ప్రచారాస్త్రంగా సోషల్ మీడియా

  • గ్రామాల వారీగా గ్రూపుల ఏర్పాటు
  • గ్రామ స్థాయిలో ఇన్​చార్జ్​లను నియమిస్తున్న పార్టీలు
  • పార్టీ కార్యక్రమాలు, ప్రత్యర్థి పార్టీ లోపాలపై ప్రచారం
  • గాసిప్స్ కోసం స్పెషల్ టీంలు..

నిర్మల్,  వెలుగు: రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందేందుకు అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ ప్రచారం ముమ్మరం చేశాయి. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ సెగ్మెంట్లలో ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గోడ రాతలు, కరపత్రాలు, పోస్టర్లు, ప్రచార రథాలతో ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలుపెట్టాయి. అయితే ఎన్నడూలేని విధంగా ఈసారి అన్ని ప్రధాన పార్టీలు సోషల్ మీడియాను ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నాయి.

ఇందులో భాగంగానే పోటాపోటీగా వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యాయి. అలాగే ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఉండే స్థానిక ఓటర్లందరినీ ఈ వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా చేసుకొని ప్రచారానికి ప్లాన్ చేస్తున్నాయి. అలాగే తమ సానుభూతిపరులు, అనుబంధం సంఘాల తో కూడా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం గ్రామాల్లో తమ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలను అడ్మిన్లుగా నియమించి వారి ఆధ్వర్యంలోనే వాట్సప్ గ్రూపులను తయారు చేస్తున్నారు. వాట్సప్, ఫేస్​బుక్, ట్విటర్, టెలిగ్రామ్​లను ఈసారి పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

విమర్శనాస్త్రాలు, వ్యంగ్య కార్టూన్లు, సీన్​ల మార్ఫింగ్..

సోషల్ మీడియాలో ప్రచారం కోసం ప్రధాన పార్టీలు కొన్ని ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టులు అప్పగిస్తున్నాయి. పోస్టులను వైరల్​ చేసేచేసే అనుభవమున్న కొన్ని సంస్థలు ఇప్పటికే ప్రధాన పార్టీలతో కాంట్రాక్టులు కుదుర్చుకున్నాయి. ఈ సంస్థలు ఆయా పార్టీలు ఏర్పాటు చేస్తున్న వాట్సప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉంటూ ప్రతిరోజు కనీసం 10 వరకు అయినా ప్రచార అంశాలను వైరల్ చేస్తున్నాయి. తమకున్న అనుభవంతో పార్టీని, అభ్యర్థులను హైలెట్ చేస్తూనే ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు, వ్యంగ్య కార్టూన్లతోపాటు సినీ పాటలు, డైలాగులు, సీన్లను మార్ఫింగ్ చేయడం లాంటి పనులు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం గడువు ముగిసే వరకు వీరు నియోజకవర్గాల్లోనే తిష్ట వేసి సోషల్ మీడియా ద్వారా తమ పార్టీ అభ్యర్థుల కోసం విస్తృతం చేయనున్నారు.

అన్ని పార్టీలదీ అదే బాట...

అధికార  బీఆర్ఎస్​కు దీటుగా బీజేపీ, కాంగ్రెస్ సైతం సోషల్ మీడియాను ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నాయి. బీఆర్ఎస్ కు తీసిపోని విధంగా సోషల్ మీడియా కోసం సాంకేతిక నైపుణ్యం ఉన్న కార్యకర్తలను ఇన్​చార్జులుగా నియమించుకున్నాయి. వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ మూడు పార్టీల ప్రచార హోరు మారుమోగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు గ్యారెంటీ స్కీంల మేనిఫెస్టో అంశం, సోమవారం బీఆర్​ఎస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను ఆ పార్టీలు ప్రచారాస్త్రాలుగా మలుచుకొని దూసుకుపోతున్నాయి. ఖానాపూర్ సెగ్మెంట్ లో బీఎస్పీ సైతం ప్రధాన పార్టీలకు తీసిపోని విధంగా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కొనసాగిస్తుండడం విశేషం. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియానే ప్రధాన ప్రచారాస్త్రంగా పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి.