బ్యాంక్ ​మేనేజర్​పై చర్య తీసుకోవాలి : అఖిలపక్షం నాయకులు

బ్యాంక్ ​మేనేజర్​పై చర్య తీసుకోవాలి : అఖిలపక్షం నాయకులు

వెల్దుర్తి, వెలుగు: రుణమాఫీ పూర్తయిన రైతులకు తిరిగి పంట రుణాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బ్యాంకు మేనేజర్ పై చర్య తీసుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. మాసాయిపేటలోని కెనరా బ్యాంక్ ముందు గురువారం రైతులతో కలిసి నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రూ.రెండు లక్షల లోపు రుణమాఫీ అయిన రైతులకు తిరిగి రుణాలు ఇవ్వకుండా సిబిల్ స్కోర్ ఉన్న రైతులకు మాత్రమే రుణాలు ఇస్తామని బ్యాంకు మేనేజర్ ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ఉన్న పంట రుణాలే కాకుండా ఇతర రుణాలను కూడా చెల్లించాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి కెనరా బ్యాంకు ద్వారా రైతులకు రుణాలు అందే విధంగా చూడాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాగేందర్ రెడ్డి, సిద్దిరామ గౌడ్, నరసింహులు, వేణు, పవన్ పాల్గొన్నారు.