జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్లో రాత్రి వేళలో వాహనాల రాకపోకల నిషేధాన్ని ఎత్తివేసేవరకు ఐక్యంగా ఉద్యమించాలని శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్లో ఎన్ఎస్యూఐ స్టేట్ సెక్రటరీ సోహేల్ షా అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. బీజేపీ మినహాయించి కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, స్వచ్ఛంద సంస్థల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. రాత్రి 9 గంటల తర్వాత వాహనాల రాకపోకలను నిషేదించడంపై తీవ్రంగా మండిపడ్డ అఖిలపక్ష నాయకులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని తీర్మానించారు.
సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎం.రాజశేఖర్, సుభాష్ రెడ్డి, ఇందయ్య, మోహన్ రెడ్డి, రియాజొద్దిన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ ఫసిఉల్లా, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఎస్.భరత్ కుమర్, మండల జనరల్ సెక్రటరీ ఎస్.జనార్దన్, సీపీఎం మండల సెక్రటరీ కె.ఆశోక్, లింగన్న, సీపీపీ మండల సెక్రటరీ దాసరి తిరుపతి, సామాజిక ఉద్యమకారుడు భూమాచారి, వర్తక సంఘం ప్రెసిడెంట్ వామన్ కుమార్, మాల మహానాడు నాయకులు జె.సురేశ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.