
- తరలివెళ్లిన పోలింగ్ సిబ్బంది గట్టి పోలీస్ బందోబస్తు
మెదక్/ సిద్దిపేట/ సంగారెడ్డి, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దివ్యాంగులకు, మహిళలకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలతో పాటు మోడల్ పోలింగ్స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ షురూ కానుండగా బుధవారం పోలింగ్ అధికారులు, సిబ్బంది ఈవీఎంలు, పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు వెళ్లారు. పోలింగ్‌సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో 4,40,341 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 579 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెదక్ నియోజకవర్గంలో 2,16,748 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 1,03, 654 మంది, మహిళలు 1,13,089 మంది, ఇతరులు 5 గురు ఉన్నారు. మొత్తం 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకోసం 1, మహిళల కోసం 5, మోడల్ పోలింగ్ కేంద్రాలు 5 ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 274 మంది పీఓలు, 274 మంది ఏపీఓలు, 548 మంది ఓపీఓలు, 28 మంది సెక్టోరియల్ అధికారులు, 28 మంది రూటు అధికారులను నియమించారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో 2,23,593 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 1,09, 240 మంది, మహిళలు 1,24,346 మంది, ఇతరులు 7 గురు ఉన్నారు. మొత్తం 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం 1, మహిళల కోసం 5, మోడల్ పోలింగ్ కేంద్రాలు 5 ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకోసం 305 మంది పీఓలు, 305 మంది ఏపీఓలు, 610 మంది ఓపీఓలు, 30 మంది సెక్టోరియల్ అధికారులు, 30 మంది రూటు అధికారులను నియమించారు.
గట్టి పోలీస్ బందోబస్తు...
జిల్లాలో పోలింగ్ప్రశాంతంగా జరగడానికి పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లాలో 278 సమస్యాత్మక, 731 సాధారణ పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణ కోసం 103 మొబైల్ పార్టీలు, 26 క్విక్ రెస్పాన్స్ టీమ్స్, 6 స్ట్రైకింగ్ ఫోర్స్, 4 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బందోబస్త్ నిర్వహిస్తాయి. డ్రోన్ కెమెరాలతో నిఘా వేస్తున్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 2,632 మంది అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో...
సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 13 లక్షల 93 వేల 711 మంది ఓటర్లు ఉన్నారు. వారందరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా మొత్తం 1,609 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 389 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి అక్కడ పకడ్బందీ చర్యలు చేపట్టారు. 1,039 వెబ్ కాస్టింగ్ కేంద్రాలు, 689 కేంద్రాల్లో సీసీటీవీ కవరేజీ తోపాటు 352 పోలింగ్ కేంద్రాల్లో వీడియో కవరేజీ చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంచారు.
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో..
నారాయణ్ ఖేడ్, వెలుగు : పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి శరత్ కుమార్ తెలిపారు. బుధవారం నారాయణఖేడ్ మండలంలోని మోడల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్టిబ్యూషన్ పాయింట్ వద్ద పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ సజావుగా జరపడానికి అధికారులు నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. నియోజకవర్గంలో 296 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి 1600 సిబ్బందితో పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలన్నారు. ఆయనతో పాటు స్పెషల్ అబ్జర్వర్ దీపక్ సాంగ్లీ, ఆర్వో వెంకటేశ్, ప్రిన్సిపాల్ కృష్ణకుమార్ పాల్గొన్నారు.
అందోల్‌లో 313 పోలింగ్ స్టేషన్లు
అందోల్, వెలుగు : అందోల్ నియోజకవర్గంలో ఎ న్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం చౌటకూర్ మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఆర్వో ఆధ్వర్యంలో పీఓలకు ఎన్నికల సామగ్రి అందజేశారు. మొత్తం 313 పోలింగ్స్టేషన్లు ఉన్నాయి. కాగా 35 రూట్లుగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు 42 మంది రూట్ఆఫీసర్లను కేటాయించారు. ఇందులో 7గురు రిజర్వ్‌లో ఉంటారు. సమస్యాత్మక పోలింగ్స్టేషన్లు 84 ఉన్నట్లు గుర్తించారు.
ఎన్నికల సామగ్రి తరలింపు
నర్సాపూర్, వెలుగు : ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసి సామాగ్రిని తరలించినట్లు మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం పట్టణంలోని బీవీఆర్ఐటీలో ఎన్నికల సామాగ్రి, సిబ్బంది, ఈవీఎంల తరలింపును అడిషనల్ కలెక్టర్ రమేశ్ తో కలిసికలెక్టర్ పరిశీలించారు. 8 మండలాల్లో 305 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 2,23,593 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. పోలింగ్ నిర్వహణకు 1,220 మంది ఎన్నికల సిబ్బందిని, భద్రత కోసం 1,500 మంది పోలీసులను నియమించారు.
బెజ్జంకిలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి
బెజ్జంకి, వెలుగ : మండలంలో పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంపీడీవో దమ్ముని రాము తెలిపారు. మండలంలో42 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. మండలంలో 13,675 మంది పురుషులు,14,319 మంది మహిళా ఓటర్స్, మొత్తం27,994 ఓటర్స్ ఉన్నారని ఆయన తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీడీవో కోరారు.
సిద్దిపేట జిల్లాలో...
సిద్దిపేట జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ శాసనసభ నియోజక వర్గాల పరిధిలో మొత్తం 1151( హుస్నాబాద్ 304, సిద్దిపేట 273, దుబ్బాక 253, గజ్వేల్ 321 ) పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 9, 48, 664 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,151 మంది పీవోలు, 1,151 మంది ఏపీవోలు, 2,302 మంది ఇతర అధికారులు విధుల్లో పాల్గొంటున్నారు. వీరికి అదనంగా 817 మంది రిజర్వు సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు.