జీహెచ్ఎంసీలో ప్రచారం కోసం లీడర్ల చలో హైదరబాద్​

జీహెచ్‍ఎంసీ ఎలక్షన్​ క్యాంపెయిన్​లో వరంగల్​ నేతలు

టీఆర్‍ఎస్‍లో.. ఎంపీ నుంచి ఎంపీటీసీ వరకు

దుబ్బాక గెలుపుతో జోష్‍తో వెళ్లిన బీజేపీ కేడర్‍

సడన్‍గా ఆగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

వరంగల్‍ రూరల్‍, వెలుగు: గ్రేటర్‍ హైదరాబాద్‍ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో రూలింగ్‍, అపొజిషన్‍ అనే తేడా లేకుండా అన్ని పార్టీల లీడర్లు హైదరాబాద్‍ కు క్యూ కట్టారు. ఎలక్షన్లు జరిగేది జీహెచ్‍ఎంసీ పరిధిలో అయినా వారి గెలుపు బాధ్యతలు మాత్రం ఇక్కడి కేడర్‍కు అప్పజెప్పి టార్గెట్లు ఇచ్చారు. ఎన్నికల కమిషన్‍ పచ్చజెండా ఊపి నొటిఫికేషన్‍ ఇవ్వగానే.. ఆయా పార్టీల హైకమాండ్ల నుంచి జిల్లా సీనియర్‍ నేతలకు ఫోన్‍ కాల్స్​ వచ్చాయి. గ్రేటర్‍ పరిధిలోని ఫలానా నియోజకవర్గంలోని ఫలానా డివిజన్‍ ఇన్​చార్జి బాధ్యతలు నువ్వే చూడాలంటూ ఆర్డర్స్​ వచ్చాయి. దీంతో నేతలంతా పనులన్నీ పక్కనబెట్టి రాజధానికి వెళ్లారు.

ప్రెస్టేజ్‍ ఇష్యూ..

రాష్ట్రంలో గతంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే మాములుగా మంత్రులు, లేదంటే సీనియర్‍ లీడర్లను ఆ ప్రాంతానికి ప్రచారానికి పిలిచేవారు. గతేడాది హుజూర్‍నగర్‍, మొన్న దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారానికి సైతం జిల్లా నుంచి మెయిన్​ లీడర్లు మాత్రమే వెళ్లారు. కానీ గ్రేటర్‍ హైదరాబాద్‍ ఎన్నికల ప్రచారానికి మాత్రం టీఆర్‍ఎస్‍ పార్టీలో ఎంపీటీసీ నుంచి ఎంపీ వరకు.. ఎంపీపీ నుంచి మినిష్టర్‍ వరకు తరలివెళ్లారు. దుబ్బాకలో ఓడిపోవడంతో జీహెచ్‍ఎంసీ ఎన్నికలను టీఆర్‍ఎస్‍  ప్రెస్టేజ్‍ ఇష్యూగా తీసుకుంది. ఉమ్మడి వరంగల్​ నుంచి ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‍, ముగ్గురు ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు, రాష్ట్ర, జిల్లాస్థాయి కార్పొరేషన్‍ చైర్మన్లకు టీఆర్​ఎస్​ హైకమాండ్‍ డివిజన్‍ బాధ్యతలు అప్పజెప్పింది. ఆయా ప్రజాప్రతినిధులు వారికి తోడుగా మండల, గ్రామస్థాయిలో యాక్టివ్‍గా ఉండే మరో ఇరవై, ముప్పై మందిని వెంటబెట్టుకుని చలో హైదరాబాద్‍ అన్నారు.

దుబ్బాక జోష్‍తో బీజేపీ లీడర్లు..

ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి జిల్లాకు చెందిన పలువురు బీజేపీ  సీనియర్‍ లీడర్లు ఉమ్మడి వరంగల్‍ నుంచి ప్రచారానికి వెళ్లారు. ఊహించని రీతిలో అక్కడ బీజేపీ క్యాండిడేట్​ రఘునందన్‍రావు గెలువడంతో ఆ పార్టీకి కొత్త ఎనర్జీ వచ్చింది. ఇదే సమయంలో గ్రేటర్‍ హైదరాబాద్‍ ఎలక్షన్ల నోటిఫికేషన్‍ వచ్చింది. వరంగల్​ నుంచి బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయి లీడర్లు గుజ్జుల ప్రేమేందర్‍రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, తక్కలపల్లి రాజేశ్వరరావు, కొండేటి శ్రీధర్​, గుండె విజయరామారావు, రావు పద్మ, ఏనుగుల రాకేశ్‍రెడ్డి, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, ఎడ్ల అశోక్‍రెడ్డి, డాక్టర్‍ విజయ్‍చందర్‍రెడ్డి, కీర్తిరెడ్డి, హుస్సేన్‍ నాయక్‍  హైదరాబాద్‍ లో ప్రచారం చేసేందుకు వెళ్లారు. కాంగ్రెస్‍ నుంచి ములుగు ఎమ్మెల్యే సీతక్క, వరంగల్‍ అర్బన్‍, రూరల్‍ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్‍రెడ్డి, ఇనుగాల వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల రాజయ్యతో పాటు ఇతర జిల్లా లీడర్లు ప్రచారానికి రెడీ అయ్యారు.

For More News..

ఏసీబీ దాడులు జరుగుతున్నా మారని పోలీసులు