
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, జైశంకర్ , నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. పహల్గా ఉగ్రదాడిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై రాజకీయ ఏకాభిప్రాయం కోసం అఖిల పక్ష భేటీని ఏర్పాటు చేశారు. ఉగ్రదాడి అనంతరం చర్యలపై అఖిలపక్షానికి వివరణ ఇవ్వనున్నారు.
మంగళవారం పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌ను లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించిన తర్వాత ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌ను లక్ష్యంగా భారత్ దౌత్య సంబంధాలను తెంచుకుంది. పాకిస్తాన్ సైనిక అటాచ్‌లను బహిష్కరించింది. 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. అట్టారి పోస్టును మూసివేసింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.