![ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆప్, కాంగ్రెస్ నేతలంతా విన్](https://static.v6velugu.com/uploads/2025/02/all-the-aap-and-congress-leaders-who-joined-the-bjp-before-the-election-won_Tm0BdvlFiu.jpg)
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 40 మందికి పైగా అభ్యర్థులు పార్టీలు మారారు. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలోకి చేరినవారే ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు పార్టీల నుంచి బీజేపీలోకి మారిన దాదాపు అందరు నాయకులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన అరవిందర్ సింగ్ లవ్లీ.. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. గాంధీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అయిన ఆప్ అభ్యర్థి నవీన్ చౌదరిపై 12 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
అలాగే..ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి కైలాశ్ గెహ్లాట్ కూడా ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బిజ్వాసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అయిన ఆప్ అభ్యర్థిపై 11 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.కాంగ్రెస్‌కు చెందిన తర్వీందర్ సింగ్ మార్వా కూడా ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి..ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను స్వల్ప ఓట్ల తేడాతో ఓడించారు. ఆప్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఛత్తర్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్ కూడా ఆప్ అభ్యర్థి బ్రహ్మ్‌సింగ్ తన్వర్‌పై 6 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
అకాలీదళ్ నుంచి బీజేపీలోకి చేరిన మంజీందర్ సింగ్ సిర్సా రాజౌరి గార్డెన్‌లో ఆప్‌కు చెందిన ధన్వతి చందేలాపై 18 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ నుంచి ఆప్‌లో చేరిన జితేందర్ సింగ్ షుంటి.. బీజేపీ అభ్యర్థి చేతిలో దాదాపు 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇలా ఆప్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వారంతా విజయం సాధిస్తే..బీజేపీ నుంచి ఆప్, కాంగ్రెస్ లో చేరినవారంతా ఓటమి చవిచూశారు.