పులతో పాటే తలసరి ఆదాయం పెరుగుతోందని గత సర్కారు పదే పదే చెప్పినా అప్పులు పెరిగిన నిష్పత్తిలో తలసరి ఆదాయం పెరగకపోవడాన్ని ఆర్థికవేత్తలు ఎత్తిచూపుతున్నారు. అలాగే జిల్లాల మధ్య తలసరి ఆదాయంలో భారీగా తేడా ఉండడం ఏమాత్రం మంచి సంకేతం కాదని స్పష్టంచేస్తున్నారు.
జీడీపీలో 5శాతానికి తెలంగాణ వాటా
తెలంగాణ జీఎస్డీపీ(గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్) రూ.14.64 లక్షల కోట్లకు చేరింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది దేశ జీడీపీలో 5శాతం. అంతకుముందు రెండేండ్లలో తెలంగాణ వాటా 4.8, 4.9శాతంగా ఉంది. జీఎస్డీపీ వృద్ధిరేటులో దేశంలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కాగా, తెలంగాణ జీఎస్డీపీ కి జిల్లాల నుంచి కాంట్రిబ్యూషన్ సమానంగా లేదు.
మొత్తం 33 జిల్లాలకు గాను 16 జిల్లాల్లో వృద్ధిరేటు జాతీయ వృద్ధిరేటు కన్నా ఎక్కువ ఉంది. ఐటీ, ఫార్మా, నిర్మాణ, తదితర రంగాలతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జీడీడీపీ(గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్) ఎక్కువగా ఉంటే పారిశ్రామికంగా వెనుకబడి, వ్యవసాయం తప్ప మరే ఇతర ఆదాయ వనరులు పెద్దగా లేని కుమ్రం భీం ఆసిఫాబాద్, ములుగు లాంటి జిల్లాల్లో జీడీడీపీ అతి తక్కువ గా ఉంది.
హైదరాబాద్, దాని చుట్టు పక్కల జిల్లాల్లోనే పారిశ్రామికీకరణ, మౌలిక వసతుల కల్పన జరుగుతుండడం ఇందుకు కారణమని ఎక్స్పర్టులు అంటున్నారు. రాష్ట్రాన్ని పదేండ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటును పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం కాగా, కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కారైనా అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టిపెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.