చరిత్ర అంటే రాజ్యాలు, రాజులు, రాణులు యుద్ధాలే కాదు. అది గత సంస్కృతీ సంప్రదాయాలు, నాగరికత పాలనా విధానాలను వర్తమాన భవిష్యత్తు మానవాళికి అందించే ఒక సమాహారం. గతంలో సాధించిన విజయాలు, జరిగిన విధ్వంసం, ఆవిష్కరణలు, వాటికి మూల కారణాలు చరిత్ర అధ్యయనం ద్వారానే తెలుస్తాయి. దేశం, జాతి ప్రాంతం చరిత్రను అధ్యయనం చేయకుండా భవిష్యత్తుని నిర్మించటం సాధ్యం కాకపోవచ్చు. చరిత్రలోకి తొంగి చూడకుండా ఏ దేశము తన భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోలేదు. విప్లవాలు, ఉద్యమాలు, పోరాటాలు, చరిత్రలను, నాగరికతను, ఆవిష్కరణలు, స్వర్ణ యుగాల పాలన వ్యవస్థలను తెలిపే మార్గమే చరిత్ర. దాని ప్రాధాన్యతను విస్మరించటం గాలిలో మేడలు కట్టడమే అవుతుంది. కాబట్టి చరిత్రను రక్షించుకోవటానికి దాని ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి దశాబ్దాలుగా ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లాంటి సంస్థలు పని చేస్తూనే ఉన్నాయి.
50 మంది ప్రతినిధులతో 1935లో పుణెలో ప్రారంభమైన అఖిల భారత జాతీయ చరిత్రకారుల కాంగ్రెస్, నేడు 35వేల మంది ప్రతినిధులతో దక్షిణాసియాలోనే వృత్తిపరమైన విషయ నిపుణుల పరిశోధకుల, చరిత్రకారుల అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది. చరిత్ర మూలాలను పరిరక్షించటం చరిత్ర రచనల ప్రమాణాలను కాపాడటం, నిష్పాక్షికమైన వాస్తవ చరిత్రను ప్రోత్సహించటం, పక్షపాతానికి, రాజకీయాలకు తావు లేకుండా న్యాయమైన లౌకిక శాస్త్రీయ చరిత్రను నిబద్ధతతో ముందుకు తీసుకువెళ్లటమే లక్ష్యంగా ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ (ఐహెచ్సీ) దశాబ్దాలుగా నిర్విరామమైన కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా చరిత్రపై ఆర్కియాలజీపై, అపురూప కట్టడాలపై, పరిశోధనలు చేస్తున్న పరిశోధకులతో పాటు వృత్తిపరమైన విషయ నిపుణులు, మేధావులను సభ్యులుగా కలిగిన ఈ సంస్థ చరిత్రను పరిరక్షించడమే కాదు, దశాబ్దాలుగా దేశంలో ప్రభుత్వాల విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే బహుముఖమైన పాత్రను పోషిస్తుంది. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ తన ప్రస్థానంలో 82 జాతీయస్థాయి సమావేశాలను నిర్వహించి చరిత్ర ఔన్నత్యాన్ని నిలబెట్టి దక్షిణాసియాలోనే అతిపెద్ద చరిత్రకారుల సంఘంగా ప్రశంసలుఅందుకుంటున్నది.
82వ సమావేశానికి ఓరుగల్లు ఆతిథ్యం
చారిత్రిక నగరమైన ఓరుగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయం రెండోసారి ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. 1993లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ తన 53వ సమావేశాన్ని ఓరుగల్లు వేదికగా లోకల్ సెక్రటరీ హిస్టరీ విభాగాధిపతి ప్రొఫెసర్ బొబ్బిలి ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయంలోనే నిర్వహించింది. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 82వ సమావేశానికి రెండోసారి వేదిక అవడం కాకతీయ విశ్వవిద్యాలయానికి దక్కిన గౌరవంగానే భావించాలి.
డిసెంబర్ 28న ప్రారంభమైన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు డిసెంబర్ 30న ముగిసిన ఈ మూడు రోజుల సమావేశాలలో దేశం నలుమూల ల నుంచి చరిత్రకారులు, ప్రొఫెసర్లు, నిపుణులు,పరిశోధకులు వచ్చారు. ప్రాచీన చరిత్ర,మధ్య యుగ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, ఆర్కియాలజీ, సమకాలీన చరిత్ర, ఇతర దేశాల చరిత్ర లాంటి ఆరు విభాగాలలో దాదాపు 1,146 పరిశోధనాత్మక పత్రాలను సమర్పించారు. అనేక కీలక జాతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా తీర్మానాలను ఆమోదించారు. చరిత్ర అధ్యయన ఆవశ్యకత, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ విధానాలు చరిత్ర వక్రీకరణలు వివాదాస్పద అంశాలు లాంటివాటిపై సదస్సులో చర్చించారు.
నెహ్రూ ఇన్ అవర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్
దేశ భవిత చరిత్రకారులపైనే ఉన్నదని గుర్తించి వాస్తవిక చరిత్రను అందజేయాల్సిన బాధ్యత చరిత్రకారులదే. సమాజంలోని అనేక అంశాలను అర్థం చేసుకోవాలంటే చరిత్ర అధ్యయనం తప్పనిసరి. ముఖ్యంగా పాలకులు చరిత్రను అధ్యయనం చేస్తేనే గొప్ప పాలన అందించగలుగుతారని ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఎన్యూ హిస్టరీ విభాగం విశ్రాంత ఆచార్యులు మృదులా ముఖర్జీ అభిప్రాయపడినారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్ ఆదిత్య ముఖర్జీ జవహర్ లాల్ నెహ్రూఇన్ అవర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనే అంశంపై మాట్లాడుతూ.. నెహ్రూ విధానాలను తప్పుపట్టడం చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరగటంపై సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు.
పర్యావరణం, పురాతన కట్టడాలను కాపాడుకోవాలి
నూతన జాతీయ విద్యా విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం పాఠశాలల్లో, కళాశాలల్లో విశ్వవిద్యాలయాలలో అసమగ్ర చరిత్రను ప్రవేశపెట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా సదస్సులో ఏకగ్రీవ అభిప్రాయం వెలువడింది. మహిళా చరిత్ర, పర్యావరణ చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారసత్వపు కట్టడాలను, పురాతన కట్టడాలను పరిరక్షించాలని, ఆర్కియాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానాలతో పాటు, గాజాపై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయాలని సదస్సులో తీర్మానం చేయటం ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ నిబద్ధతకు అద్దం పడుతుంది.
సవాళ్ల మధ్య సదస్సు
కేంద్ర ప్రభుత్వం చరిత్రను వక్రీకరించే పద్ధతులను అవలంబిస్తోందని, స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను కూడా వక్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తోందని.. పార్లమెంట్లో చేస్తున్న చట్టాలు, తీసుకొస్తున్న సంస్కరణలు మతపరమైన అంశాలపై చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు ప్రాధాన్యం సంతరించు కుందనే చెప్పాలి. సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో వక్రీకరణలు జరుగుతుండటంతో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లాంటి సంస్థలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలి. వాస్తవ చరిత్రను ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమైనాయి.
డాక్టర్తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ