
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మరో నేషనల్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా గురువారం నుంచి కేఐఓ ఆలిండియా కరాటే చాంపియన్ షిప్ జరగనుంది. కరాటే ఇండియా ఆర్గనైజేషన్ (కేఐఓ)కు అనుబంధంగా ఉన్న తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన్ (టీఎస్ కేడీఏ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 1,500 మందికి పైగా ప్లేయర్లు సీనియర్, అండర్ 21, పారా కరాటే విభాగాల్లో పోటీపడనున్నారు.
బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో టోర్నీకి సంబంధించిన ఏర్పాట్లను టీఎస్ కేడీఏ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, శాట్ చైర్మన్ కె. శివసేనారెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టోర్నీని ప్రారంభిస్తారని, 29న జరిగే ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ టోర్నీని సక్సెస్ చేసేందుకు శాట్ తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని
శివసేనా రెడ్డి చెప్పారు.