బీసీలకు మెడికల్ విద్య దూరం చేసే కుట్ర : రిటైర్డ్​జస్టిస్ ఈశ్వరయ్య

బీసీలకు మెడికల్ విద్య దూరం చేసే కుట్ర : రిటైర్డ్​జస్టిస్ ఈశ్వరయ్య

ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ చైర్మన్ ఈశ్వరయ్య ఆరోపణ
550 జీఓను అమలు చేస్తేనే బీసీ విద్యార్థులకు సీట్లని వ్యాఖ్య 

బషీర్​బాగ్, వెలుగు: బీసీ విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ చైర్మన్, రిటైర్డ్​జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపించారు. ఏటా 300 మంది మెడికల్​స్టూడెంట్లకు పీజీ సీట్లు దక్కకుండా చేస్తున్నారన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శనివారం డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రిటైర్డ్​ఐఏఎస్ చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఈశ్వరయ్య మాట్లాడారు. 

2013 నుంచి ఓపెన్ కేటగిరీలోని పీజీ మెడికల్ సీట్లను మెరిట్ ఆధారంగా కాకుండా, ఎవరు ఎక్కువ డబ్బు పెడితే వారికి కేటాయిస్తున్నారని మండిపడ్డారు. మెరిట్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు ఫిక్స్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తెలంగాణలో అమలు చేయడం లేదన్నారు. దీంతో బీసీ డాక్టర్లు స్పెషలిస్టులు కాకుండా మిగిలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 550 జీఓను అమలు చేయాలని చిరంజీవులు డిమాండ్​చేశారు. 

ఏపీలో అమలవుతున్న జీఓ తెలంగాణలో ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. 550 జీఓను అమలు చేస్తే బీసీలకు పీజీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బీసీలకు జరుగుతున్న అన్యాయంపై బీసీ మేధావులను పిలిపించి చర్చించాలని కోరారు. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీగా కరుణాకర్ రెడ్డి పది సంవత్సరాలుగా కొనసాగుతున్నారని, పదవీ విరమణ చేసినాక కూడా కొనసాగించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కరుణాకర్ రెడ్డి ఉన్నన్ని రోజులు బీసీలకు న్యాయం జరగదన్నారు. ప్రభుత్వం నుంచి 48 గంటల్లో స్పందన రాకపోతే తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు.