రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసమని ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపులలో భాగంగా గత ప్రభుత్వం ఆగమేఘాల మీద డిసెంబర్ 6, 2021న 317 జీవో తేవడం జరిగింది. ఈ కేటాయింపుల్లో ప్రధానంగా స్థానికత అనే అంశాన్నే మర్చిపోయి కేవలం సీనియార్టీకి పెద్దపీట వేసి అనేక సమస్యలకు కేంద్ర బిందువు అయ్యింది.
ఏ స్థానికత కోసమైతే 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామో.. నేడు ఆ స్థానికత విషయం లేదని తెలంగాణలోని ఉద్యోగ లోకమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది.
అసలు 2018 ఆగస్టు నెలలో రాష్ట్రపతి ఉత్తర్వులు (ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయి మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్స్-2018) పేరుతో GO.MS No.124 జీవోలో స్థానికత అనే విషయం స్పష్టంగా ఉన్నప్పటికీ .. వీటన్నింటినీ బేఖాతరు చేస్తూ గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో వారం, పది రోజుల్లోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులను పరాయి జిల్లాలకు శాశ్వత కేటాయింపులు చేశారు. ఈ 317 చీకటి జీవో వల్ల దాదాపుగా 25 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు అకాల మరణం చెందారు.
గత పాలకుల నిర్వాకంతో ఇప్పటికే అనేకమంది వందల కిలోమీటర్ల సుదూర ప్రాంతాలకు నిత్యం ప్రయాణం చేయలేక శారీరక, మానసిక సమస్యలతో బలవంతంగా విధులను నిర్వర్తించాల్సి వస్తోంది. ఈ జీవో అమలై దాదాపుగా 3 సంవత్సరాలు కావొస్తోంది. కానీ, స్థానికత నష్టపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పరిష్కారం లభించలేదు.
కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలతో ..
ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 317 బాధితులకు కచ్చితంగా న్యాయం చేస్తామని ఎన్నికల ముందు మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాల్లోనూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తప్పకుండా త్వరలోనే వారి సొంత జిల్లాలకు పంపిస్తామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరోపక్క ఫిబ్రవరి నెలలో 317 జీవోపైన మంత్రి వర్గ ఉపసంఘం కూడా వేయడం సంతోషించదగ్గ విషయం.
ఈ మంత్రివర్గ ఉపసంఘానికి ఆయా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, బాధిత ఉద్యోగులు కూడా 317 సమస్య ఉత్పన్నానికి గల కారణాలు, తగు పరిష్కార మార్గాలను కూడా నివేదించడం జరిగింది. కానీ, ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారు. ఎప్పటిలోపు న్యాయం చేస్తారన్న విషయంపై ఆయోమయం బాధితుల్లో నెలకొన్నది. ఆ అయోమయాన్ని తొలగించడానికి ప్రభుత్వం ఈ సమస్యపై ఒక అధికారిక ప్రకటన చేస్తే 317 బాధితులకు ఒక భరోసా కలుగుతుంది.
అలాగే 317 బాధితులు నేరుగా వారి సమస్యలను అందులో పేర్కొనవచ్చంటూ బాధితుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం గ్రీవెన్స్ వెబ్ పోర్టల్‌ను జీవో 317, 46 ఇష్యూస్ పేరిట అందుబాటులోకి తెచ్చింది. కానీ ఆ అప్లికేషన్‌లోని గ్రౌండ్స్‌లో స్థానికత అనే అంశాన్నే పొందుపరచలేదు. కేవలం మెడికల్ , స్పౌజ్, మ్యూచువల్, అదర్స్ అనే అంశాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
బదిలీలతో పాటే 317 బాధితుల సమస్యలు తీర్చాలి
ఇక్కడ ఇంకో ప్రశ్న తలెత్తుతున్నది. ఈ బదిలీలలో జీవో 317 బాధితులు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవాలా? ఒకవేళ పెట్టుకుంటే మళ్లీ ఆ స్థానికేతర జిల్లాలోనే ఉండిపోవాల్సిందేనా? అనే అనుమానం లేకపోలేదు. అందుకోసమే ఈ సాధారణ బదిలీల కంటే ముందే లేదంటే బదిలీలతోపాటే ఈ 317 బాధితుల సమస్యలను తీర్చాలని వేడుకుంటున్నాం. జీవో 317 బాధితుల సమస్యలను మానవీయ కోణంలో ఆలోచించి కచ్చితంగా సీఎం రేవంత్ సర్కారు న్యాయం చేస్తుందని మొదటి నుంచి నమ్ముతున్నాం.
అందుకోసమే ఎన్నికల మేనిఫెస్టోలో 317 సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినంత ధైర్యం వచ్చింది. మరోపక్క ఈ 317 జీవోపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం పెద్దలు కూడా తమ నివేదికను త్వరితగతిన ప్రభుత్వానికి అందజేయాలి. తెలంగాణ రాష్ట్రంలో స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. ఉద్యోగులను బాధిస్తున్న ఈ సమస్యకు ప్రజాప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపగలదని కోరుతున్నాం.
స్థానికతను వెబ్‌పోర్టల్‌లో చేర్చాలి
ప్రధానంగా 317 ద్వారా స్థానికత కోల్పోయినవారే అధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి, ఈ స్థానికత అనే అంశాన్ని కూడా గ్రౌండ్స్‌లో వెబ్ పోర్టల్‌లో చేర్చాలని 317 బాధితులు కోరుతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కదలిక మొదలు పెట్టిందనుకున్న తరుణంలోనే మరోపక్క ప్రస్తుతం ఉపాధ్యాయుల సాధారణ బదిలీల షెడ్యూల్ విడుదల కావడంతో 317 బాధితులు ఆందోళన చెందుతున్నారు.
అయితే, ఈ బదిలీలు, ప్రమోషన్లకు ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ, ఈ ప్రక్రియ ప్రారంభిస్తే 317 జీవో సమస్య పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందని సగటు బాధిత ఉపాధ్యాయుడి మనోవేదన. కానీ, కొన్ని సంఘాలు 317 బాధితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రభుత్వం ఈ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను కొనసాగిస్తుందని నమ్మకం కలిగిస్తున్నారు. కానీ, ఉన్నట్టుండి ఈ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ రావడంతో బాధితుల్లో నమ్మకం సన్నగిల్లుతున్నది. భవిష్యత్తును ఊహించుకుంటేనే భయమేస్తోంది.
- బుర్రి శేఖర్,
317 జీవో బాధితుడు