ఒక్కటవుతున్న దక్షిణాది.. డీలిమిటేషన్ 30 ఏండ్లు ఆపాలని డిమాండ్

ఒక్కటవుతున్న దక్షిణాది.. డీలిమిటేషన్ 30 ఏండ్లు ఆపాలని డిమాండ్
  •  సౌత్ స్టేట్స్ తో జేఏసీ  ఏర్పాటు దిశగా అడుగులు
  • తమిళనాడు ఆల్ పార్టీ మీటింగ్ లో నిర్ణయం
  • ఉమ్మడి కార్యాచరణతో కేంద్రంపై పోరాటానికి నిర్ణయం

హైదరాబాద్: డీలిమిటేషన్‎పై దక్షిణాది రాష్ట్రాలు ఒక్కటవుతున్నాయి. మరో 30 ఏండ్ల వరకు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవద్దని డిమాండ్ చేస్తున్నాయి. కొంతకాలంగా ఈ వాదనను బలంగా వినిపిస్తోన్న ద్రవిడ పార్టీలు ఇవాళ చెన్నైలో సమావేశమయ్యాయి. తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంట్​నియోజకవర్గాల సంఖ్యను మరో 30 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని జేఏసీగా ఏర్పాటు కావాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

అఖిల పక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. 'జనాభా నియంత్రణ సరిగ్గా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లను తగ్గించడం అన్యాయం. దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయ్ 2001లో తాను  ఇచ్చిన మాట ప్రకారం 2026 వరకు పొడిగించారు. మరో 30ఏళ్ల పాటు పార్లమెంట్ సీట్ల సంఖ్యను ఇప్పుడున్న ప్రకారమే కొనసాగించాలి. ఇతర రాష్ట్రాలు కూడా జనాభా నియంత్రణ పాటించేలా చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.