ట్రబుల్ షూటర్ సైలెంట్! సిల్వర్ జూబ్లీ వేళ కీలక పరిణామం.. కేసీఆర్ కావాలనే హరీశ్ను పక్కన పెట్టారా?

ట్రబుల్ షూటర్ సైలెంట్! సిల్వర్ జూబ్లీ వేళ కీలక పరిణామం.. కేసీఆర్ కావాలనే హరీశ్ను పక్కన పెట్టారా?
  • మొదట వరంగల్ సభ బాధ్యతలు
  • సభాస్థలి పరిశీలించి రాగానే పక్కకు
  • సభాస్థలి ఉనికి చర్ల నుంచి ఎల్కతుర్తికి మార్పు 
  • సిద్దిపేటకే పరిమితమైన మాజీ మంత్రి
  • హరీశ్ స్థానం పూడ్చేందుకు రంగంలోకి కవిత
  • తెలంగాణ భవన్ కు రాని హరీశ్ రావు
  • సొంత సెగ్మెంట్లో పాదయాత్ర

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి రజతోత్సవ వేళ ఆ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావు సైలెంట్ గా ఎందుకున్నారు..? మొదట ఉనికి చర్లలో సభ నిర్వహించాలని భావించిన గులాబీ బాస్ ఎల్కతుర్తికి ఎందుకు సభాస్థలిని మార్చారు..? ఏర్పాట్ల బాధ్యతలను మాజీ మంత్రి హరీశ్ రావుకు అప్పగించిన కేసీఆర్ ఆ తర్వాత ఆయనను సైలెంట్ గా ఎందుకు పక్కన పెట్టారు?  తర్వాత జిల్లాల వారీగా జరిగిన సమీక్షలకు హరీశ్ రావును ఎందుకు పిలవలేదు.? మునుపెన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎందుకు సభాస్థలి పరిశీలన, కార్యకర్తల సమావేశాల్లో ఎందుకు యాక్టీవ్ అయ్యారు.? ఈ అంశాలపై బీఆర్ఎస్ లో కీలకంగా చర్చ జరుగుతోంది.

బిహైండ్ ద స్క్రీన్!
బీఆర్ఎస్ రజతోత్సవ సభ గులాబీ దళంలో గుబులు రేపుతోందట. 2001 ఏప్రిల్‌ 27న పురుడు పోసుకున్న నాటి తెలంగాణ రాష్ట్ర సమితే ఇప్పటి భారత రాష్ట్ర సమితి.  తన 24 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకొని ఈ నెల 27న 25వ పడిలోకి అడుగు పెడుతోంది. ఈ పాతికేళ్ల పండుగ ఉత్సవాలను 10 లక్షల మందితో బహిరంగ సభను ఘనంగా నిర్వహించి సక్సెస్ చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించారు. హనుమకొండ జిల్లా ఉనికి చర్ల వద్ద బహిరంగ సభకు ప్లాన్ చేసి ఆ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించారు. మరుసటి రోజు హరీశ్ రావు సభా స్థలిని  పరిశీలించేందుకు వెళ్లారు. ఈ  సందర్బంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి భారీ కాన్వయ్ తో హరీశ్ రావు ఘనస్వాగతం పలికారు. మరుసటి రోజు సీన్  చేంజ్ అయ్యింది. సభా వేదిక కూడా మారిపోయింది. 

ఉనికి చర్ల నుంచి ఎల్కతుర్తి 
హరీశ్ రావు ఉనికి చర్ల సభాస్థలిని పరిశీలించిన తర్వాత సభా స్థలి మారిపోయింది. ఎల్కతుర్తి అనుకూలంగా ఉందని అక్కడే సభ నిర్వహించాలనే ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. ఆ తర్వాత హరీశ్ రావును సైలెంట్ గా ఆ బాధ్యతల నుంచి తప్పించారు. స్థానిక నాయకులే తొలుత ఆ బాధ్యతలు చూశారు. అదే సమయంలో ఎర్రవెల్లి ఫాంహౌస్ లో జరిగిన జిల్లాల వారీ సమీక్షకు హరీశ్ రావును ఆహ్వానించలేదు. కేవలం ఆయనను ఉమ్మడి మెదక్ జిల్లాకు మాత్రమే పరిమితం చేశారు. ఏర్పాట్ల విషయం మొత్తం కేటీఆరే పర్యవేక్షిస్తున్నారు.  అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ సభ జరుగుతున్న ఎల్కతుర్తి మండల కేంద్రం హుస్నాబాద్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. అలాగే కరీంనగర్  పార్లమెంటు సెగ్మెంట్, హనుమకొండ జిల్లా పరిధిలో ఉంటుంది. అంటే ఈ మూడు జిల్లాల నేతలు కీలకంగా సభ నిర్వహణ బాధ్యతలు చూడాలి. హరీశ్ రావు సొంత జిల్లా పరిధిలోని నియోజకవర్గంలో మీటింగ్ జరుగుతున్నా ఆయన అటువైపు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

రంగంలోకి కవిత
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లాల నుంచి జన సమీకరణ కోఆర్డినేషన్ బాధ్యతలను  ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత చూస్తున్నారు.  ఆమె జిల్లాల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహించడంతో పాటు కేసీఆర్ ఆదేశాలను పాటిస్తూ ఎప్పటికప్పుడూ కోఆర్డినేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు ఉమ్మడి జిల్లాల సమావేశాలు నిర్వహించారు. మహిళా నాయకులతో కలిసి ఎల్కతుర్తి సభాస్థలిని పరిశీలించారు.  

సిద్దిపేట నుంచి పాదయాత్ర
ఎల్కతుర్తి రజతోత్సవ సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ ఉదయం పాదయాత్రగా సిద్దిపేట నుంచి పాదయాత్రగా బయల్దేరారు. సుమారు 1500 మంది కార్యకర్తలు వెళ్తున్న ఈ ర్యాలీని హరీశ్ రావు ప్రారంభించారు.