- నాగర్‌కర్నూల్‌లో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం
నాగర్‌కర్నూల్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తుండగా, బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల సమావేశాలపై దృష్టి పెట్టారు. ముందుగా బీజేపీ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కొడుకు భరత్‌ప్రసాద్‌ను క్యాండిడేట్‌గా ప్రకటించింది. ఆ తరువాత కాంగ్రెస్ క్యాండిడేట్‌గా మాజీ ఎంపీ మల్లు రవి పేరు ఖరారైంది. బీఎస్పీకి రాజీనామా చేసిన బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇటీవల వచ్చిన పండుగలను అన్ని పార్టీల నాయకులు ప్రచారానికి వినియోగించుకున్నాయి.
కాంగ్రెస్ క్యాండిడేట్ సుడిగాలి పర్యటనలు..
కాంగ్రెస్ క్యాండిడేట్ మల్లు రవి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒకే రోజు అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాలు కవర్ అయ్యేలా రోడ్ షోలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, సతీశ్ మాదిగ తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి జూపల్లి కృష్ణారావు తన నియోజకవర్గమైన కొల్లాపూర్ తో పాటు పక్కనే ఉన్న వనపర్తి, అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించాల్సి ఉంది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత తదితరులు ఎన్నికల ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. బీజేపీ మతతత్వ, విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మల్లు రవి తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను తమ కుటుంబ స్వార్థం కోసం బలి చేసిన కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాలకు ఈ ఎన్నికలు చివరివి కావాలని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు.
ముమ్మరంగా బీజేపీ ప్రచారం..
బీజేపీ క్యాండిడేట్‌కు మద్దతుగా ప్రధాని మోదీ నాగర్ కర్నూల్ బహిరంగ సభలో పాల్గొన్నారు. కల్వకుర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో ఎంపీ రాములు, పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. భరత్‌కు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు, వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, ఆచారి, దిలీపాచారి తదితరులు వాకర్స్ మీటింగ్స్, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు.
మోదీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అయోధ్య రామాలయ నిర్మాణం, అవినీతి, అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్, కవిత లిక్కర్ కేసు, మేడిగడ్డ కుంగుబాటుతో పాటు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని బీజేపీ నేతలు తమ ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా వాడుతున్నారు. ఇదిలాఉంటే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసిన బంగారు శృతి ప్రచారంలో కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ కార్యకర్తలతో మీటింగ్‌లు..
పొత్తు ధర్మానికి కట్టుబడి బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్ యాదవ్, బీరం హర్షవర్దన్‌రెడ్డి తదితరులు మీటింగ్లనుఏర్పాటు చేస్తున్నారు.
ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్రెడ్డి మినహా మిగిలిన వాళ్లు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇదిలాఉంటే బీఎస్పీ అధ్యక్షుడిగా ఆర్ఎస్పీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలను ఆయన ప్రత్యర్థులు, బీఎస్పీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.