
నిర్మల్, వెలుగు: ఉత్తర తెలంగాణలోని కొన్ని ఏరియాల్లో బలంగా ఉన్న గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)ల మద్దతు కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. వీడీసీ మెంబర్ల ను మచ్చిక చేసుకునేందుకు గ్రామాలకు ఫండ్స్, పనులు మంజూరు చేయడంతోపాటు వారికి వ్యక్తిగతంగా కూడా నజరానాలు ముట్టజెప్తున్నాయి. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పల్లెల్లో వీడీసీలు సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్నాయన్నది బహిరంగ రహస్యమే. గ్రామ అభివృద్ధి పనుల్లో సూచనలు, సలహాలు ఇచ్చేందుకు మాత్రమే పనిచేసే వీడీసీలు క్రమంగా అన్ని వ్యవహారాలను ముందుండి నడిపిస్తున్నాయి. ప్రతి ఎన్నికల సమయంలో తమ పట్టును నిరూపించుకునే వీడీసీలు ఈసారి మాత్రం తమ ఆధిపత్యాన్ని మరింతగా చాటుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వీడీసీలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి.
వీడీసీ సభ్యులకు పార్టీల నజరానాలు!
గ్రామాల్లో వీడీసీలు సమాంతర పాలన నడిపిస్తున్నాయి. సామాజిక, గ్రామ బహిష్కరణలు లాంటి శిక్షలు వేస్తుండడంతో వాటిపై చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. అలాగే గ్రామాల్లో సహజ వనరులను వీడీసీలు ఆదాయంగా మార్చుకుంటున్నాయి. గ్రామంలో అభివృద్ధి పనుల పేరిట అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. వాగులలో ఇసుకకు టెండర్లు, మద్యం బెల్టు షాపులకు వేలం పాటలు నిర్వహించడంతోపాటు చివరకు కూల్ డ్రింక్ షాపులు, చికెన్ సెంటర్లకు కూడా వేలం వేస్తూ లక్షల రూపాయల్లో ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. అన్ని కూలాల నుంచి సభ్యులు ఉండడంతో వీడీసీ వ్యవస్థ రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలపై పెద్ద ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు గ్రామంలో నిర్వహించే కార్యక్రమాలకు వీడీసీ సభ్యులను ఆహ్వానిస్తున్నాయి. బీఆర్ఎస్ఏకంగా ప్రభుత్వ కార్యక్రమాలకు వారిని పిలిచి సన్మానిస్తున్నది. నిధుల కేటాయింపు, ఇతర అంశాలపై అభ్యర్థులు హామీ లిప్పిస్తున్నారు. మద్దతు ప్రకటిస్తే వీడీసీల సభ్యులకు పెద్ద మొత్తంలో నజరానాలను కూడా ముట్టజెప్పేందుకు ఒప్పందాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
పల్లెల్లో వీడీసీల సమాంతర వ్యవస్థ...
ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాల్లోని చాలా గ్రామాల్లో వీడీసీలు తమ ఆధిపత్యాన్ని చాటుకుం టున్నాయి. నిర్మల్ జిల్లాలోని 396 గ్రామపంచాయతీలకు గాను దాదాపు 300 గ్రామాల్లో వీడిసీలు పెత్తనం చెలాయిస్తున్నాయని అంటున్నారు. జగిత్యాల జిల్లాలోని మొత్తం 380 గ్రామపంచాయతీ లకు గాను కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ తదితర మండలాలలో అలాగే నిజామాబాద్ జిల్లాలోని 530 గ్రామపంచాయతీలకు గాను ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వీడీసీలదే ఆధిపత్యం కొనసాగుతుందంటున్నారు. కాగా కామారెడ్డి జిల్లాలో దాదాపు 20 నుంచి 50 వరకు గ్రామాల్లో వీడీసీలు అన్నీ తామై వ్యవహరిస్తున్నాయని చెబుతున్నారు.