కొత్తగా 16 ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లు
నేషనల్ హెల్త్ మిషన్ కింద త్వరలో హైదరాబాద్ లో ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: నేషనల్ హెల్త్ మిషన్ కింద హైదరాబాద్‌లో 16 డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. రక్త, మూత్ర పరీక్షలతోపాటు ఎక్స్‌రే, ఈసీజీ, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ వంటి అన్ని రకాల స్కానింగ్‌లను ఈ సెంటర్లలో చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖాన్లలో డయాగ్నసిస్ సేవలు అందుబాటులో లేవు. కొత్తగా ఏర్పాటు చేయబోయే డయాగ్నస్టిక్ సెంటర్లను ఈ దవాఖాన్లకు అనుసంధానించి, ఈ దవాఖాన్లలో డాక్టర్లు రిఫర్ చేసిన వారికి ఫ్రీగా టెస్టులు చేస్తారు. గతంలో ‘తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్’ పేరిట హైదరాబాద్ లోని నారాయణగూడ ఐపీఎం ఆవరణలో ఓ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ కేవలం రక్త, మూత్ర పరీక్షలు చేస్తున్నారు. స్కానింగ్ లు చేయడం లేదు. కానీ, కొత్తగా ఏర్పాటు చేయబోయే సెంటర్లలో అన్ని రకాల స్కానింగ్ లు కూడా చేయాలని నిర్ణయించారు. ఈ 16 సెంటర్లలో 8 సెంటర్లను ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డయాగ్నసిస్ మెషీన్లను కొనుగోలు చేశారు. తొలుత చిన్న స్కానింగ్ లను మొదలుపెట్టి , ఆ తర్వాత ఎంఆర్‌ఐ, సీటీ స్కానింగ్ ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రభుత్వ దవాఖాన్లలోని ల్యాబ్ టెక్నీషియన్లు, డాక్టర్లను ఆయా ల్యాబుల్లో పనిచేసేందుకు డిప్యూట్ చేశారు. ప్రస్తుతం ఈ 8 సెంటర్లలో ‘డ్రై రన్’ నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లు ఇస్తున్నట్టుగా ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లలోనూ ఆన్ లైన్ లో టెస్టు రిపోర్టులు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఓ సాఫ్ట్ వేర్ ను కూడా రూపొందించారు. ప్రభుత్వ దవాఖానకు వచ్చిన పేషెంట్ కు టెస్ట్ అవసరమైతే, డాక్టర్ సంతకంతో కూడిన స్లిప్ రాసి పేషెంట్ కు ఇవ్వాల్సి ఉంటుంది . ఈ స్లిప్ ఉన్నవాళ్లకు మాత్రమే టెస్ట్ చేస్తారు. పేషెంట్ పేరు, ఆధార్ నంబర్, సెల్ నంబర్, వయసు ఇతర వివరాలను డయాగ్నస్టిక్ సెంటర్ల సాఫ్ట్వేర్ లో ల్యాబ్ సిబ్బంది అప్ లోడ్ చేస్తారు. పేషెంట్ కు యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఇస్తారు. ఆ తర్వాతే టెస్టులు చేసి, రిపోర్ట్ లను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తారు. రిపోర్ట్ లింక్ ను రోగికి ఎస్‌ఎంఎస్ పంపిస్తారు.
60 శాతం నిధులు కేంద్రానివే
తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్స్ పేరిట జిల్లాల్ లో 20 డయాగ్నస్టిక్ సెం టర్లు ఏర్పాటు చేయాలని నాలుగేం డ్ల కిం ద నిర్ణయించారు. వీటిల్లో నూ ప్రస్తుతం టెస్ట్ రన్ జరుగుతోం ది. ఒకట్రెండు నెలల్లో వీటిని అధికారికంగా ప్రారంభించనున్నట్టు హెల్త్ ఆఫీసర్లు చెప్పారు. 2022 నాటికి ఈ సెంటర్లకు అనుబంధంగా స్కానింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం సెంటర్ల ఏర్పాటు, నిర్వహణకు నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్రం నిధులిస్తోంది. ప్రతి వంద రూపాయల్లో 60 కేంద్రం ఇస్తే.. 40 రాష్ట్రం భరిస్తోంది.