సాధారణంగా సర్వీస్ అప్డేట్ అయినవి ఎక్కువ లాభపడడం, అప్డేట్ కానివి నష్టపోవడం కామన్. కానీ, టెలికం రంగంలో దీనికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతోంది. ఎయిర్టెల్ కస్టమర్లు ఐడియా నంబర్‌కి ఫోన్ చేసి మాట్లాడితే ఎయిర్టెల్ కంపెనీ ఐడియాకి నిమిషానికి ఆరు పైసలు ఇవ్వాలి. ఐడియా నంబర్ వాడేవాళ్లు ఎయిర్టెల్ సిమ్ ఉన్న ఫోన్‌కి కాల్ చేసినా ఐడియా సంస్థ అంతే అమౌంట్ కట్టాలి. దీన్నే ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జ్ (ఐయూసీ) అంటారు. రెండు ఫోన్ నంబర్లూ ఒకే కంపెనీవైతే ఐయూసీ చెల్లింపు అవసరం లేదు. ఐడియా, ఎయిర్‌టెల్‌తోపాటు ఇతర ఆపరేటర్లు ఈ రంగంలో సీనియర్ సర్వీస్ ప్రొవైడర్లు. ఇప్పటికీ చాలా మంది ఫోన్లలో ఈ సిమ్లే ఉన్నాయి.
జియో కంపెనీ టెలికం సేవలను ఇటీవలే ప్రారంభించింది. కేవలం రూ.49కే నెల మొత్తం అన్లిమిటెడ్ కాల్స్, ఒక జీబీ డేటా అందిస్తోంది. ఐడియా, ఎయిర్టెల్ వంటి కొన్ని సంస్థలు ఈ సౌకర్యం కల్పించాలంటే మినిమం రీచార్జి రూ.100 చెల్లించాల్సిందే. జియో సిమ్ 4జీ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. మిగతా కంపెనీల సిమ్‌లకు ఆ రూల్ లేదు. జియో సిమ్ వాడాలనుకుంటే అదే సంస్థ అమ్మే ఫీచర్ ఫోన్‌ని రూ.1500 పెట్టి కొనుక్కోవచ్చు.
పేదలు ఎక్కువగా వాడేవి బేసిక్ ఫోన్లే
జియో మినహా వేరే కంపెనీల ఫోన్లు ఒకవేళ 4జీని సపోర్ట్ చేసినా వాటిలో ఐడియా, ఎయిర్టెల్ వంటి సంస్థల సిమ్‌లు వేస్తే అన్లిమిటెడ్ కాల్స్ కోసం మినిమం రూ.100 కేటాయించాల్సిందే. దేశంలో డబ్బు లేనోళ్లే ఎక్కువ మంది ఉన్నారు. పేదల వద్ద, అక్షరమ్ముక్కరానోళ్ల దగ్గర ఎక్కువగా బేసిక్ ఫోన్లే ఉంటాయి. అవి మహా అయితే 2జీ టెక్నాలజీ వరకే సపోర్ట్ చేస్తాయి. కాబట్టి జియో సిమ్ వాడే ఛాన్సే లేదు.
ఈ రోజుల్లోనూ నిమిషానికి రెండు రూపాయలా?
2జీ సబ్స్క్రయిబర్లు నిమిషం కాల్కి దాదాపు రెండు రూపాయలు (రూ.1.80 పైసలు) చెల్లించాల్సి వస్తోంది. ఈ రోజుల్లోనూ ఇంత టారిఫ్ ఉండటం నమ్మబుద్ధి కాదు. కానీ, నిజం. అదే 4జీ సబ్స్క్రయిబర్లకైతే వన్ మినిట్ ఫోన్ కాల్కి యావరేజ్‌గా మూడు పైసల లోపు మాత్రమే పడుతోంది. దీనికితోడు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉంటుంది. జియో ఎలాగూ 4జీ కాబట్టి ఆ కస్టమర్లకు ఇబ్బంది లేదు. ఎటొచ్చీ 2జీ సబ్స్క్రయిబర్లకే సమస్య. కొన్ని టెలికం సంస్థలు కావాలనే తమ టెక్నాలజీని 2జీ నుంచి 4జీకి అప్డేట్ చేయట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఐయూసీ వల్లే ఈ భారం
ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జ్ (ఐయూసీ) గతంలో 14 పైసలు ఉండేది. దాన్ని రెండు దశల్లో జీరోకి తెస్తామని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) రెండేళ్ల కిందట చెప్పింది. దీంతో టెలికం ఆపరేటర్లంతా 4జీకి అప్‌గ్రేడ్ అవుతారని, అప్పుడు రీఛార్జ్‌ల్లో తేడాలు రావనుకున్నారు. ఐయూసీని 14 పైసల నుంచి ఆరు పైసలకు వచ్చింది. ప్రస్తుతం ఇదే అమలవుతోంది. ఈ ఆరు పైసలను మరో 4 నెలల్లో (2020 జనవరి నుంచి) సున్నా చేయాల్సి ఉంది. అయితే, ట్రాయ్ తీరు చూస్తుంటే ఇది అనుమానమే.
ఇప్పడు ఏదీ ఫ్రీ కాదు
తమ సిమ్ల నుంచి చేసే కాల్స్‌ని కనెక్ట్ చేస్తున్న ఇతర టెలికం ఆపరేటర్లకు జియో మూడేళ్లుగా చెల్లిస్తున్న ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జ్ (ఐయూసీ) రూ.13,500 కోట్లకు చేరింది. ఇది ఆ సంస్థకు భారంగా మారింది. దీంతో ఐయూసీ విషయంలో రాజీపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా.. ఇన్నాళ్లూ వాయిస్ కాల్స్‌ని ఫ్రీగా ఇచ్చిన జియో ఇకపై వేరే నెట్‌వర్క్‌లకు చేసుకునే కాల్స్‌కి నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జ్ వేయాలని నిర్ణయించింది. ఈ కాల్స్ కోసం రూ.10 మొదలుకొని రూ.100 వరకు ఐయూసీ వోచర్లను అందుబాటులోకి తెచ్చింది. 4జీ నెట్వర్క్ భారీగా విస్తరించిన ఈ రోజుల్లోనూ 2జీ పరిధిలో ఇంకా 35–40 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీరికి జియో నుంచి డైలీ 65–75 కోట్ల నిమిషాల ఔట్‌గోయింగ్ కాల్స్ వెళుతున్నాయి. వీటిని కనెక్ట్ చేస్తున్నందున వేరే ఆపరేటర్లకు జియో ఐయూసీని చెల్లించాల్సి వస్తోంది. ఐయూసీ కొత్త రీఛార్జ్‌లకే వర్తించేలా బుధవారం నుంచే అమల్లోకి తెచ్చింది.