భద్రాచలం, వెలుగు : భద్రాచలం గ్రామపంచాయతీని మూడు పంచాయతీలుగా విభజిస్తూ పంచాయతీరాజ్చట్ట సవరణ బిల్లుపై గవర్నర్ సంతకం పెట్టడంపై రగడ మొదలైంది. జీవో నంబర్45 రద్దు చేయాలంటూ భద్రాచలంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దక్షిణ అయోధ్య, మేజర్ పంచాయతీని విభజిస్తే భద్రాచలం తన అస్తిత్వాన్ని కోల్పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022 నుంచే ఈ ఆందోళన కొనసాగుతోంది. 2022 డిసెంబర్16న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాచలం మేజర్ పంచాయతీని మూడు, బూర్గంపాడు మండలం పారిశ్రామిక ప్రాంతం సారపాక మేజర్ పంచాయతీని రెండు పంచాయతీలుగా విభిజిస్తూ జీవో నంబర్45ను తీసుకొచ్చింది.
భద్రాచలం పట్ణణాన్ని భద్రాచలం(21వార్డులు), సీతారాంనగర్(17 వార్డులు), శాంతినగర్(17వార్డులు), సారపాక(17వార్డులు), ఐటీసీ సారపాక(15వార్డులు)గా విభజన చేశారు. 2023 ఫిబ్రవరి 11న అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో నిరసనలు వెల్లువెత్తాయి. నాటి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కూడా గవర్నర్‌ను కలిసి బిల్లుపై అభ్యంతరం తెలిపారు. దీంతో గవర్నర్బిల్లును ప్రభుత్వానికి తిరిగి వెనక్కు పంపించారు. అయినా కేబినెట్ఆమోదం తెలిపి బిల్లును తిరిగి గవర్నర్‌కు పంపించింది. ఇదే సమయంలో ఎన్నికలు రావడం, నిరసనలు వ్యక్తం కావడంతో ఆపారు.
సర్వత్రా వ్యతిరేకత..
భద్రాచలం మేజర్ పంచాయతీ 2100 ఎకరాల్లో విస్తరించి ఉంది. 80వేల జనాభా, 40 కాలనీలు, 25వేల ఇళ్లు ఉన్నాయి. 2001లో ప్రభుత్వం టౌన్షిప్ చేసింది. కానీ కోర్టును ఆశ్రయించడంతో 2013లో టౌన్‌షిప్‌ను రద్దు చేసి తిరిగి మేజర్ పంచాయతీగా ఎన్నికలు నిర్వహించారు. 2018 వరకు పంచాయతీగా ఉండగా మళ్లీ మున్సిపాల్టీ ప్రతిపాదన వచ్చింది. దాన్ని స్థానికులు వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఎన్నికలు లేవు. ప్రస్తుతం పంచాయతీని మూడు పంచాయతీలుగా విభజించే ప్రక్రియలో ప్రజాభిప్రాయసేకరణ జరపలేదనేది ప్రధాన ఆరోపణగా ఉంది. 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నందున పీసా చట్టం ప్రకారం గ్రామసభ నిర్వహించి, తీర్మానం మేరకే బిల్లును రూపొందించాలి. ప్రజల మనోగతానికి వ్యతిరేకంగా పంచాయతీ విభజన జరిగిందని మొదటి నుంచి కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, టీడీపీ తదితర పార్టీలు ఆరోపిస్తున్నాయి. భద్రాచలం బంద్ కూడా నిర్వహించారు. తాజాగా బీఆర్ఎస్ నుంచి కూడా వ్యతిరేకత మొదలైంది. భద్రాచలం అస్తిత్వాన్ని కోల్పోతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.
బిల్లు వెనక్కి తీసుకోవాలి
భద్రాచలాన్ని ఒకటే పంచాయతీగా కొనసాగించాలి. ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కు తీసుకోవాలి. భద్రాచలం అస్తిత్వానికే ప్రమాదం. ఇప్పటికే రాష్ట్ర విభజన వల్ల భద్రాచలం చాలా నష్టపోయింది. పరిపాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రజలు అభివృద్ధికి దూరమవుతారు.
మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు
అభ్యంతరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ బిల్లు గవర్నర్ వద్దకు వెళ్లింది. చాలా మంది ప్రజలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న మాట వాస్తవమే. వారి అభ్యంతరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఇప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ వ్యవహారంపై వివరించాను. ప్రజల మనోగతం మేరకే చేద్దామన్నారు.
డాక్టర్తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్యే, భద్రాచలం