అన్ని పార్టీల టార్గెట్​ తెలంగాణనే

‘ఆల్​ రోడ్స్​ లీడ్​ టు రోమ్’.. వేల సంవత్సరాల క్రితం రోమన్​సామ్రాజ్యానికి రోమ్​ రాజధానిగా ఉన్నప్పుడు ఎక్కువగా వాడుకలో ఉన్న సామెత ఇది. రోమ్ ​అధికార కేంద్రమనేది దీని అర్థం. ప్రస్తుతం ఇదే పరిస్థితి మనకు హైదరాబాద్​ విషయంలో కనిపిస్తోంది. ఆల్​రోడ్స్​ లీడ్ టు హైదరాబాద్​అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల టార్గెట్ హైదరాబాదే. బీజేపీ, కాంగ్రెస్, మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఇలా అందరూ తెలంగాణలో తమ రాజకీయ కార్యక్రమాలను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ అనేది రాజకీయ వ్యూహాల పరంగా చాలా కీలకమైన ప్రాంతం. భౌగోళిక స్వరూపం, ఆర్థిక అవకాశాలకు తోడు తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని పొలిటికల్​ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి విస్తరించడానికి పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణను ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ పాలిస్తోంది. ఇక్కడ ప్రతిపక్షాలన్నీ బీజేపీ, కాంగ్రెస్, ఆప్​వంటి జాతీయ పార్టీలే. దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ మిగతావన్నీ జాతీయ పార్టీలే ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.

టీఆర్ఎస్ ప్రభుత్వం బలహీనపడుతోందని జాతీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ పాగా వేసేందుకు ఇదే అవకాశమని అవి భావిస్తున్నాయి. కాంగ్రెస్​ పార్టీ గత వైభవాన్ని సాధించాలని చూస్తుంటే.. బీజేపీ మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభావం చూపించాలని అరవింద్​ కేజ్రీవాల్​కూడా ఆశపడుతున్నారు. తెలంగాణ ఐటీకి, సాఫ్ట్ వేర్ కు, టాలీవుడ్, తెలుగు మీడియాకు ఇప్పుడు క్యాపిటల్. తెలుగువాళ్లలో ధనవంతులు, ప్రముఖులకు ఇదే గమ్యస్థానం. ఆంధ్రప్రదేశ్​ విడిపోయిన తర్వాత కూడా, ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్​లోనే ఉంటున్నారు. ఇక్కడి నుంచే ఏపీలో పాలన, వ్యవహారాలు సాగిస్తున్నారు. ఆంధ్రా రాజకీయ నాయకులు, రియల్​ఎస్టేట్ వ్యాపారులు, ఐటీ బిజినెస్​మ్యాన్స్, మూవీ స్టార్లు, ఇంకా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు విజయవాడలో కృష్ణా నదీ తీరంలోనో లేదా వైజాగ్​ బీచ్​లోనో గడపడం లేదు. వీరంతా హైదరాబాద్​లోనే జీవిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు రాజధానిగా హైదరాబాద్​ ఎంతగానో అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోని ధనవంతులంతా తెలంగాణలోనే పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం తెలంగాణను ఎవరు పాలిస్తున్నారనేది ఇప్పుడు ప్రధానమైన అంశమే కాదు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పిస్తే చాలు తెలంగాణ ఆటోమాటిక్​గా అభివృద్ధి సాధిస్తుంది. అందుకే ఆంధ్రాకు చెందిన రిటైర్డ్​ ఉద్యోగులు, ప్రజలు కూడా హైదరాబాద్​కు వలస వస్తున్నారు. విజయవాడ, వైజాగ్​తో పోలిస్తే హైదరాబాద్​లో కాస్ట్​ ఆఫ్ లివింగ్​చాలా తక్కువ కావడమే కారణం.

జాతీయ పార్టీలకు ఎందుకు తొందర ?
తెలంగాణ చిన్న రాష్ట్రం.119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఒక పార్టీ 10 మంది ఎమ్మెల్యేలను గెలిచినా.. అది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. 2023లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వచ్చే జనరల్​ఎలక్షన్లకు జాతీయ పార్టీలకు ఇది సెమీఫైనల్​లాంటిది. ఏదైనా పార్టీ తెలంగాణలో సత్తా చూపించగలిగితే.. అది ఆంధ్రాతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి వీలవుతుంది. పెద్దదైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు తెలంగాణ కీలకంగా ఉన్నందు వల్ల, ఇప్పుడు చిన్న రాష్ట్రంగా మారిన తర్వాత పదవులు లేని రాజకీయ నాయకులు చాలా ఎక్కువ మందే ఉన్నారు. టీఆర్ఎస్​ కూడా దీని వల్ల సమస్యలు ఎదుర్కొంటోంది. పదవులేమో తక్కువగా ఉండటం.. నాయకులేమో ఎక్కువగా ఉండటం ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అందువల్ల జాతీయ పార్టీలకు తెలంగాణలో నాయకులను వెతకడం అంత కష్టం కాకపోవచ్చు.

కేసీఆర్, ప్రశాంత్​కిశోర్, కేజ్రీవాల్
ప్రస్తుతం టీఆర్ఎస్..​ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కొత్త ఆలోచనలు, ఐడియాలు లేకపోవడంతో పొలిటికల్​ వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ను తెరపైకి తెచ్చింది. సాధారణంగానే ఇప్పుడు అన్ని జాతీయ పార్టీల నాయకులు కేసీఆర్​ను టార్గెట్​గా చేసుకుని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇది కచ్చితంగా కేసీఆర్​ను ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రశాంత్​కిశోర్​ఎంట్రీతో టీఆర్ఎస్​లో మార్పులు కనిపించవచ్చు. అయితే, ఇవి రాజకీయ నాయకులు తీసుకొచ్చినవి కాదు, మార్కెటింగ్​కన్సల్టెంట్​తీసుకొచ్చినవి. చాలా మంది సిట్టింగ్​ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని ప్రశాంత్​కిశోర్​ కేసీఆర్​కు సూచించవచ్చు. టీఆర్ఎస్​ కు ఓటు వేసిన వారికే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయనే భావన ఎక్కువగా ఉంది. ఇది తెలంగాణ సమాజంలో విభజనకు కారణం కావచ్చు. ఇది మరింత ముదిరితే అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. సమాజంలో తలెత్తుతున్న విభజన అంశాన్ని ప్రశాంత్​కిశోర్​కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లవచ్చు. అయితే ప్రశాంత్​ కిశోర్​ ను నమ్ముకుంటే విజయానికి గ్యారెంటీ ఏమీ లేదు. అందువల్ల కేసీఆర్​ను ప్రశాంత్​ కిశోర్​ పెద్ద డైలమాలో పడేస్తారు. తన పార్టీలో, ప్రభుత్వంలో తన పాత్రను తగ్గించుకుని ప్రశాంత్​ కిశోర్​కు కేసీఆర్​ఎక్కువ పవర్స్​ఇస్తారా? అనేది కూడా కీలకమే. ప్రశాంత్​ కిశోర్​కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని సాధారణంగానే టీఆర్ఎస్​లీడర్లు జీర్ణించుకోలేరు. అయితే తమకు టికెట్లు వస్తాయా? రావా? అనేది తెలిసే వరకు మాత్రమే వాళ్లు సైలెంట్​గా ఉంటారు. ఆ తర్వాత వాళ్లంతా ఇతర పార్టీల్లో చేరేందుకు
 ఆసక్తి చూపిస్తారు.

కేసీఆర్​పై కేజ్రీవాల్​ ప్రభావం..
ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే కేజ్రీవాల్​పార్టీ  భిన్నమైనది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులంతా ధనవంతులే. రియల్​ఎస్టేట్, ఇసుక తవ్వకం, లిక్కర్​వ్యాపారం, ప్రైవేట్​కాలేజీలు, ఇతర వ్యాపారాలు చేసే వారే ఎక్కువ మంది. పెద్ద పెద్ద కార్లు, కొద్ది మంది ఫేస్​సెక్యూరిటీ గార్డులు, హంగామాతో తెలుగు పొలిటీషియన్లను మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు. అయితే కేజ్రీవాల్​పార్టీ దీనికి పూర్తిగా వ్యతిరేకం. స్కూటర్​ మాత్రమే ఉండే కామన్​మ్యాన్​దానికి లీడర్. కేసీఆర్​అవినీతిలో కూరుకుపోయారని, ఆయన ‘చిన్న మోడీ’అని కేజ్రీవాల్​పార్టీ విమర్శిస్తోంది. ఢిల్లీ, పంజాబ్​లో తనను తక్కువగా అంచనా వేసిన వారికి కేజ్రీవాల్​ఓటమి రుచి చూపించారు. కాంగ్రెస్​ను కోలుకోలేకుండా దెబ్బ తీశారు. కేసీఆర్​ను కేజ్రీవాల్​ఓడిస్తారని చెప్పలేం కానీ, తన విమర్శలతో కేసీఆర్​ను కేజ్రీవాల్​ఇరుకున పెట్టగలరు. ఇది కాంగ్రెస్, బీజేపీకి కలిసి వచ్చే అంశం. జాతీయ రాజకీయాల విషయానికి వస్తే కేసీఆర్ ప్రతిపక్షమే. తనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్న కేజ్రీవాల్, రాహుల్​గాంధీతో ఒకే వేదిక పంచుకోగలరా? స్టేజ్​పై వీరంతా నవ్వు కోవచ్చు. కానీ, తెలంగాణ విషయానికి వస్తే, ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఒకవేళ జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్​ రావాలని భావిస్తే, ఆయనకు స్నేహితులు కావాలి. కేజ్రీవాల్, రాహుల్​ ఆయనకు శత్రువులైతే అప్పుడు ఆయనకు మిత్రులు ఎవరు? ఒకవేళ కేసీఆర్ రాహుల్, కేజ్రీవాల్​తో స్నేహం కోరుకుంటే, అప్పుడు ఆయన ఒక కూటమి ఏర్పాటుకు ముందుకురావాలి