జడ్పీ స్టాండింగ్ కమిటీ మీటింగులకు ఎమ్మెల్యేలు, ఎంపీలంతా డుమ్మా

  •  సగానికిపైగా జడ్పీటీసీలు, కొందరు అధికారులదీ అదే తీరు
  • ఆఫీసర్లు వాస్తవాలు చెప్పాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారి జరిగిన కొత్తగూడెం జిల్లా పరిషత్ స్టాండింగ్​కమిటీ మీటింగులకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలంతా డుమ్మా కొట్టారు. సగానికిపైగా జడ్పీటీసీలు, కొందరు ఉన్నతాధికారులు హాజరుకాలేదు. ప్రభుత్వ పథకాల అమలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై రివ్యూ చేయాల్సిన ప్రజాప్రతినిధులు రాకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

దీంతో కొన్ని స్థాయి సంఘాల మీటింగులను ఆఫీసర్లే నిర్వహించారు. పలు శాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులు.. కింది స్థాయి సిబ్బందిని పంపించడంపై ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి, జడ్పీ చైర్మన్​కంచర్ల చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కొత్తగూడెంలోని జడ్పీ ఆఫీసులో జడ్పీ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్, జూలూరుపాడు జట్పీటీసీ కళావతి అధ్యక్షతన ఏడు స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలుగబల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఆఫీసర్లు వాస్తవులు చెప్పినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతాయని చెప్పారు. జిల్లాలోని అన్ని పీహెచ్​సీలు 24 గంటలు పనిచేయాలన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో లేకుండా పల్లె, బస్తీ దవాఖానాలతో ఉపయోగం ఉండదన్నారు.  డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సెల్ఫ్​ ఎంప్లాయిమెంట్​స్కీంలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని ఐటీడీఏ చెబుతుంటే.. ఏజెన్సీలోని యువత పట్టణాలకు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

స్కూళ్లకు స్కావెంజర్లు, స్వీపర్ల అవసరం ఉంటుందని, పంచాయతీ సిబ్బందితో స్కూళ్లు క్లీన్​చేయించడం కష్టమని చెప్పారు. జడ్పీ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్​మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధి సాధించడంలో ఆఫీసర్లదే కీలక పాత్ర అని, గ్రామాల్లోని అవసరాలను గుర్తించి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశాల్లో జడ్పీ సీఈఓ విద్యాలత, డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మితోపాటు పలు శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.

కాగా సమావేశాలకు డుమ్మా కొట్టిన వారిలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, పినపాక, ఇల్లెందు, అశ్వరావుపేట, కొత్తగూడెం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు ఉన్నారు.