పల్లెపైనే పార్టీల ఆశలు .. అర్బన్ ఏరియాలో 60 శాతానికి మించని పోలింగ్

పల్లెపైనే పార్టీల ఆశలు .. అర్బన్ ఏరియాలో 60 శాతానికి మించని పోలింగ్
  • రూరల్​ నియోజకవర్గాల్లో 80 శాతానికిపైగా ఓటింగ్
  • అందుకే గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టిపెట్టిన అభ్యర్థులు
  • ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు

హనుమకొండ, వెలుగు: లోక్​ సభ ఎన్నికలకు ఇంకో పది రోజుల సమయమే మిగిలి ఉండటంతో ఓరుగల్లులో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో స్పీడ్​ పెంచాయి. గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న పార్టీలు ఎక్కువగా రూరల్​ ఓట్లపైనే ఫోకస్​ పెట్టాయి. అర్బన్​ ఏరియాలో సగటున 60 శాతానికి మించి పోలింగ్​ నమోదు కాకపోవడం, అదే రూరల్​ ఏరియాలో మాత్రం 80 శాతానికి పైగా ఓట్లు పోలవుతుండటంతో పార్టీలన్నీ 'పల్లె' ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నాయి. అందుకే పట్టణ ప్రాంతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

సిటీలో వెరీ డల్.. 

వరంగల్ పార్లమెంట్​ నియోజకవర్గంలో వరంగల్​ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, స్టేషన్​ ఘన్​పూర్, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇందులో వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు కంప్లీట్ గా పట్టణ ప్రాంతంలోనే ఉన్నాయి. కాగా మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఈ రెండు సెగ్మెంట్లలో  పోలింగ్​ శాతం చాలా తక్కువగా నమోదవుతుంటుంది. అందులోనూ వరంగల్ పశ్చిమలో ఉద్యోగులు, టీచర్లు, గ్రాడ్యుయేట్లు, స్టూడెంట్లు ఎక్కువగా ఉండగా.. దానికి చైతన్యవంతమైన నియోజకవర్గంగా పేరుంది. కానీ ఓటింగ్ శాతంలో మాత్రం ఈ నియోజకవర్గం వెనుకబడే ఉంటోంది. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 59.1 శాతం పోలింగ్​ నమోదవగా.. 2023 ఎలక్షన్స్​లో 56.59 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. ఇక వరంగల్​ తూర్పులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ 2018 లో 73.45 శాతం ఓట్లు పోలవగా.. 2023లో 66.74 శాతం మంది మాత్రమే ఓట్లేశారు. పట్టణ ప్రాంతంలో ఉన్న తూర్పు, పశ్చిమలో అంతంతమాత్రంగానే పోలింగ్​ నమోదవుతుండగా.. రూరల్​ నియోజకవర్గాల్లో 80 శాతానికిపైగానే ఓటింగ్​ నమోదు కావడం విశేషం. వర్ధన్నపేటలో 80.23 శాతం, భూపాలపల్లి  82.10,  పరకాల 84.61, స్టేషన్​ ఘన్​పూర్ 86.44, పాలకుర్తిలో 86.88 శాతం ఓట్లు పోలయ్యాయి. 

రూరల్​ ఏరియాపైనే అభ్యర్థుల హోప్స్​

వరంగల్ పార్లమెంట్ స్థానంలో మొత్తంగా 18,24,466 మంది ఓటర్లుండగా.. అందులో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో 5,41,941 మంది ఉన్నారు. ఇక మిగతా 12,82,525 ఓట్లు మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో ఉన్నాయి. అర్బన్​ ఏరియాలోని రెండు నియోజకవర్గాలతో పోలిస్తే  రూరల్​ ఏరియాలోని వర్ధన్నపేట, స్టేషన్​ ఘన్​ పూర్​, పరకాల, భూపాలపల్లి, పాలకుర్తిలో పోలింగ్​ శాతం కాస్త మెరుగ్గానే ఉంటోంది. దీంతోనే ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఈ ఓట్లే కీలకమయ్యాయి. 2018, 2023 ఎలక్షన్స్​లో ఈ ఐదు నియోజకవర్గాల్లో 80 శాతానికిపైగా ఓటు హక్కు వినియోగించుకోగా.. పోలింగ్​ ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో పట్టుపెంచుకునేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 

అర్బన్​ ఓటర్లతో పోలిస్తే రూరల్​ ఓటర్లు మొగ్గుచూపినా బయటపడొచ్చనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం స్పీడప్​ చేస్తున్నారు. అక్కడి ఓటర్లను తమ వైపు తిప్పుకుంటే ఈజీగా గెలుస్తామని భావిస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో గ్రామాలు, డివిజన్ల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉంటే ఈసారి పోలింగ్ పై ఎండలు ప్రభావం చూపే ఛాన్స్​ ఉంది. ఫలితంగా అర్బన్​, రూరల్​ ఏరియాల్లో ఓటింగ్​ శాతం ఎంతో కొంత తగ్గే అవకాశమే కనిపిస్తోంది. కాగా అర్బన్​ ఏరియాలో జనాలు ఓటుకు దూరం ఉంటున్నారని రూరల్​ ఏరియాలపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థుల ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.