తరౌబా: ఐపీఎల్ వల్ల టీమిండియా ప్లేయర్లలో అహంకారం పెరిగిందన్న లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ వ్యాఖ్యలకు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కౌంటర్ ఇచ్చాడు. తమలో ఎవరికీ అహంకారం లేదన్నాడు. మ్యాచ్‌లో ఇండియా ఓడినప్పుడు మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేస్తారని గుర్తు చేశాడు. ప్లేయర్లు కేవలం ఇండియా గెలవడంపైనే దృష్టి పెడతారని, వాళ్లకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా ఉండదని స్పష్టం చేశాడు. ‘ప్రతి ఒక్కరికి స్వంత అభిప్రాయం ఉంటుంది. మాజీ ప్లేయర్లకు వారి అభిప్రాయాన్ని పంచుకునే హక్కు కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ ఎవరో చెప్పినట్లుగా టీమిండియాలో ఎవరికీ అహంకారం లేదు. ప్రతి ఒక్కరూ ఆటను ఆస్వాదిస్తున్నారు. అందరూ వంద శాతం కష్టపడుతున్నారు.
టీమ్‌లో ఈజీగా చోటు దక్కుతుందని ఎవ్వరూ భావించరు. టీమ్ ఓడినప్పుడు మాత్రమే ఇలాంటి కామెంట్స్ వస్తుంటాయి’ అని జడ్డూ వ్యాఖ్యానించాడు. ఇక, ఆసియా కప్‌లో ఆడే ఫైనల్ ఎలెవన్ ఖరారైందన్నాడు. విండీస్‌తో సిరీస్‌లో చేసిన ప్రయోగాల వల్ల టీమ్ బ్యాలెన్స్, బలం, బలహీనత వంటి అంశాలపై ఓ అవగాహన వచ్చిందన్నాడు. మెగా కప్‌లో ఎలాంటి కాంబినేషన్‌ను ఆడించాలన్న దానిపై కెప్టెన్, టీమ్ మేనేజ్‌మెంట్‌కు క్లారిటీ వచ్చిందని జడ్డూ వెల్లడించాడు