గ్రాడ్యుయేట్‍ ఎమ్మెల్సీ రేసులో లీడర్లు .. ప్రధాన పార్టీల క్యాండేట్లపై తీవ్ర ఉత్కంఠ

  • టికెట్​రాకముందే పలువురు రంగంలోకి..
  • వరంగల్‍, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో గ్రౌండ్‍ వర్క్
  • పోటాపోటీ కార్యక్రమాలతో ఎన్నికల వేడి

వరంగల్‍, వెలుగు: గ్రాడ్యుయేట్‍ ఎమ్మెల్సీ బరిలో దూకేందుకు లీడర్లు సై అంటున్నారు. టికెట్లు ఇంకా ఖరారు కాకముందే మూడు ప్రధాన పార్టీల నుంచి పలువురు నేతలు రంగంలోకి దిగి, గ్రౌండ్​వర్క్​మొదలుపెట్టారు. పల్లారాజేశ్వర్​రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్​స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్‍ఎస్‍ ప్రయత్నిస్తుండగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‍ ఈ స్థానాన్ని గెలుచుకుని, తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది. ఇక అయోధ్యలో రామాలయం ప్రారంభంతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా పార్లమెంట్​ఎన్నికల్లోకి గ్రాండ్​గా దూసుకెళ్లాలనే ఆలోచనతో ఉంది.  

ముందస్తు ప్రచారంలో తీన్మార్‍ మల్లన్న

వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్‍ పార్టీ అభ్యర్థిగా జర్నలిస్ట్ వృత్తి  నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తీన్మార్‍ మల్లన్న(చింతపండు నవీన్‍ కుమార్‍) పేరు ప్రధానంగా వినపడుతోంది. మల్లన్న 2015లో నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి 13,033 ఓట్లు పొందారు. 2021లో రెండోసారి ఇదే స్థానం నుంచి ఎమ్మెల్సీ బరిలో దిగి సత్తా చాటారు.

84,118 మొదటి ప్రాధాన్యత ఓట్లతో కలిపి మొత్తంగా 1 లక్ష 49 వేల ఓట్లు సాధించి, రాష్ట్ర రాజకీయాలను తనవైపు చూసేలా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మల్లన్న గ్రాడ్యుయేట్‍ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముచ్చటగా మూడోసారి పోటీకి సిద్ధమయ్యారు. గతంలో రెండుసార్లు ఇండిపెండెంట్‍గా పోటీ చేసిన ఆయన, ఈసారి అధికార కాంగ్రెస్‍ పార్టీ టికెట్ ఓకే చేసుకున్నారనే ప్రచారం జోరందుకుంది.

పార్టీ పెద్దలు గ్రీన్‍ సిగ్నల్‍ ఇచ్చారని మల్లన్న సన్నిహితులు చెబుతున్నారు. తాను కాంగ్రెస్‍ అభ్యర్థి అనే ప్రచారం నిజమన్నట్లుగా.. మల్లన్న ఇప్పటికే వరంగల్‍ పశ్చిమ, భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాల్లో పర్యటించారు. వరంగల్​సిటీలో టీఎన్‍జీఓస్‍ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాల్లో స్థానిక కాంగ్రెస్‍ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాశ్‍రెడ్డితో కలిసి మల్లన్న ముందస్తు ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం నల్గొండ పరిధిలో గ్రౌండ్‍ వర్క్ చేసుకుంటున్నారు. 

ఢిల్లీ స్థాయిలో ప్రేమేందర్‍రెడ్డి లాబీయింగ్​

బీజేపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్‍ జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర జనరల్‍ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్‍రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదే స్థానం నుంచి 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన బరిలో నిలిచి 40 వేలకు పైగా ఓట్లు సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీఆర్‍ఎస్‍ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‍రెడ్డికి 1,11,812 ఓట్లు, ఇండిపెండెంట్‍గా తీన్మార్‍ మల్లన్నకు 84,118, ప్రొఫెసర్‍ కోదండరామ్​కు 71,126 ఓట్లు రాగా, బీజేపీ తరఫున పోటీ చేసిన ప్రేమేందర్‍రెడ్డి 39,306 ఓట్లు సాధించారు.

అప్పటి కాంగ్రెస్‍ అభ్యర్థి రాములు నాయక్‍కు 27,729 ఓట్లు వచ్చాయి. మొత్తంగా పల్లా రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ కోసం గుజ్జుల ప్రేమేందర్‍రెడ్డి మరోసారి ఢిల్లీస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. గుజ్జులకు పోటీగా పార్టీ అధికార ప్రతినిధిగా యాక్టివ్‍గా ఉండే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన డాక్టర్ ప్రకాశ్‍రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినబడుతోంది. వీరిద్దరితోపాటు అదే పార్టీలోని ఆలేరుకు చెందిన మరో సీనియర్‍ నేత కాసం వెంకటేశ్వర్లు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

సోషల్ క్యాంపెయిన్​లో ఏనుగుల..

పల్లా రాజేశ్వర్‍రెడ్డి రూపంలో నిన్న, మొన్నటి వరకు గ్రాడ్యుయేట్‍ ఎమ్మెల్సీ సిట్టింగ్ సీటు కావడంతో బీఆర్‍ఎస్‍ పార్టీ మరోసారి ఈ ఎమ్మెల్సీ స్థానంపై కాన్సంట్రేషన్‍ చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డిబేట్లు, సభల్లో యాక్టివ్‍గా కనిపించిన వరంగల్‍ జిల్లాకు చెందిన యువ నాయకుడు ఏనుగుల రాకేశ్‍రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లలో వరంగల్‍ పశ్చిమ టికెట్‍ ఆశించారు. పార్టీ పెద్దలు రావు పద్మకు కేటాయించడంతో బీఆర్‍ఎస్‍ పార్టీలో చేరారు. పల్లా రాజేశ్వర్‍రెడ్డి ద్వారా గులాబీ పార్టీలో చేరిన రాకేశ్‍రెడ్డి.. ఆయన ద్వారానే ఎమ్మెల్సీ క్యాండేట్​గా హైకమాండ్‍ నుంచి గ్రీన్​సిగ్నల్‍ తెచ్చుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాకేశ్‍రెడ్డి కొన్ని రోజులుగా పట్టభద్రులకు ఓటు నమోదు చేయించేలా అడుగులు వేస్తున్నారు. సోషల్‍ మీడియాలోనూ యాక్టివ్​గా ప్రచారం చేస్తున్నారు.