![సుప్రీం చెప్పినా జర్నలిస్టులకు జాగా ఇయ్యరా?: అఖిలపక్ష నేతలు](https://static.v6velugu.com/uploads/2023/07/Jawaharlal-Nehru-Journalist_tkKF0SReGd.jpg)
- రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అఖిలపక్ష నేతలు
- ధర్నాచౌక్‌లో జేఎన్‌జే సభ్యుల మహాధర్నాకు మద్దతు
ముషీరాబాద్, వెలుగు: జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ(జేఎన్‌జే హెచ్ఎస్)కి చెందిన 70 ఎకరాల స్థలం జర్నలిస్టులదేనని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు. స్రుపీంకోర్టు తుదితీర్పును అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్న ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. జేఎన్‌జే హెచ్ఎస్సభ్యులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. మంగళవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో జేఎన్‌జే హెచ్ఎస్ సభ్యులు నిర్వహించిన మహాధర్నాకు కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఆమ్‌ఆద్మీ పార్టీలతోపాటు జర్నలిస్ట్ సంఘాల, ప్రజాసంఘాల నేతలు హాజరై మద్దతు తెలిపారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ ఇప్పటికి నాలుగుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా జేఎన్‌జే హౌసింగ్‌సొసైటీకి 70 ఎకరాల స్థలం కేటాయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. కేసులో ఇరుకున్న ఈ స్థలంపై సుప్రీం కోర్టు తుదితీర్పు వచ్చినప్పటికీ ప్రభుత్వం సొసైటీకి ఆ స్థలాలను స్వాధీనం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ సభ్యులు దీనిపై కంటెంప్ట్ ఆఫ్కోర్టుకు వెళ్లాలని సూచించారు. ఆ స్థలం జేఎన్ జే హౌసింగ్సొసైటీ డబ్బులు పెట్టి కొనుగోలు చేసిందే తప్ప ప్రభుత్వం దానంగా ఇచ్చేది కాదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు అన్నారు. జర్నలిస్టులకు తమ పార్టీ తరఫున పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల న్యాయమైన పోరాటానికి తమ పూర్తి మద్దతు వుంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. జేఎన్‌జే హెచ్ఎస్ సభ్యులు చేస్తున్న పోరాటం సహేతుకమైనదనని, వారికి తమ మద్దతు ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జి.నరసింహారావు అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతునిచ్చిన జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలంగాణ ఆత్మగౌరవ వేదిక కన్వీనర్ ఇందిరా శోభన్ అన్నారు. జర్నలిస్టులపై పాలకులకు నిజమైన ప్రేమ ఉంటే సుప్రీం కోర్టు తీర్పు మేరకు తక్షణమే వారి భూమి వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ సంధ్య, అరుణోదయ విమలక్క, సీనియర్జర్నలిస్టు విరాసత్ అలీ, ఆప్‌నేత రాములు గౌడ్, జేఎన్‌జే సభ్యులు పీవీ రమణారావు, బోడపాటి శ్రీనివాసరావు, హసన్ షరీఫ్, కొండం అశోక్‌రెడ్డి, మంజుల, భవానీ తదితరులు హాజరయ్యారు.