హైదరాబాద్ : రాష్ట్రానికి కొత్త డీజీపీగా నియమితులైన అంజనీకుమార్కు డీజీపీ మహేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంజనీకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ శాఖ మరింత బలపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన సర్వీస్ లో హోంగార్డ్ నుంచి పోలీస్ ఆఫీసర్ల వరకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి మహేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో శాంతిభద్రతల గురించి అపోహలున్నా.. వాటిని అధిగమించి శాంతియుతంగా ముందుకెళ్తున్నామని మహేందర్ రెడ్డి తెలిపారు. ఆపదలో ఉన్నవారికి పోలీసులున్నారనే నమ్మకాన్ని పోలీస్ వ్యవస్థ ఇచ్చిందన్నారు.
పోలీసులందరూ టెక్నాలజీతో అప్డేట్ అవ్వాలి
పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారి జీతభత్యాలు, సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసులకు 30శాతం అలవెన్సులు, హోంగార్డులకు 20 వేల జీతాన్ని ఇస్తుందన్నారు. ఇప్పటికే 27 వేల పోలీసులను రిక్రూట్ చేసుకోగా... త్వరలో మరో 17 వేల మంది పోలీస్ శాఖలో చేరనున్నారని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నో కేసులు పరిష్కరించామని మహేందర్ రెడ్డి చెప్పారు. అయితే రానున్న రోజుల్లో నేరాలన్ని డిజిటల్ రూపంలో జరుగుతాయి కాబట్టి... పోలీసులందరూ టెక్నాలజీతో అప్డేట్ అవ్వాలని సూచించారు. విజనరీని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేసిందని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవాళ పదవీ విరమణ చేయనున్న డీజీపీ మహేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. 36 ఏళ్ల పాటు పోలీస్ డిపార్ట్ మెంట్ లో మహేందర్ రెడ్డి వివిధ హోదాల్లో సేవలు అందించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో డీజీపీ మహేందర్ రెడ్డికి వీడ్కోలు పలకనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ఐపీఎస్ లు హాజరుకానున్నారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు డీజీపీ కార్యాలయంలో అంజనీ కుమార్ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.