వికారాబాద్​ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో ఆధిపత్య పోరు

వికారాబాద్​ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో ఆధిపత్య పోరు

వికారాబాద్, హైదరాబాద్, వెలుగు:  వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. సిట్టింగులకే సీట్లు అని హైకమాండ్ ​చెప్పినప్పటికీ లీడర్ల మధ్య ఆధిపత్య పోరు మాత్రం ఆగట్లేదు. కాంగ్రెస్​ నుంచి గెలిచి బీఆర్ఎస్​లో చేరిన తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పరిగిలోనూ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​రెడ్డి, డీసీసీబీ చైర్మన్​ మనోహర్ రెడ్డి మధ్య పంచాయితీ నడుస్తోంది. వికారాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్​ తరపున ఏకంగా15 మంది ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నిస్తుండడంతో ప్రస్తుత ఎమ్మెల్యే మెతుకు ఆనంద్​తలపట్టుకుంటున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్​రెడ్డికి మధ్య టికెట్​ లొల్లి నడుస్తోంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్​ బలంగా ఉండడంతో రాబోయే ఎన్నికల్లో రూలింగ్ ​పార్టీకి గట్టి పోటీ ఎదురవనుంది. గతంలో పోలిస్తే బీజేపీ కాస్త పుంజుకున్నప్పటికీ బలమైన లీడర్లు లేకపోవడం మైనస్​గా మారింది. 

తాండూరులో టగ్​ ఆఫ్​ వార్​ 

తాండూర్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి,  ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్​ నుంచి పోటీ చేసిన పట్నం మహేందరెడ్డిని కాంగ్రెస్​అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి ఓడించారు. తర్వాత పైలెట్​బీఆర్​ఎస్​లో చేరడంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇటీవల సీఎం కేసీఆర్ కు పైలెట్ రోహిత్​రెడ్డి దగ్గరకావడంతో టికెట్​తనకే అన్న నమ్మకంతో ఉన్నారు. అదే సమయంలో పట్నం మహేందర్ రెడ్డి  కూడా తాండూర్ ​టికెట్​పై ధీమాతో ఉన్నారు. ఫాంహౌస్​ కేసులో రోహిత్​రెడ్డి జైలుకు పోతారని, మహేందర్​రెడ్డికే టికెట్​వస్తుందని ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవేళ తనకు టికెట్ ​రాకపోతే మహేందర్​రెడ్డి కాంగ్రెస్​లో చేరతారనే టాక్ నడుస్తోంది. అవసరమైతే తాండూర్, కొడంగల్, పరిగి, వికారాబాద్​అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి తన వర్గం లీడర్లను బరిలో దించి, తాను చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేస్తానని లీకులు ఇస్తున్నారు. ఇది ఒకరకంగా రూలింగ్​ పార్టీకి అల్టిమేటం అనే చర్చ జరుగుతోంది. తాండూర్​లో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ గ్రాఫ్​పడిపోయిందని, ఇద్దరిలో ఎవరికి టికెట్​ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని బీఆర్ఎస్​ హైకమాండ్ ​సర్వేల్లో తేలినట్లు సమాచారం. ఇదే జరిగితే  మహేందర్ రెడ్డి భార్య జడ్పీ చైర్​పర్సన్​ సునీతారెడ్డికి టికెట్​వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

బీఆర్​ఎస్​..రెడ్డి సామాజిక వర్గానికే టికెట్​ఇస్తుండడంతో  బీజేపీ నుంచి బీసీ అభ్యర్థిని బరిలో దింపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఇక్కడ బీజేపీ  పుంజుకుంది. ఈ క్రమంలో ఆ పార్టీ నుంచి మురళీగౌడ్ ​పేరును హైకమాండ్​ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ ​నుంచి టీపీసీసీ ఉపాధ్యక్ష హోదాలో ఉన్న మల్​కెడ్​ రమేశ్​​కుమార్​ టికెట్​ఆశిస్తున్నారు. గతంలోనూ రమేశ్​ పేరే వినిపించినా, చివరి నిమిషంలో పైలెట్ టికెట్​సాధించారు.  

వికారాబాద్ లో నువ్వా నేనా?

వికారాబాద్​లో అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు డజన్ల కొద్దీ అభ్యర్థులు లైన్​లో ఉన్నారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వడ్ల నందు, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్​ విజయ్​కుమార్, భూమెళ్ల కృష్ణయ్య, ఎం రమేష్​లతో పాటు15 మంది వరకు​ టికెట్ ఆశిస్తున్నారు. అయితే వంద శాతం టికెట్ తనదేనని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ​జిల్లా ప్రెసిడెంట్ అయిన మెతుకు ఆనంద్ కాన్ఫిడెంట్​గా ఉన్నారు.  ఒకవేళ పార్టీ టికెట్​ఇవ్వకపోతే తన బంధువైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహకారంతో బీఎస్పీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్​ నుంచి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, బీజేపీ నుంచి మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్​ పోటీలో ఉన్నారు.  తమ పార్టీ బలం పుంజుకుందని, దీనికి తోడు మోడీ ఛరిష్మా తనను గెలిపిస్తుందని చంద్రశేఖర్​నమ్ముతున్నారు. మరో పక్క గడ్డం ప్రసాద్ కుమార్ ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజల్లోనే ఉంటున్నారు. 

పరిగి బీఆర్ఎస్​లో టికెట్ల లొల్లి 

పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​రెడ్డి, డీసీసీబీ చైర్మన్ ​మనోహర్ రెడ్డి మధ్య టికెట్​పోటీ నడుస్తోంది. దీంతో ఇద్దరూ ఎవరికి వారుగా చావులు, పెళ్లిళ్లకు వెళ్తూ జనాల మధ్య ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగులకు టికెట్ ఇస్తే తనకు వచ్చినట్టేనని మహేశ్​రెడ్డి నమ్మకంతో ఉండగా, మార్పు జరిగితే తనకు పక్కా అని  మనోహర్ రెడ్డి భావిస్తున్నారు. ఈసారి తానే బీఆర్ఎస్​అభ్యర్థినని, ఒకవేళ టికెట్ రాకపోతే రెబల్​గా బరిలో దిగుతానని విద్యా మౌలిక వసతుల చైర్మన్​ నాగేందర్​ గౌడ్​ సన్నిహితులకు చెబుతున్నారు. కాంగ్రెస్​ నుంచి రాంమోహన్​రెడ్డి  సీటు తనదే అనుకుని పలు ప్రోగ్రామ్స్​ నిర్వహిస్తున్నారు. ఎవరైనా చనిపోతే వెళ్లి ఆర్థిక సాయం చేస్తున్నారు. పరిగిలో తన కొడుకు బర్త్​డే సందర్భంగా హెల్త్​ క్యాంపు ఏర్పాటు చేశారు. బీజేపీ నుంచి పరమేశ్వర్ రెడ్డి, మారుతి కిరణ్ పోటీలో ఉన్నారు. వేరే పార్టీల నుంచి ఆశావాహులు కూడా వచ్చే అవకాశం ఉండడంతో టికెట్​ ఎవరికనేది క్లారిటీ లేదు. ఇక్కడ కూడా గతంతో పోలిస్తే బీజేపీ పుంజుకుంది.  

 

కొడంగల్ లో ఎమ్మెల్యే వర్సెస్​ మాజీ ఎమ్మెల్యే 

కొడంగల్ లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్​రెడ్డి ..ప్రస్తుత ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి మధ్య టికెట్ పంచాయితీ నడుస్తోంది. గత ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి గెలవడానికి కృషి చేశానని, ఈసారి తన కొడుకు జగదీశ్వర్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని గురునాథ్ రెడ్డి పట్టుబడుతున్నారు. డీసీసీబీ పదవి విషయంలో తనకు అన్యాయం చేశారని, వచ్చే ఎన్నికల్లో అయినా  న్యాయం చేయాలని డిమాండ్​చేస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి ప్రస్తుతం కొడంగల్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. 2018లో కాంగ్రెస్​ తరపున ప్రస్తుత టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ పోటీ చేసి ఓడిపోయారు. రేవంత్ ను ఓడించడానికి బీఆర్ఎస్ పెద్దలు అనేక హామీలిచ్చారు. ప్రతి పల్లెకు రోడ్లు, ఇంటింటికి టాయిలెట్లతో పాటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. హామీలు అమలుకాకపోవడంతో ఓటర్లలో వ్యతిరేకత ఉంది. అలాగే వచ్చే ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచే పోటీ చేయాలని రేవంత్​రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. దీని కోసం ఇటీవల గురునాథ్​రెడ్డితో రేవంత్ భేటీ కావడం చర్చకు దారి తీసింది. ఇక బీజేపీకి నియోజకవర్గంలో పట్టు ఏర్పడడంతో బలమైన క్యాండిడేట్ కోసం ఎదురుచూస్తోంది.