ఖమ్మంలో మిర్చిబోర్డును ఏర్పాటు చేయాలి

ఖమ్మంలో మిర్చిబోర్డును ఏర్పాటు చేయాలి
  • మిర్చి పంటను ఆహార పంటగా గుర్తించాలి
  • అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేసి క్వింటాలు  రూ. 25 వేల చొప్పున కొనుగోలు చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. సోమవారం సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్, మాస్లైన్ పార్టీలు అనుబంధ రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించాయి.  ఈ సందర్భంగా వివిధ పక్షాల నేతలు మాట్లాడుతూ..  ఖమ్మంలో ప్రధాన పంటల్లో మిర్చి ఒకటని ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడం తదితర కారణాలతో  పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు.

గతేడాది ఇదే సమయంలో క్వింటాలు మిర్చి రూ. 20 వేలకు కొన్నారని ఇప్పుడు కేవలం రూ.12 వేల నుంచి రూ.13 వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని నేతలు ఆరోపించారు.  ఖమ్మంలో మిర్చి సాగుకు అనుకూలంగా మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. క్వింటా రూ.25 వేల చొప్పున కొనుగోలు చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని నేతలు తెలిపారు. 

మిర్చి పంటను ఆహార పంటల జాబితాలో చేర్చాలి 

రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు హేమంతరావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు,మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్‌ మాట్లాడుతూ..  మిర్చి పంటను ఆహార పంటల జాబితాలో చేర్చి మద్దతు ధర ఇవ్వాలని కోరారు.  కొండబాల కోటేశ్వరరావు,  బానోత్ చంద్రావతి,  దొండపాటి రమేశ్, కొండపర్తి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.