ప్రాణహితకు ప్రాణం పోస్తం : ఉత్తమ్

  • వచ్చే ఎండాకాలంలోగా తుమ్మిడిహెట్టి వద్ద పనులు మొదలుపెడ్తం: ఉత్తమ్
  • కృష్ణా జలాల్లో 70 శాతం వాటా కోసం కొట్లాడుతున్నం
  • రాయలసీమ లిఫ్ట్​ స్కీమ్​పై వారంలో సుప్రీంకు వెళ్తాం
  • తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పెండింగ్​ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినం  
  • కాళేశ్వరం నీళ్లు లేకుండానే కోటిన్నర టన్నుల వడ్లు పండినయ్  
  • 1.87 లక్షల మంది రైతులకు సన్నొడ్ల బోనస్ రూ.500 ఇచ్చినం
  • ఏడాదిలోనే సివిల్​సప్లయ్స్ లో రూ.11 వేల కోట్ల అప్పు తీర్చినం 
  • ‘వెలుగు’ ఇంటర్వ్యూలో మంత్రి వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  కాళేశ్వరం కోసం గత బీఆర్ఎస్​ ప్రభుత్వం పక్కనపెట్టిన ప్రాణహిత ప్రాజెక్టును తాము చేపడ్తామని, వచ్చే ఎండాకాలం కల్లా తుమ్మిడిహెట్టి వద్ద పనులు ప్రారంభిస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. తొలి ఏడాది తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పెండింగ్​ప్రాజెక్టులపై ఫోకస్​పెట్టి సక్సెస్​ అయ్యామని, ఇక తర్వాతి ప్రయారిటీ ప్రాణహితే అని చెప్పారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా పదేండ్లలో నిర్లక్ష్యానికి గురైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 2లక్షల ఎకరాల ఆయకట్టుకు​ నీళ్లిస్తామన్నారు. 

కృష్ణా జలాల్లో 70 శాతం వాటా కోసం కొట్లాడుతున్నామని, రాయలసీమ లిఫ్ట్​ స్కీమ్​పై వారంలో సుప్రీంకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. ఈసారి కాళేశ్వరం నుంచి చుక్కనీరు రాకున్నా  కోటిన్నర టన్నుల ధాన్యం పండిందని, ఈ రికార్డు సాధించిన రైతులకు తమ ప్రభుత్వం తరఫున సెల్యూట్​ చేస్తున్నామన్నారు.తాను సివిల్​సప్లయ్స్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే ఆ శాఖలో ప్రక్షాళన ప్రారంభించానని, దీంతో ఒక్క ఏడాదిలో రూ.11 వేల కోట్ల అప్పు తీర్చగలిగామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రజాపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ‘వెలుగు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..  

ప్రాణహిత కట్టి తీరుతాం.. 

వచ్చే ఎండాకాలం కల్లా ప్రాణహిత ప్రాజెక్టుకు ప్రాణం పోస్తాం. ఈ టర్మ్​లోనే తుమ్మిడిహెట్టి వద్ద పనులకు శ్రీకారం చుడ్తాం.డిజైన్లు, వాటర్​ స్టడీస్​పై రీఎగ్జామిన్​ చేస్తం. ఆయకట్టు, లొకేషన్​పైనా మరోసారి స్టడీ చేయిస్తం. అంచనాలు రెడీ చేయిస్తం. రాష్ట్రానికి ఏది మంచిదో అదే చేస్తం. దీనిపై ముందుగా కేబినెట్​లో చర్చిస్తాం. గతంలో కాంగ్రెస్​ హయాంలో రూ.38,500 కోట్లతో ‘అంబేద్కర్​ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి’ పేరుతో ప్రాజెక్టును చేపట్టాం.

 కానీ, బీఆర్ఎస్​వాళ్లు దాన్ని రీడిజైన్​ పేరుతో రూ.లక్షన్నర కోట్లకు పెంచి, ప్రాజెక్టు స్థలాన్ని మేడిగడ్డకు మార్చారు. ఆయకట్టు పాతదే అయినా ఆగమాగం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టును కట్టి తీరుతం. తద్వారా ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. 

మూసీ ప్రాజెక్టును పూర్తిగా సమర్థిస్తున్నా.. 

నల్గొండ జిల్లా నేతగా, నల్గొండ రైతుగా మూసీ ప్రాజెక్టును పూర్తిగా సమర్థిస్తున్నాను. మూసీ విషం నుంచి నల్గొండ జిల్లా వాసులను, అక్కడి పంటలను, పశుపక్ష్యాదులను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే మూసీ పునరుజ్జీవనాన్ని మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. కానీ మూసీ ప్రాజెక్టును మొదలుపెట్టకుండానే ప్రతిపక్ష నేతలు లక్షల కోట్ల కుంభకోణమంటూ ఆరోపణలు చేస్తున్నారు. 

ఇలాంటి ఆరోపణల్లో అర్థం లేదు. ఇక నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్​బీసీ ప్రాజెక్టును పదేండ్ల పాటు గత బీఆర్ఎస్​సర్కార్​ నిర్లక్ష్యం చేసింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్​బిల్లులు చెల్లించి, స్పేర్​పార్ట్స్​తెప్పించి పనులు స్పీడప్​ చేశాం. మరో రెండేండ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.

కాళేశ్వరంపై మాకు ఏ దురుద్దేశం లేదు.. 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను బీఆర్ఎస్​హయాంలోనే నిర్మించారు. వారి హయాంలోనే కూలిపోయాయి. మేమేం చేయలేదు. కాళేశ్వరం జ్యుడీషియల్ ​కమిషన్​ చైర్మన్​ జస్టిస్ పినాకి చంద్రఘోష్.. ఓ టెక్నికల్​ కమిటీ వేశారు. ఆ కమిటీ చెప్పిన మేరకే మేడిగడ్డకు గ్రౌటింగ్​ చేశారు. ఆ ప్రాజెక్టులపై మాకు ఏ దురుద్దేశం లేదు. మేడిగడ్డ దెబ్బతిన్నా కూడా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు బాగానే ఉన్నాయి కదా.. వాడుకోవచ్చా? అని నేనే స్వయంగా ఎన్​డీఎస్​ఏను అడిగాను. 

కానీ అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ సీకెంట్​పైల్స్​టెక్నాలజీనే వాడారని, కాబట్టి పూర్తి పరీక్షలు అయ్యే వరకు గేట్లు తెరిచే ఉంచాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల సొమ్ముతో కట్టారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కావొద్దన్నదే మా ఉద్దేశం. ఆ ప్రాజెక్టును ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటాం. 

ఇరిగేషన్ లో ఇకపై ఎక్స్​టెన్షన్స్​ ఉండవు.. 

ఇరిగేషన్​శాఖను గాడిలో పడుతోంది. కొత్తగా 700 మంది ఇంజనీర్లను తీసుకున్నాం.  కొత్తగా 1,238 ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్​కమిషన్​కు అనుమతిచ్చినం. 1,597 లష్కర్​లు, 287 మంది సహాయకుల నియామకాలకు ఆదేశాలిచ్చినం. ఇక శాఖను రీస్ట్రక్చర్​చేసే టైంలో కొంత మంది ఇంజనీర్లు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మేం స్టే వెకేట్​ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​లో ఎక్స్​టెన్షన్లు ఇకపై ఉండవు. ఎవరికీ  ఇవ్వలేదు.   

సివిల్​సప్లయ్స్​శాఖను ప్రక్షాళన చేస్తున్నాం.. 

నేను సివిల్​సప్లయ్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ శాఖకు రూ.58,630 కోట్ల అప్పులు ఉన్నాయి. క్రమంగా ఆ శాఖను ప్రక్షాళన చేస్తూ  ఏడాదిలో రూ.11,600 కోట్ల అప్పు తిరిగి చెల్లించాం.  బ్యాంక్​ గ్యారంటీలు తీసుకున్నాకే ధాన్యం కేటాయిస్తున్నాం. ఆర్అండ్ ఆర్ యాక్ట్​ ద్వారా డీఫాల్టర్ల నుంచి రికవరీ కూడా చేస్తున్నాం.  

కాళేశ్వరం లేకున్నా కరువుదీరా ధాన్యం.. 

కాళేశ్వరం నుంచి చుక్కనీరు రాకున్నా రైతులు 66.76 లక్షల ఎకరాల్లో కోటిన్నర టన్నుల ధాన్యం పండించారు. ధాన్యం అమ్మకాల ద్వారా అన్నదాతల చేతుల్లోకి రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లు వచ్చాయి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. ఇప్పటిదాకా కొనుగోలు కేంద్రాల్లో  1,87,532 మంది రైతులు సన్నవడ్లకు బోనస్​ అందుకున్నారు. మేము ఇస్తున్న బోనస్​వల్ల బయట వ్యాపారులు కూడా సన్నవడ్లకు మంచి రేటు పెడ్తున్నారు.

త్వరలోనే రేషన్​కార్డులు..  

అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్​కార్డులు ఇస్తం. సివిల్​సప్లయ్స్​శాఖలో ఆ కసరత్తు జరుగుతున్నది. మేం సన్నబియ్యానికి రూ.500 బోనస్​ఇచ్చే సరికి బయట మిల్లర్లు, వ్యాపారులు కూడా క్వింటాల్​కు రూ.2,800 నుంచి రూ.3వేల దాకా పెడ్తున్నరు. గతంలో క్వింటాల్​కు రూ.1,800 నుంచి రూ.2వేలకు మించి పెట్టలేదు. నిజంగా ఇది మా ప్రభుత్వ విజయం. మిల్లర్లు ఎక్కువగా కొనడం వల్ల మేం ఇప్పటివరకు 12 లక్షల టన్నుల సన్నాలే కొన్నం. పీడీఎస్​ద్వారా సన్న బియ్యం ఇవ్వాలంటే 35 లక్షల టన్నుల వడ్లు కావాలి. ఇప్పుడిప్పుడే సెంటర్లకు సన్నవడ్లు వస్తున్నందున సేకరణ పెద్ద కష్టం కాబోదు. యాసంగిలో కూడా  సన్నాలకు బోనస్​కంటిన్యూ అవుతుంది. దొడ్డు వడ్లకు మాత్రం బోనస్ ఉండదు.

రాయలసీమ లిఫ్ట్​పై సుప్రీంలో కేసు వేస్తం..

కృష్ణా జలాల్లో మనకు న్యాయంగా రావాల్సిన వాటాను గత బీఆర్ఎస్​సర్కార్ వదులుకున్నది. 812  టీఎంసీల్లో 299 టీఎంసీల వాటాకే ఒప్పుకున్నది. కానీ మా ప్రభుత్వం కృష్ణా జలాల్లో 70శాతం వాటా సాధించడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తోంది. శ్రీశైలం డెడ్​స్టోరేజీ నుంచి నీటిని తరలించుకుపోయేలా ఏపీ రాయలసీమ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. గత ప్రభుత్వం దాన్ని అడ్డుకునే చర్యలు తీసుకోలేదు. మా ప్రభుత్వం తరఫున వారం రోజుల్లో రాయలసీమ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాం. ఆ ఒక్క ప్రాజెక్టే కాకుండా శ్రీశైలం బ్యాక్​వాటర్​ఆధారంగా ఏపీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులపైనా న్యాయపోరాటం చేస్తాం. ఇక నాగార్జునసాగర్​ప్రాజెక్టును మన చేతుల్లోకి తెచ్చుకునేందుకు చట్టం ప్రకారం ఏం చేయాలో అది చేస్తాం. 

మా ప్రభుత్వం ఇరిగేషన్​ప్రాజెక్టులకు తప్పకుండా ప్రాధాన్యం ఇస్తుంది. నీటి కేటాయింపులు లేకుండానే గత ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, సీతారామసాగర్, సమ్మక్కసాగర్​చేపట్టింది. కానీ మేం అధికారంలోకి రాగానే నీటి కేటాయింపులు చేసేలా చొరవ తీసుకున్నాం. గత ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేసి పోయింది. ఇప్పుడు తిరిగి చెల్లించాల్సిన టైం వచ్చింది.  క్రమపద్ధతిలో తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అదే సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టుల పూర్తికి ప్రయత్నిస్తున్నాం.  

సామాజిక న్యాయానికి పెద్దపీట.. 

కాంగ్రెస్​అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. మేము ఎక్కడో ఐవరీ టవర్లలోనో.. లేదంటే ఫాంహౌస్​లలోనో ప్రజలకు దూరంగా ఉంటలేము.  సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులమంతా 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రజలు మా దృష్టికి తెచ్చిన సమస్యలను వెంటవెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. గతంలో వన్​ఫ్యామిలీ, వన్​మ్యాన్​షో ఉండేది. ఇప్పుడలా కాదు.. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేపడుతున్నాం. మా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధిని రెండు కండ్లలా ముందుకు తీసుకెళ్తున్నాం.

పెండింగ్​ప్రాజెక్టులపై ఫోకస్.. ​  

తొలి ఏడాది తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పెండింగ్​ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినం. ఉమ్మడి మహబూబ్​నగర్​, నల్గొండ, ఖమ్మం జిల్లాలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. అదే సమయంలో మిగిలిన జిల్లాల్లోని పెండింగ్​ప్రాజెక్టులకూ ప్రయారిటీ ఇస్తున్నాం. ఉదాహరణకు సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, పెద్దపల్లి జిల్లాలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.572 కోట్లు కేటాయించాం. ఇదే పెద్దపల్లి జిల్లాలో పత్తిపాక రిజర్వాయర్​ను చేపడ్తున్నాం. మాకు ఏ జిల్లాపై వివక్ష లేదు. అన్ని జిల్లాలూ మాకు సమానమే.