తెలంగాణ పథకాలకు అన్నీ కోతలే!

ప్రభుత్వ బడ్జెట్​ల ద్వారా అభివృద్ధిలో భాగంగా, సగటు మనిషి ఆదాయం, జీవన విధానం, నివాస యోగ్యమైన సొంత ఇల్లు, పరిసరాలు మెరుగుపడాలి. కానీ,  తెలంగాణలో గత 9 ఏండ్ల అభివృద్ధి పుణ్యమా అని  బంగారు తెలంగాణ నిర్మాణంలో  ఒకటి రెండు శాతం కుటుంబాలు- రాజకీయ వ్యాపార, రియల్​ ఎస్టేట్, కాంట్రాక్టు, అవినీతి తో పాటు, ఇసుక, బొగ్గు, గ్రానైట్, ల్యాండ్, మద్యం మాదకద్రవ్యాల మాఫియా కార్యక్రమాల ద్వారా వందలాది ఎకరాల భూములను,  ఇతర ఆస్తులను సమకూర్చుకోగలిగాయి. పేదల అభివృద్ధి పథకాలకు కేటాయింపులు ఘనంగా ఉన్న నిధుల్లో కోతలేఅటకెక్కిన అనేక పథకాలు

ఎంతో ఆర్భాటంగా మొదలుపెట్టిన దళిత బంధు పథకానికి రూ.17,700  కోట్లు కేటాయించినా, ఈ సంవత్సరం ఇప్పటి వరకు అందులో 10 శాతం కూడా నిధులు విడుదల చేయలేదు. ‘మన ఊరు మనబడి’ కార్యక్రమానికి రూ.7284 కోట్ల  కేటాయించినా నిధులు విడుదల చేయలేదు. మహిళా సంఘాల జీరో వడ్డీ బకాయిలు రూ.3  వేల కోట్లు  2018 నుంచి చెల్లించలేదు. రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు 60 లక్షల ఆసరా పింఛన్లు ఉన్నాయి. వీరంతా  పేద వాళ్లని సర్కారు గుర్తించినట్లే కదా. అందులో 22 లక్షల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్​ ఇండ్లు కట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అందులో గత నాలుగేండ్లలో 3 శాతం కుటుంబాలకు కూడా ఇండ్లను ఇవ్వలేదు.  

డబుల్ బెడ్ రూమ్ పథకానికి ఈ సంవత్సరపు బడ్జెట్​లో రూ.12,000 కోట్లు కేటాయింపులు  చేసినా, అవి విడుదల కాలేదు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్​మెంట్ స్కాలర్షిప్​లు రూ.3000 కోట్లు గత మూడేండ్ల నుంచి బకాయిలుగానే మిగిలిపోయాయి. ఏటా బడ్జెట్​లో పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నా,  అందులో 10 నుంచి 20% కూడా ఖర్చు పెట్టడం లేదు. ఈ బడ్జెట్ కోతలప్రభావం పేద వర్గాల అభివృద్ధి సంక్షేమ పథకాలకు, విద్య, వైద్య రంగాలపై పడుతున్నది.  అయినా మన ఎమ్మెల్యేలు, మంత్రులు పేద ప్రజల సమస్యల గురించి అడగలేరు నోరు విడిచి అభ్యర్థించలేరు. తొమ్మిదేండ్ల నుంచి ఈ రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయక పేదల పరిస్థితి దిగజారింది.

శాపంగా మారిన రైతు రుణమాఫీ 

నాలుగేండ్ల నుంచి రైతుల రుణమాఫీ  పథకం అటకెక్కింది. బడ్జెట్​లో రూ.4 వేల కోట్లు కేటాయింపులు చేసినా అవి రైతుల ఖాతాల్లోకి చేరలేదు. లక్ష రూపాయల అప్పు తీసుకున్న రైతు బాకీ నాలుగేండ్లలో దాదాపు రూ.2 లక్షల పదివేలకు దాటింది. బ్యాంకుల రుణాలకు రైతులు అర్హత కోల్పోతున్నారు. డిఫాల్టర్ కింద ప్రతి బ్యాంకులో వారి పేర్లు నమోదు అయి ఉన్నాయి. రుణమాఫీ జరగకపోవడం వల్ల రైతులు మరింత అప్పుల పాలవుతున్నారు. బీసీల వెల్ఫేర్ కోసం ఈ ఏడాది బడ్జెట్​లో రూ.5,698 కోట్లు కేటాయింపులు చేసినా బీసీ యువతకు  కార్పొరేషన్ రుణాలు ఇంతవరకు విడుదల కాలేదు.  వడ్డెర, రజక, నాయీ బ్రాహ్మణ తదితర ఎంబీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు పెట్టి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. 

కేటాయింపులు భారీగా.. ఇచ్చే నిధులు తక్కువే.. 

రాష్ట్ర ప్రభుత్వం గత 9 ఏండ్లుగా వార్షిక బడ్జెట్ కేటాయింపులను ఏనుగు తొండంలా చూపించింది. ఇచ్చే నిధులు మాత్రం  ఎలుక తోక లాగే తక్కువ ఉన్నాయి.  రాష్ట్ర బడ్జెట్​లో సింహభాగం వడ్డీలు, అసలు చెల్లించడానికే  సరిపోతుంది. గత ఎనిమిది ఏండ్లలో ప్రభుత్వం వడ్డీ చెల్లింపులకు కట్టిన  లక్ష అయిదు వేల కోట్లలో సగం ఖర్చుపెట్టినా మన ప్రభుత్వ విద్యాసంస్థలు, దవాఖానాలు, డబుల్ బెడ్ రూములు, కార్పొరేషన్ రుణాల పరిస్థితే వేరు ఉండేది.   ప్రభుత్వ ఆర్థిక విధానం కాకులను కొట్టి గద్దలకు వేసినట్లుగా ఉంటున్నది.  

మద్యం వ్యాపారం, డీజిల్, పెట్రోలు, వాహన పన్ను, పోలీసులు వసూలు చేసే పెనాల్టీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు మాత్రం తెలియకుండానే పేదోడి జేబు నుంచి రాబడుతున్నది. నిరుద్యోగంలోనూ మన రాష్ట్రమే అగ్రభాగాన నిలిచి ఉన్నది. నాణ్యమైన విద్యలో దేశంలో మన రాష్ట్రం 19వ స్థానంలో, ఆరోగ్యస్థాయిలో 11వ స్థానంలో ఉండడానికి ప్రభుత్వ ఉదాసీనతే ప్రధాన కారణం. ఓట్లప్పుడు డబ్బులకు, ఆత్మీయ సభలకు, బీసీ కులాల ఆత్మగౌరవ  భవనాలకు, కులాల వారీగా భోజనాలు, దావతులకు ఇస్తున్న  ప్రాధాన్యత,  పేద ప్రజల విద్య, వైద్యం, ఉపాధికి ఎందుకు ఇవ్వరో నిలదియాల్సిన సందర్భం వచ్చేసింది. - కూరపాటి వెంకట నారాయణ, రిటైర్డ్​ ప్రొఫెసర్​,  కేయూ