![కామారెడ్డి జిల్లాలో స్థానిక పోరుకు లీడర్లు రెడీ](https://static.v6velugu.com/uploads/2025/02/all-set-for-local-body-elections-in-kamareddy-district_lp4QPzA7Vs.jpg)
- ఏర్పాట్లలో ఆఫీసర్లు బిజీబిజీ
- బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ పూర్తి
- ఖరారు కాని రిజర్వేషన్లు .. అయినా ఆశావహుల ఆసక్తి
- పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు
కామారెడ్డి, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్దం అవుతోంది. అధికారులు ఎన్నికల సన్నాహలు స్పీడప్ చేశారు. దీంతో జిల్లాలో ఇటు రాజకీయ పార్టీలు.. అటు ఆశావహులు స్థానిక సమరానికి రెడీ అవుతున్నారు. గ్రామపంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసి ఏడాది కావొస్తోంది. ఆతర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ.. ఇటీవల మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు కూడా ముగిసింది. దీంతో మొదట గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చునన్న సంకేతాలతో జిల్లా అధికార యంత్రాంగం చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, రిటర్నింగ్ అధికారుల నియమాకం పూర్తికాగా.. ఎన్నికల డ్యూటీలు చేసే సిబ్బందికి ట్రైనింగ్ఇస్తున్నారు. ఎన్నికల వాతావరణం ఏర్పడడంతో గ్రామాల్లో రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి. ఆశావహులు తమ బలాలను సమీకరించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో 535 గ్రామ పంచాయతీలు, 237 ఎంపీటీసీ స్థానాలు, 25 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
గతంలో కంటే ఈసారి 3 జడ్పీటీసీ, 1 ఎంపీటీసీ స్థానాలు పెరగగా కొత్తగా 10 గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. ఇప్పటికే పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటరు లిస్టు, పోలింగ్ కేంద్రాల లిస్ట్ లు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 16 లక్షల బాలెట్ పేపర్లు ప్రింట్చేసి.. రెడీగా ఉంచారు. ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల డ్రాప్ట్ నోటిఫికేషన్ మంగళవారం రిలీజ్ కానుంది. ఆర్వో, ఏఆర్వోలకు సోమవారం నుంచి ట్రైనింగ్ ప్రారంభించారు.
సర్పంచ్ పదవుల కోసం పోటాపోటీ
లోకల్‌బాడీ పదవులమీద ఆశలు పెంచుకున్న లీడర్లు పోటీకి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాకపోయినా తాము బరిలో ఉంటున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తాము అనుకున్న స్థానాలు మహిళలకు రిజర్వ్ అయితే తమ భార్యలనుగానీ, కుటుంబసభ్యులను గానీ పోటీ చేయించాలని భావిస్తున్న నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒక దిక్కు పార్టీ ముఖ్యనేతల మద్దతు కోసం తిరుగుతూనే.. మరో దిక్కు సొంత బలాలను సమీకరించుకుంటున్నారు.
కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల్లో పోటీ పట్ల ఆసక్తిగా ఉన్న లోకల్ లీడర్ల వివరాలను కాంగ్రెస్ సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీలో ఆశావహుల పోటీ తీవ్రంగా ఉంది. కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో బీజేపీ నాయకులు పర్యటించి పరిస్థితులను అంచనా వేయడంతో పాటు అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు కలిసివస్తాయని ఆశాభావంతో ఉంది. బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ ఎన్నికల పట్ల ఆసక్తి కనిపిస్తోంది.
నేడు ఎంపీటీసీ పోలింగ్ స్టేషన్ల డ్రాప్ట్ నోటిఫికేషన్
ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల డ్రాప్ట్ నోటిఫికేషన్ మంగళవారం రిలీజ్ కానుంది. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణ, ఆయా పార్టీల ప్రతినిధులతో మీటింగ్ తర్వాత ఈ నెల 15న ఫైనల్ లిస్టు ప్రకటిస్తారు.