
దేశంలో టోల్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన టోల్ ఫీజులను పెంచుతుండగా.. ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం NHAIని ఆదేశించింది. ఈక్రమంలో చివరి విడత పోలింగ్ జూన్ 1వ తేదీన ముగియడంతో టోల్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఎన్‌హెచ్‌ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5% పెరిగాయి. పెరిగిన టోల్ ఛార్జీలు జూన్ 3నుంచి అమలులోకి రానున్నాయి. పెంచిన ధరలు 2025 మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
నేషనల్ హైవేలపై కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, ఇరువైపులా కలిపి రూ.10, చిన్నపాటి కమర్షియల్ వాహనాలు ఒక వైపు ప్రయాణానికి రూ.10, ఇరువైపులా కలిపి రూ.20, బస్సులు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.35, పెద్ద ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ.35, ఇరువైపులా కలిపి రూ.50 వరకు పెంచారు. నెలవారీ పాస్ రూ.330 నుంచి రూ. 340కి పెరిగింది.