జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఒప్పుకోం

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఒప్పుకోం
  • అట్ల చేస్తే దక్షిణాదికి తీరని నష్టం.. అఖిలపక్ష భేటీలో నేతల వెల్లడి
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం
  • అన్యాయాన్ని కలిసి కట్టుగా ఎదిరించాలి: భట్టి
  • అసెంబ్లీలో  ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి: అక్బరుద్దీన్ ఒవైసీ 
  • పోరాటాన్ని కొనసాగిద్దాం: కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ 
  • సమావేశానికి బీఆర్​ఎస్​, బీజేపీ దూరం

హైదరాబాద్, వెలుగు: జనాభా ప్రాతిపదికన నియో జకవర్గాల పునర్విభజనను ఒప్పుకునేది లేదని అఖిలపక్ష నేతలు తేల్చిచెప్పారు. ఇట్ల చేస్తే దక్షిణాది రాష్ట్రా లకు తీరని అన్యాయం జరుగుతుందని.. ఈ విధానాన్ని సహించేది లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యంగా ఉండేలా డీలిమిటేషన్​ జరగాలన్నారు.  డీలిమిటేషన్​ వ్యవహారంపై సోమవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. 

ఇందులో కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్, రిపబ్లిక్ కన్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు. బీఆర్​ఎస్​, బీజేపీ నేతలు పాల్గొనలేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్​ చేపడ్తే దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా తెలంగాణ నష్టపోతుందని.. దీనిపై పోరాడేందుకు చర్చలు, ఆలోచనలు చేయాలన్నారు. ‘‘మన గౌరవం, ప్రాధాన్యం కాపాడుకుంటూ... దేశంలో మన అందరి పాత్ర ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాం. 

సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ నేతలను కూడా ఆహ్వానించినప్పటికీ హాజరుకాలేదు. సమావేశంలో నేతలు ఇచ్చిన సూచనలు భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే దానికి దోహదపడుతాయి” అని ఆయన పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో  ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. 

కేంద్రం నియోజకవర్గాల పునర్విభజనపై ఆలోచన చేయకుండా, ప్రస్తుత విధానాన్నే కొనసాగించేలా ఒత్తిడి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఒక సైంటిఫిక్ నిర్ణయం వచ్చేవరకు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అన్నారు. 

ఉత్తరాదిలో పెరుగుతున్న సీట్ల శాతానికి తగ్గట్టు దక్షిణాది రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య పెంచాలని సీపీఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓవైపు డీలిమిటేషన్​ అంశంపై పోరాటం చేస్తూనే, మరోవైపు సైంటిఫిక్ పరిష్కారం కోసం రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు నిత్యం ఆలోచన చేయాలని పేర్కొన్నారు.

 సీపీఎం ఎంఎల్​ మాస్ లైన్ నేత హనుమేశ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ బాబు  తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇది ప్రాథమిక సమావేశమేనని, రాబోయే రోజుల్లో విస్తృతంగా చర్చలు చేపట్టాలని అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలు అన్నారు. డీలిమిటేషన్​ వ్యవహారంపై అఖిలపక్ష కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచరణలో పెట్టేందుకు సిద్ధమని వారు ప్రకటించారు.