
పరిగి, వెలుగు: గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తో కొల్లగొట్టిన భూములను భూ భారతి చట్టం ద్వారా పేదలకు పంచుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గురువారం వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో రైతులతో నిర్వహించిన భూ భారతి పోర్టల్ అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం రెవెన్యూ చట్టాలను తుంగలో తొక్కుతూ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిందన్నారు.
పేదోడు తన బిడ్డ పెండ్లికి, చదువులకు ఉన్న భూమిని అమ్ముకోలేని పరిస్థితిని సృష్టించిందని మండిపడ్డారు. పార్ట్ బి పేరుతో 18 లక్షల ఎకరాలను తనకు నచ్చిన వారికి కట్టబెట్టి, అసలైన హక్కుదారులను నానా హింసలు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ భూములను సైతం గత ప్రభుత్వం గుంజుకుందని, కొన్నింటిని పార్ట్ బిలో పెట్టిందన్నారు. ఈ సమస్యలన్నింటిని భూభారతి చట్టం పరిష్కరిస్తుందన్నారు. సామాన్యుల భూమికి భరోసా, భద్రత కల్పించడం కోసమే భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు.
ఇండ్ల స్థలాలు ఉండి.. డాక్యుమెంట్లు లేనివారికి, ప్రభుత్వ భూమి సాగు చేస్తూ అర్హత కలిగిన రైతులకు త్వరలోనే పట్టాలిస్తామన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతిరోజు రెండు మండలాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చేనెల మొదటి వారంలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని మోడల్ గా తీసుకొని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సన్న బియ్యం పథకం ఏ విధంగా సక్సెస్ అయిందో భూ భారతి చట్టం కూడా అంతే సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.