
హైదరాబాద్, వెలుగు: 2030 ఆర్థిక సంవత్సరం నాటికి మనదేశం నుంచి మసాలాలు/సుగంధద్రవ్యాల ఎగుమతులను 4 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్లకు (రూ.82 వేల కోట్ల) తీసుకెళ్లడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆల్ -ఇండియా స్పైసెస్ ఎక్స్‌పోర్టర్స్ ఫోరం ప్రకటించింది. హైదరాబాద్‌లో శనివారం మొదలైన నేషనల్ స్పైసెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ రెండు రోజుల సదస్సులో సుగంధ ద్రవ్యాల వ్యాపారాలకు సంబంధించిన కీలకమైన అంశాలపై సదస్సులో నిపుణులు, పరిశ్రమ ప్రముఖులు చర్చిస్తారు.
పలువురు రైతులు, రైతు ఉత్పత్తి సంస్థలు మొదటి రోజు సదస్సుకు హాజరయ్యాయి. ‘‘భారతీయ సుగంధ ద్రవ్యాల మార్కెట్ విలువ పరంగా దాదాపు రూ.1.14 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే, నాలుగు బిలియన్ డాలర్లు (దాదాపు రూ.33,000 కోట్లు) ఉత్పత్తిలో 15 శాతం మాత్రమే ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండగా, మిగిలినది దేశీయ మార్కెట్‌లో వినియోగిస్తున్నారు. ఎగుమతి మార్కెట్ 8–-10 శాతం సీఏజీఆర్ వద్ద పెరుగుతోంది”అని వరల్డ్స్పైసెస్ ఆర్గనైజేషన్ చైర్మన్ రామ్‌కుమార్ మీనన్ అన్నారు.
మెరుగైన ఆదాయాల కారణంగా దేశీయ, ప్రపంచ మార్కెట్లలో బ్రాండెడ్ మసాలా దినుసులకు డిమాండ్ పెరుగుతోందని ఆయన అన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను తెచ్చేందుకు మరిన్ని వ్యవసాయ స్టార్టప్‌లు ఈ రంగంలోకి వస్తున్నాయని వెల్లడించారు. ఎగుమతులు 2025 నాటికి ఐదు బిలియన్ డాలర్లకు , 2030 నాటికి రూ. 82 వేల కోట్లకు (10 బిలియన్ డాలర్లు) చేరుకునే అవకాశం ఉందన్నారు.