- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
- ములుగు, భూపాలపల్లి జిల్లాలో 4 గంటలకే క్లోజ్
- పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది
- ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు
- ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 189 మంది క్యాండిడేట్లు
హనుమకొండ/మహబూబాబాద్/జనగామ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మొత్తం 12 నియోజకవర్గాల్లో 189 మంది బరిలో నిలిచారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, భూపాలపల్లి జిల్లాలో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు చేపట్టారు.
బుధవారం ఆయా నియోజకవర్గాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. వారు ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. గురువారం ఉదయమే పోలింగ్ ప్రారంభించేందుకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రంలో తాగునీటి సౌకర్యం, దివ్యాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించనున్నారు.
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ..
హనుమకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ నియోజకవర్గాల్లో మొత్తం 5,08,124 మంది ఓటర్లు ఉండగా, జిల్లా వ్యాప్తంగా 484 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో 7,56,608 మంది ఓటర్లకు 791 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జనరల్ అబ్జర్వర్ హెచ్‌ఎన్.గోపాలకృష్ణ, పోలీస్ అబ్జర్వర్ తోగో ఖర్గా, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించి, పోలింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పా్ట్లపై సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ.బారీకి సూచనలు ఇచ్చారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో 4 వేలకు పైగా పోలీస్ సిబ్బందిని కేటాయించారు. వీరికి తోడు మరో 1,700లకు పైగా కేంద్ర బలగాలు కూడా విధుల్లో ఉన్నట్లు సీపీ అంబర్ కిశోర్ ఝా చెప్పారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీపీ తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలో..
మహబూబాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,53,342 మంది ఓటర్లు ఉండగా 283 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 170 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 76 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆఫీసర్లు చెప్పారు. 37 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చేపట్టారు. డోర్నకల్ నియోకవర్గంలో మొత్తం 2,19,264 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనుండగా 256 బూత్‌లలో 1,230 మంది సిబ్బందిని కేటాయించారు. 31 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఆఫీసర్లు చెప్పారు.
జనగామ జిల్లాలో 4,144 మంది పోలింగ్ స్టాఫ్
జనగామ జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బంది సామగ్రిని తీసుకొని కేంద్రాలకు తరలివెళ్లారు. జనగామ నియోజకవర్గంలో 2,37,108 మంది ఓటర్లకు 277 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1,332 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 2,49,155 మంది ఓటర్లకు 290 పోలింగ్ కేంద్రాలు, 1,396 మంది సిబ్బంది, పాలకుర్తి నియోజకవర్గంలో 2,51,490 మంది ఓటర్లకు 294 పోలింగ్
కేంద్రాలు, 1,436 మంది సిబ్బందిని కేటాయించారు. ప్రతి నియోజకవర్గంలో 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 5 ఉమెన్ పోలింగ్ కేంద్రాలు, దివ్యాంగులు, యువ పోలింగ్ కేంద్రాలను ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 2,500ల మందికి పైగా పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ సీతారాం చెప్పారు.
భూపాలపల్లి, ములుగులో 4 గంటల వరకే...
జయశంకర్ భూపాలపల్లి/ములుగు, వెలుగు : భూపాలపల్లి, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గురువారం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల ఆఫీసర్లు ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. భూపాలపల్లి నియోజకవర్గంలో మొత్తం2,73,633 ఓటర్లు ఉండగా 8 మండలాల్లో 317 పోలింగ్ కేంద్రాలు, 1,520 మంది సిబ్బందిని నియమించారు.
93 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 17 మావోయిస్టు ప్రభావిత ప్రాంత పోలింగ్ కేంద్రాలుకు గుర్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ములుగు నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,26,366 మంది ఓటర్లు ఉండగా 303 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 98 సమస్యాత్మక, 83 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.