జూలూరుపాడు, వెలుగు : సీతారామ ప్రాజెక్టు నీరు జూలూరుపాడు మండలానికి అందించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా మండల కమిటీ ఆధ్వర్యంలో అఖిల పక్ష నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగునీరు అందించేందుకు సుమారు రూ.8 వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టును నిర్మించారన్నారు.
ఆ నీరును జిల్లా ప్రజలకు అందించకుండా ఖమ్మం జిల్లాకు తరలించేందుకు వినోబా నగర్ గ్రామం నుంచి ఏన్కూరుకు లింకు కెనాల్ నిర్మాణాన్ని చేపట్టారని, అది జూలూరుపాడు మండలానికి తీరని నష్టాన్ని కలిగిస్తోందని తెలిపారు. రోళ్లపాడు వద్ద మాజీ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన పాత డిజైన్ ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు జాటోత్ కృష్ణ, అరం రామయ్య, చీమలపాటి భిక్షం, గుండె పిన్ని వెంకటేశ్వర్లు, యాస నరేశ్, గోపాలరావు, మూడు చిట్టిబాబు, వల్లోజు రమేశ్, నరసింహారావు పాల్గొన్నారు.