- కృష్ణా బేసిన్‌లోని జలాశయాలు కళకళ
- శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో
- రెండు రోజుల్లో సాగర్ గేట్లు తెరిచే చాన్స్
- గోదావరి ప్రాజెక్టులకు స్వల్పంగానే ప్రవాహాలు
- నిండుకుండలా ఎల్లంపల్లి ప్రాజెక్టు
- 42 టీఎంసీలకు చేరిన శ్రీరాంసాగర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు నిండిపోయాయి. నిరుడు మొత్తం వర్షాల్లేక, వరద రాక ప్రాజెక్టులు మొత్తం వట్టిబోగా.. ఇప్పుడు ఆగస్టు ఫస్ట్ వీక్నాటికే ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ఎగువన కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌కు గత నెల 15 నుంచి స్వల్పంగా వరద ప్రవాహం నమోదైతే.. జూరాల ప్రాజెక్టుకు అదే నెల 19 నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో స్టార్ట్ అయింది.
శ్రీశైలం ప్రాజెక్టుకు జులై 20వ తేదీ నుంచి వరద మొదలైంది. అప్పటికి ప్రాజెక్టులో 215 టీఎంసీలకుగానూ కేవలం 36.56 టీఎంసీల నిల్వనే ఉంది. అది మొదలు.. జులై 22న తొలిసారిగా శ్రీశైలం ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం నమోదైంది. ఆ రోజు 1.75 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 25, 26వ తేదీల్లో రోజూ సగటున 2.5 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చింది.
27వ తేదీ నుంచి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. అంతకు రెండింతల ఇన్‌ఫ్లో వచ్చింది. ఆ రోజు నుంచి 4 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం నమోదైంది. వరుసగా 5 రోజులపాటు భారీ వరదలు కొనసాగాయి. 30వ తేదీ నాటికి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 207.41 టీఎంసీలకు చేరింది. ఆ పది రోజుల వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపు 200 టీఎంసీలకుపైగా ఫ్లడ్ వచ్చింది.
జులై 30న మూడు గేట్లు తెరచి నాగార్జున సాగర్‌కు నీటి విడుదలను ప్రారంభించారు. ఇప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదలు వస్తున్నాయి. ఇటు జూరాల ప్రాజెక్టుతో పాటు అటు తుంగభద్ర నుంచి 4,81,598 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. దీంతో 5,52,268 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 215.81 టీఎంసీలకుగానూ 202.51 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం 885 అడుగులకుగానూ 882.60 అడుగుల లెవెల్లో నీళ్లున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తితోపాటు క్రెస్ట్‌గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.
గోదావరి వరదంతా ప్రాణహితదే
ఈ ఏడాది ఇప్పటిదాకా గోదావరి నదిలో సరైన వరద ప్రవాహం నమోదు కాలేదు. ప్రస్తుతం మేడిగడ్డ, సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్, భద్రాచలం వద్ద నుంచి భారీగా సముద్రంలో కలిసిన వరదంతా ప్రాణహిత ప్రవాహాలేనని అధికారులు చెబుతున్నారు. గోదావరి క్యాచ్మెంట్ఏరియాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఈ నెల 20 నుంచి గోదావరిలో అతి స్వల్ప ప్రవాహాలు మాత్రమే నమోదయ్యాయి.
జులై 18న శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ కు 20,833 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఎల్లంపల్లికి గత నెల 21న 42 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. సీజన్లో ఇప్పటిదాకా అదే అధికం కావడం విశేషం. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఈ నెల 2న 52,164 క్యూసెక్కుల ఫ్లడ్ నమోదైంది. సీజన్లో ఆ ప్రాజెక్టుకు ఇదే అత్యధిక ఫ్లడ్.
నాగార్జునసాగర్‌కు వారం నుంచే వరద
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వారం రోజుల నుంచే వరద ప్రవాహాలు మొదలయ్యాయి. తొలిసారిగా జులై 27వ తేదీన సాగర్ ప్రాజెక్టుకు 52 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వచ్చింది. గత మూడు రోజుల నుంచి 3.70 లక్షలు, 4 లక్షలు, 4.94 లక్షల క్యూసెక్కుల చొప్పున భారీ వరద ప్రవాహాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 312.05 టీఎంసీలకుగానూ 240.83 టీఎంసీలకు నిల్వ చేరుకుంది.
మరో రెండు మూడు రోజుల్లో సాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవ కాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, జూరాల ప్రాజెక్టుకు 19నే వరద ప్రారంభం కాగా.. ఆ తర్వాత రెండు, మూడు రోజులకే ప్రాజెక్టు నిండింది. దీంతో 20వ తేదీ నుంచి జూరాల ప్రాజెక్టు ద్వారా వరదను దిగువకు విడుదల చేశారు.