- 6 వికెట్ల తేడాతో ఓడిన అఫ్గానిస్తాన్
- రాణించిన జితేశ్, తిలక్ వర్మ
మొహాలీ: అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా బోణీ చేసింది. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో శివమ్ దూబె (40 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 నాటౌట్) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన తొలి టీ20లో ఇండియా 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్‌సేన 1–0 లీడ్‌లో నిలిచింది. టాస్ ఓడిన అఫ్గాన్ 20 ఓవర్లలో 158/5 స్కోరు చేసింది. మహ్మద్ నబీ (27 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) టాప్ స్కోరర్. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (29), ఇబ్రహీం జద్రాన్ (25) ఫర్వాలేదనిపించారు. తర్వాత ఇండియా 17.3 ఓవర్లలో 159/4 స్కోరు చేసి గెలిచింది. జితేష్ శర్మ (31) రాణించాడు. ఇన్నింగ్స్ రెండో బాల్‌కే కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌటైనా, శుభ్‌మన్ గిల్ (12 బాల్స్‌లో 5 ఫోర్లతో 23) వేగంగా ఆడాడు. రెండో వికెట్‌కు 28 రన్స్ జత చేసి ఔటయ్యాడు. 28/2 స్కోరు వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన దూబె సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గాన్ బౌలింగ్‌ను చితక్కొడుతూ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తిలక్ వర్మ (26)తో మూడో వికెట్‌కు 44, జితేశ్‌తో నాలుగో వికెట్‌కు 45, రింకూ సింగ్ (16 నాటౌట్)తో ఐదో వికెట్‌కు 22 బాల్స్‌లోనే 42 రన్స్ జత చేసి ఇండియాను గెలిపించాడు. ముజీబ్ 2 వికెట్లు తీశాడు. దూబెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆదివారం ఇండోర్‌లో రెండో టీ20 జరగనుంది.
ఆదుకున్న నబీ..
మంచు ప్రభావం వల్ల ఛేజింగ్ ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో టాస్ నెగ్గిన రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్లుగా వచ్చిన రెహమానుల్లా గుర్బాజ్ (23), ఇబ్రహీం జద్రాన్ స్టార్టింగ్‌లో నెమ్మదిగా ఆడారు. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ (2/33) కూడా లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో రన్‌రేట్ తక్కువగా నమోదైంది. పవర్‌ప్లేలో 33 రన్స్ మాత్రమే చేసిన అఫ్గాన్‌ను 8వ ఓవర్‌లో అక్షర్ పటేల్ (2/23), రెహమానుల్లా వికెట్ తీసి దెబ్బకొట్టాడు. తర్వాతి ఓవర్‌లో శివమ్ దూబె (1/9).. ఇబ్రహీంను వెనక్కి పంపాడు. 10వ ఓవర్‌లో రెహమత్ షా (3)ను ఔట్ చేసి అక్షర్ రెండో వికెట్ సాధించాడు. దీంతో తొలి టెన్‌లో 57/3తో కష్టాల్లో పడిన అఫ్గాన్‌ను మహ్మద్ నబీ ఆదుకున్నాడు. రెండో ఎండ్‌లో అజ్మతుల్లా కూడా మంచి సహకారం అందించాడు. ఈ ఇద్దరు స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే వీలైనప్పుడల్లా భారీ షాట్లు ఆడారు. దాదాపు 7 ఓవర్లు క్రీజులో ఉన్న ఈ జోడీ నాలుగో వికెట్‌కు 68 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. అయితే 18వ ఓవర్‌లో ముకేశ్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఆరు బాల్స్ తేడాతో అజ్మతుల్లా, నబీని ఔట్ చేశాడు. ఇక130/5 స్కోరు వద్ద వచ్చిన నజీబుల్లా జద్రాన్ (19 నాటౌట్) ఫోర్లతో బ్యాట్ ఝుళిపించాడు. కరీమ్ జనత్ (9 నాటౌట్)తో కలిసి ఆరో వికెట్‌కు 28 రన్స్ జత చేయడంతో అఫ్గాన్ ఓ మాదిరి టార్గెట్‌ను నిర్దేశించింది.