Champions Trophy 2025: భారత్‌ సహా అన్ని జట్లు పాకిస్థాన్‌ వస్తాయి..: పీసీబీ చైర్మన్

వచ్చే ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఎనిమిదేళ్ల తరువాత దాయాది దేశం ఆతిథ్యమిస్తోన్న ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు పొరుగు దేశానికి వెళ్తుందా..! లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. భారత ప్రభుత్వం అంగీకారం తెలిపితేనే భారత జట్టు.. పాక్‌లో పర్యటిస్తుంది, లేదంటే లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, అది దాదాపు అసంభవమే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ALSO READ | ENG v PAK 2024: షాన్ మసూద్ సెంచరీ.. ఇంగ్లాండ్ బౌలర్లను దంచి కొడుతున్న పాక్

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్‌ సహా అన్ని జట్లు పాకిస్థాన్‌కు వస్తాయని పీసీబీ చైర్మన్మొహ్సిన్ నఖ్వీ తేల్చి చెప్పారు. లాహోర్‌లో భారత జట్టు మ్యాచ్‌లు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు నఖ్వీ తెలిపారు. అదే సమయంలో టీమిండి మ్యాచ్‌లను వీక్షించేందుకు మన దేశం నుంచి వెళ్లే అభిమానుల రవాణా సౌకర్యాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

"మేము ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని జట్లు మన దేశానికి వస్తాయి.." అని విలేకరులు అడిగిన ప్రశ్నకు నఖ్వీ సమాధానమిచ్చారు. అలాగే, ఐసీసీ చైర్మన్ హోదాలో జై షా ఎప్పుడొచ్చినా ఆయనను కలవాలని ఎదురు చూస్తున్నారా..? అని విలేకరులు నఖ్వీని ప్రశ్నించగా.. అలాంటి సమావేశాల వివరాలు ఇంకా నిర్ణయించబడలేదని తెలిపారు. 

 జైశంకర్‌తో చర్చలు..!

భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ మరో వారం రోజుల్లో పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్‌ 15-16 తేదీలలో ఇస్లామాబాద్‌ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంఘం (SCO) వార్షిక సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో SCO సభ్య దేశాలకు చెందిన విదేశాంగ ప్రతినిధులు ఆయా దేశాల మధ్య ఆర్థిక, సామాజిక, మానవ సహకారం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ విషయమై పాక్ ప్రభుత్వం.. జైశంకర్‌తో చర్చించనుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.  

ప్రభుత్వానిదే తుది నిర్ణయం.. 

అయితే ఈ విషయంలో భారత ప్రభుత్వానిదే తుది నిర్ణయమని బీసీసీఐ చెప్తోంది. ఇప్పటి వరకు ఈ టోర్నీకి సంబంధించి ప్రభుత్వంతో బీసీసీఐలో ఎలాంటి చర్చలు జరపలేదని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బిసిసిఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. కాబోయే ఐసిసి చీఫ్ జై షా, భారత ప్రభుత్వం తుది నిర్ణయమని ఆయన వెల్లడించారు.


గ్రూప్ ఏ:  పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్
గ్రూప్ బి:  ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ 

  • ఫిబ్రవరి 19: న్యూజిలాండ్ vs పాకిస్థాన్ (కరాచీ)
  • ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ vs భారత్ (లాహోర్)
  • ఫిబ్రవరి 21: ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా (కరాచీ)
  • ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్  (లాహోర్)
  • ఫిబ్రవరి 23: న్యూజిలాండ్ vs భారత్  (లాహోర్)
  • ఫిబ్రవరి 24: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ (రావల్పిండి)
  • ఫిబ్రవరి 25: ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్  (లాహోర్)
  • ఫిబ్రవరి 26: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా (రావల్పిండి)
  • ఫిబ్రవరి 27: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్  (లాహోర్)
  • ఫిబ్రవరి 28: ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా  (రావల్పిండి)
  • మార్చి 1: పాకిస్థాన్ vs భారత్  (లాహోర్)
  • మార్చి 2: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ (రావల్పిండి)
  • మార్చి 5 సెమీ-ఫైనల్: TBC vs TBC (కరాచీ)
  • మార్చి 6 సెమీ-ఫైనల్: TBC vs TBC (రావల్పిండి)
  • మార్చి 9 ఫైనల్: TBC vs TBC  (లాహోర్)