- సత్యనారాయణ గౌడ్‌ను కూల్ చేసిన కేసీఆర్
నిర్మల్, వెలుగు: అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ శోభ భర్త సత్యనారాయణ గౌడ్‌ను బుజ్జగించడంలో ఆ పార్టీ నేతలంతా నిమగ్నమయ్యారు. అధిష్టానం నిర్ణయాలు, స్థానిక మంత్రి తీరుపై కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న సత్యనారాయణ గౌడ్.. కొద్ది రోజులపాటు అమెరికా వెళ్లిపోయారు. ఆయన అమెరికా వెళ్లిన వ్యవహారం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ భర్తగా, బలమైన బీసీ నేతగా సత్యనారాయణ గౌడ్‌కు పేరుంది. పార్టీలో ఆయనకు సరైన గౌరవం దక్కడం లేని, దీని కారణంగానే ఆయన అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఆయన అమెరికా నుంచి తిరిగి రావడంతో నిర్మల్ అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్, పార్టీ సీనియర్ నాయకుడు రామ్ కిషన్ రెడ్డి తదితరులు ఆయనను శనివారం సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. వీరంతా ప్రగతి భవన్లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ రాజకీయ భవిష్యత్ పై కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలని సీఎం సూచించారు. ఎన్నికల అనంతరం రాజకీయపరంగా తగిన గుర్తింపునిస్తానని, న్యాయం చేస్తానంటూ సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.