కొత్తగూడెం సీటుపై .. బడా నేతల గురి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :   కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయా పార్టీల లీడర్లు రెడీ అవుతున్నారు. సీపీఐ నుంచి పార్టీ స్టేట్​సెక్రెటరీ కూనంనేని సాంబశివరావు సిద్ధమవుతుండగా , మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్​  ఏదో ఓ పార్టీ నుంచిగానీ లేదంటూ ఇండిపెండెంట్​గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా క్యాండిడేట్లను ప్రకటించలేదు. బీఆర్​ఎస్​ క్యాండిడెట్​గా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును పార్టీ హైకమాండ్​ ప్రకటించింది.  

కొత్తగూడెం నుంచి పోటీ చేసుడే..

 కాంగ్రెస్​తో వామపక్షాలు పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్​తో పొత్తు ఉన్నా లేకున్నా సీపీఎం, టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసేందుకు కూనంనేని సన్నద్ధం అవుతున్నారు.  ఈ క్రమంలోనే  జిల్లాలో  ఆందోళనలు చేస్తున్న వారి వద్దకు వెళ్లి  మద్దతు తెలుపుతున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లోనూ కూనంనేని పాల్గొన్నారు.   మరోవైపు బీఆర్ఎస్​ నేత జలగం వెంకట్రావ్​ పోటీకి ప్లాన్​ చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యేగా వనమాపై  అనర్హత వేటు వేస్తూ,  జలగం వెంకట్రావ్​ను ఎమ్మెల్యేగా కొనసాగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై వనమా సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ నెల 10న కోర్టు తీర్పు రానుంది. వనమాపై అనర్హత వేటు వేస్తే జలగం ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉంది.    వనమాపై అనర్హత వేటుపడితే ఆ స్థానంలో బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేసేందుకు స్టేట్ హెల్త్​ డైరెక్టర్​ గడల శ్రీనివాసరావు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే టికెట్​ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేరును పరిశీలనలో ఉందనే ప్రచారం పార్టీలో కొనసాగుతోంది. ఒకవేళ సీటు కేటాయించకపోతే  ఏదైనా పార్టీ నుంచి లేదా ఇండిపెండెంట్​గానైనా జలగం పోటీ చేసే అవకాశాలున్నాయని  అనుచరులు పేర్కొంటున్నారు. వనమాపై కోర్టు తీర్పు తర్వాత జలగం తాను పోటీ చేసే విషయమై స్పష్టత ఇస్తారని అనుచరులు చెప్తున్నారు. 

కాంగ్రెస్​లో ఉత్కంఠ..

కాంగ్రెస్​ క్యాండిడేట్​పై పార్టీ క్యాడర్​లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎంపీ, టీపీసీసీ ఎన్నికల కమిటీ కో కన్వీనర్​ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పొంగులేటి పాలేరు, ఖమ్మం నుంచి పోటీ చేయాల్సి వస్తే కొత్తగూడెం నుంచి మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు, ఎడవల్లి కృష్ణ, నాగసీతారాములు, పొంగులేటి ప్రధాన అనుచరుడైన వూకంటి గోపాల్​రావు ప్రధానంగా టికెట్​ రేసులో ఉన్నారు. పోట్ల నాగేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ, నాగసీతారాములు ఎవరికి వారు టికెట్​ తనకే కన్ఫర్మ్​ అయిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ ప్రోగ్రాంలను ఎవరికి వారు చేపడుతున్నారు. బీజేపీ నుంచి కొత్తగూడెం టికెట్​ఆశిస్తూ దాదాపు 12 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. బీఎస్పీ నుంచి యెర్రా కామేశ్ పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ స్టేట్​ చీఫ్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నారు.