ఇంటర్ ప్రాక్టికల్స్​కు అంతా సిద్ధం.. గ్రేటర్​లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఇంటర్ ప్రాక్టికల్స్​కు అంతా సిద్ధం.. గ్రేటర్​లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో ఇంటర్ ప్రాక్టికల్​ఎగ్జామ్స్ నేటి నుంచి ప్రారంభం కానుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్​జిల్లాలో 34,549 జనరల్, 7,352 మంది ఒకేషనల్ విద్యార్థులు ప్రాక్టికల్స్ కు హాజరుకానున్నారు. జిల్లాలో197 జనరల్, 57 ఒకేషనల్ తో కలిపి 254 సెంటర్లలో పరీక్షలు​నిర్వహించనున్నారు. గతంలో ప్రాక్టికల్స్ లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడంతో ఇంటర్ బోర్డు ఈసారి ఐపీ–4 ఎంపీ వాయిస్ రికార్డింగ్ తో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 
వికారాబాద్: వికారాబాద్​జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్. శంకర్ ఆదివారం తెలిపారు. ప్రాక్టికల్ పరీక్ష ప్రారంభమైన 15 నిముషాల తర్వాత విద్యార్థులను అనుమతించబోమన్నారు. ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్, ఇంటర్నెట్, ప్రింటర్ వంటి సౌకర్యాలతో పాటు ప్రతి సైన్స్ ల్యాబ్​లో  సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలంగాణ ఇంటర్ బోర్డు  అధికారులు సీసీ కెమెరాల ద్వారా ప్రాక్టికల్ పరీక్షలను పర్యవేక్షిస్తారన్నారు. పరీక్ష నిర్వహణలో పాల్గొనే సిబ్బంది గుర్తింపు కార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్  బోర్డు నిబంధనల ప్రకారమే పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇంటర్ జనరల్ సెకండియర్​లో 3,782, ఒకేషనల్ ఫస్టియర్​లో 797 మంది,  సెకండియర్ లో 1,336 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నట్లు వివరించారు. జనరల్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ కోసం38, ఒకేషనల్ పరీక్షల కోసం10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు , మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు  ప్రతి రోజు 2 విడతలలో బ్యాచ్ ల వారీగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు  ఒక గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.