కొత్త ఎడ్యుకేషన్​ పాలసీతో ఆల్​రౌండ్​ డెవలప్​మెంట్

దేశంలో 34 ఏండ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘నేషనల్​ఎడ్యుకేషన్​పాలసీ 2020’(ఎన్‌‌‌‌ఈపీ) ఇండియన్​ఎడ్యుకేషన్ ​సిస్టంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. 5+3+3+4 విధానంలో విద్యనభ్యసించే స్టూడెంట్స్​ఆల్ రౌండ్​డెవలప్​మెంట్​సాధించి అత్యున్నత ఉత్పాదక సామర్థ్యంగల శక్తులుగా ఎదగనున్నారు. నాణ్యత, సమానత్వం, లభ్యత పునాదులపై రూపుదిద్దుకున్న ఎన్ఈపీ 2020 దేశంలోని లక్షలాది మంది యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చనుంది. జులై 8న విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేను. కొత్త పాలసీ అమలును బృహత్​కర్తవ్యంగా భావిస్తున్నాను. ఎన్‌‌‌‌ఈపీలో భవిష్యత్‌‌‌‌ నిర్దేశిక సూత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ కొన్ని లక్షణాల ప్రాతిపదికన వాటిపై నా అభిప్రాయం ఇదీ.

దేశంలో విద్యారంగంపై విస్తృత ప్రభావం చూపగల, జాతి భవిష్యత్తుకు కొత్త రూపం ఇవ్వగల దార్శనిక పత్రంగా ఎన్‌‌‌‌ఈపీ-2020ని అభివర్ణించవచ్చు. ఈ పాలసీ రూపుదిద్దుకున్న తీరు, దేశంలో పెరిగిన వనరుల రీత్యా ఇది ప్రపంచంలో అగ్రగామిగా నిలవగలదు. ఇదొక మార్గనిర్దేశం సిద్ధాంతం. ఓ పవిత్ర ఇతిహాసం. నూతన జాతీయ విద్యా విధానం పిల్లలకు పాఠశాల పూర్వదశ నుంచి యుక్తవయసు వచ్చేదాక సార్వజనీన విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. అన్ని వర్గాల స్టూడెంట్స్ అనుకూల వాతావరణంలో భరోసా కల్పించే విద్యను అభ్యసించవచ్చు. నగరాల్లో నివసించే పిల్లలకు మాత్రమే ప్లే స్కూళ్లు అందుబాటులో ఉంటాయన్నది ఇప్పటిదాకా మనకు తెలిసిన విషయం. కానీ ఇకపై దేశంలో అన్ని వర్గాల పిల్లలు ఆడుతూపాడుతూ నాణ్యమైన విద్యను అభ్యసించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త 5+3+3+4 విద్యా విధానం అందుకు బాటలు వేస్తోంది. పాఠశాల స్థాయి విద్యా వ్యవస్థలో -నైపుణ్యాలు, కరిక్యులర్, కో కరిక్యులర్​అంశాలు, మానవీయ- విజ్ఞాన శాస్త్రాల మధ్య ఇప్పటివరకు ఉన్న సంక్లిష్ట వర్గీకరణ నేషనల్​ఎడ్యుకేషన్​పాలసీతో మరింత సులభతరం కానుంది. తద్వారా విద్యార్థుల్లో బహుముఖ, భావనాత్మక, విశ్లేషణాత్మక ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించవచ్చు. సృజనాత్మక సమ్మేళనాలకు.. అంటే ఉదాహరణకు గణితం+పెయింటింగ్‌‌‌‌తో కూడిన కోర్సు వంటి క్రియేటివ్​నైపుణ్యాల అభివృద్ధికి ఇది ఊపిరిపోస్తుంది. కొత్త పాలసీ ప్రకారం.. విద్యార్థి జీవితంలో ఎదురయ్యే అనేకానేక ఒత్తిడి సందర్భాలను నివారించే దిశగా విద్యాభ్యాసం పూర్తయ్యాక మార్కుల జాబితాకు బదులు ఓ సమగ్ర ప్రగతి నివేదిక ఇస్తారు. స్టూడెంట్స్​సామర్థ్యం, పోటీతత్వం, అభిరుచి, ఇతరత్రా ప్రతిభ, నైపుణ్యాల అంచనాలతో ఇది రూపొందుతుంది. ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో ప్రతి ఒక్కరికీ 6వ తరగతి నుంచే వృత్తివిద్యా బోధనతోపాటు విద్యార్థి శిక్షణ కూడా ప్రారంభమవుతుంది. అండర్‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌, పోస్ట్‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌ స్థాయిల్లో విద్యార్థికి ఇచ్చే బెస్ట్​సర్టిఫికెట్​తో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పాఠశాల విద్యకు డిజిటల్‌‌‌‌ మౌలిక సదుపాయాలుంటాయి. ఇవన్నీ ఎన్‌‌‌‌డియర్‌‌‌‌ (NDEAR) పేరిట స్వతంత్రంగానే కాకుండా పరస్పర సమన్వయ పద్ధతిలో పనిచేస్తాయి. కొన్ని నిర్ధిష్ట సూత్రాలు, ప్రమాణాలు, మార్గదర్శకాలతో ఈ కార్యాచరణను రూపొందించారు. డిజిటల్‌‌‌‌ విద్య.. పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయగలగడంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ అభిలషిస్తున్న సంస్కరణాత్మక మార్పుల నాణ్యతలోనూ కీలకం కానుంది.
సమగ్ర శిక్ష అభియాన్..
‘సమగ్ర శిక్ష అభియాన్ 2.0’కు ‘ఎన్‌‌‌‌డియర్‌‌‌‌’ ఎంతో వెసులుబాటు కల్పిస్తుంది. ఈ పథకాన్ని రూ.2.94 లక్షల కోట్ల అంచనా వ్యయంతో రాబోయే ఐదేండ్ల దాకా పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ప్రీ-స్కూల్‌‌‌‌ నుంచి 12వ తరగతి వరకు గల 11.6 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్‌‌‌‌ పాఠశాలల్లోని 15.6 కోట్ల మంది విద్యార్థులు, 57 లక్షల మంది ఉపాధ్యాయులకు లబ్ధి చేకూర్చనుంది. దీనికి అనుగుణంగా ‘డీబీటీ’ పద్ధతిలో విద్యార్థులందరికీ నేరుగా ఉపయోగపడే పాఠశాల విద్యార్థి -కేంద్రక ఆర్థికపరమైన చర్యలు చేపడతారు. ఉన్నత విద్యారంగానికి సంబంధించి అకడమిక్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ క్రెడిట్‌‌‌‌(ఏబీసీ) ఏర్పాటు చేస్తారు. వివిధ ఉన్నత విద్యా సంస్థల(హెచ్‌‌‌‌ఈఐ) నుంచి విద్యార్థులు పొందిన క్రెడిట్లను ఇందులో పొందుపరుస్తారు. విద్యా, వృత్తిపరమైన శిక్షణ, విద్యార్థికిగల వివిధ ప్రవేశ-నిష్క్రమణ సందర్భాలకు తగిన గ్రేడ్లు మాత్రమే కాకుండా ఏవైనా ప్రత్యేక పరిస్థితులకు సంబంధించిన గ్రేడ్లు కూడా నమోదు చేస్తారు. ఇవన్నీ ఒక స్పష్టమైన రూపంలోకి బదిలీ అయి, విద్యార్థి అంతిమంగా సమగ్ర పట్టా పొందడానికి దోహదపడతాయి. ముఖ్యంగా జాతీయ విద్యా విధానం నిర్దేశించిన మేరకు విదేశీ భాగస్వామ్య విద్యా సంస్థలో ఒక సెమిస్టర్‌‌‌‌ పూర్తిచేయడానికి వీలుగా ఇతర దేశాల యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో దేశంలోని న్యాయ, వైద్య విద్యా సంస్థలు మినహా మిగిలిన ఉన్నత విద్యా సంస్థలన్నీ ‘భారత ఉన్నత విద్యామండలి’(HECI) పేరిట ఒకే నియంత్రణ సంస్థ పరిధిలో ఉంటాయి.
ఉత్పాదక సామర్థ్యం గల శక్తులు
పిల్లల్లో అత్యున్నత సామర్థ్యాన్ని పెంచి పోషించడంలో ఎన్‌‌‌‌ఈపీ-2020 కీలకపాత్ర పోషించాలని ప్రధాని మోడీ ఆకాంక్షిస్తున్నారు. అందుకు తగిన రీతిలో ప్రపంచ విద్యావ్యవస్థల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ సంప్రదింపుల ప్రక్రియ అనంతరం ఈ విధానం ఊపిరి పోసుకుంది. అంతర్జాతీయ విజ్ఞాన, ఆర్థిక వ్యవస్థలో అగ్రస్థానాన్ని అధిరోహించేందుకు ఇదొక సాధనం కావాలి. మనం ఈసారి ‘అమృత మహోత్సవం’ పేరుతో 75 ఏండ్ల స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకోనున్నాం. మన దేశ స్వాతంత్ర్య శతాబ్ది ‘ఆజాదీ-100’ ఉత్సవాల నాటికి ప్రస్తుతం 5- నుంచి15 ఏండ్ల మధ్య వయసుగల బాలలు కొత్త జాతీయ విద్యా విధానంతో నిస్సందేహంగా అత్యున్నత ఉత్పాదక సామర్థ్యంగల శక్తులుగా ఎదుగుతారు. శాస్త్రీయ ఆలోచనా విధానం, విశ్లేషణాత్మక దృక్పథం, మానవతావాదం మూర్తీభవించిన అంతర్జాతీయ మార్గనిర్దేశకులు కాగల శ్రామికశక్తిని సృష్టించే ఈ మహోన్నత ప్రక్రియలో నేనూ భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నాను.

ప్రాంతీయ భాషల్లో..
దేశవ్యాప్తంగా వినికిడి లోపమున్నవారు మాతృభాష -స్థానిక/ప్రాంతీయ భాషల మాధ్యమంలో చదివేందుకు వీలుగా త్రిభాషా సూత్రం కింద ఎన్‌‌‌‌ఈపీ బహుళ భాషా సామర్థ్య మార్గాలను నిర్దేశిస్తోంది. ఈ మేరకు జాతీయ- రాష్ట్రస్థాయి పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడంతోపాటు ఏకరూప భారతీయ సంజ్ఞాభాష(ఐఎస్‌‌‌‌ఎల్‌‌‌‌) ప్రామాణీకరణ చేస్తారు. ఐఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ సారాంశంపై ప్రత్యేక శ్రద్ధతో దివ్యాంగులకు సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత సార్వజనీన విద్యను అందించినందుకుగానూ మనదేశానికి ‘కింగ్‌‌‌‌ సెజోంగ్‌‌‌‌ లిటరసీ పురస్కారం-2021’ని యునెస్కో ప్రదానం చేసింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక శ్రద్ధ, ప్రతికూల పరిస్థితులున్న ప్రాంతాలకు ప్రత్యేక విద్యామండళ్ల ఏర్పాటు, బాలభవన్‌‌‌‌లతోపాటు పగటిపూట వసతి పాఠశాలల ఏర్పాటుపై రాష్ట్రాలకు ప్రోత్సాహం వంటివన్నీ కలగలసి జాతీయ విద్యా విధానానికి వేసిన పునాదిని బలపరుస్తాయి. 

- ధర్మేంద్ర ప్రదాన్‌‌‌‌,
కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి