మనం వాడే మాస్కులు సేఫేనా?

  • పబ్లిక్ వాడే సర్జికల్ మాస్కుల్లో విషపూరిత కెమికల్స్
  • చైనా నుంచే 85% మాస్కులు గ్లోబల్‌గా సప్లై అవుతున్నయ్
  • యూరప్‌లో మాస్కులపై సైంటిస్టుల రీసెర్చ్

కరోనాను కంట్రోల్​ చేయాలంటే మాస్కు పెట్టుకోవడం తప్పనిసరి. కానీ మాస్కులు అన్నీ సేఫేనా అని సరిచూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రకాల మాస్కులు పెట్టుకుంటే కరోనా నుంచి ప్రొటెక్షన్ మాట దేవుడెరుగు.. కొత్త జబ్బులు రావడం ఖాయమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్​గా మార్కెట్‌‌లోకి వస్తున్న మాస్కుల్లో 85% చైనావేనని,  ఆ దేశానికి చెందిన కొన్ని కంపెనీలు కనీస ప్రమాణాలు పాటించకుండా వాటిని తయారు చేస్తున్నాయని చెబుతున్నారు.  ఇలా వస్తున్న మాస్కుల్లో విషపూరిత కెమికల్స్‌‌ ఉంటున్నాయని లేటెస్ట్ రీసెర్చ్‌‌లో తేలింది. ఈ నేపథ్యంలో బయట కొనే కొన్ని రకాల సర్జికల్ మాస్కుల కంటే క్లాత్ మాస్కులు వాడడమే బెటర్ అని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
కరోనా వైరస్ స్టార్ట్ అయ్యాక ప్రపంచమంతా మాస్క్ తప్పనిసరి అయిపోయింది. వైరస్ స్ప్రెడ్‌‌ని కంట్రోల్ చేసేందుకు ఉన్న ఉత్తమ మార్గం ఇదే కావడంతో అన్ని దేశాలు ఈ విషయంలో సీరియస్‌‌గా రూల్స్ పెట్టాయి. మన దేశంలో మాస్క్ పెట్టుకోకుండా బయటకు వస్తే ఫైన్లు కూడా వేస్తున్నారు. మరి కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి మనం పెట్టుకుంటున్న మాస్కులు సేఫేనా? ఏ మాస్క్ వాడితే బెటర్? అన్న ప్రశ్నలు ఇప్పుడు మరోసారి వస్తున్నాయి. దీనికి కారణం యూరప్‌‌లోని పలు దేశాల్లో జర్మనీకి చెందిన రెండు సంస్థలు మాస్కులపై చేసిన రీసెర్చ్‌‌లో భయంకరమైన విషయాలు బయటపడటమే. కొన్ని రకాల మాస్కుల్లో విషపూరిత కెమికల్స్ గుర్తించామని ఆ సంస్థల సైంటిస్టులు చెబుతున్నారు. వీటి వల్ల మనుషుల హెల్త్‌‌తో పాటు, పర్యావరణంపైనా ఎఫెక్ట్ పడుతుందని హెచ్చరిస్తున్నారు.

ఏయే కెమికల్స్ ఉన్నాయంటే..
జర్మనీలోని మోడర్న్ టెస్టింగ్ సర్వీస్ సంస్థ (ఎంటీఎస్), హ్యాంబర్గ్ ఎన్విరాన్‌‌మెంటల్ ఇన్‌‌స్టిట్యూట్ (హెచ్‌‌ఈఐ) పరిశోధకులు యూకే, జర్మనీ, బెల్జియంతో పాటు కెనడాలో వాడుతున్న మాస్కులను ల్యాబ్‌‌లో టెస్ట్ చేశారు. కొన్ని రకాల మాస్కుల్లో ఫార్మాల్డిహైడ్, ఎనిలైన్, పాలీఫ్లోరినేటెడ్ కెమికల్స్, క్లోరో ఫ్లోరో కార్బన్స్, కోబాల్ట్, పాలీప్రొపెలీన్ లాంటి రకరకాల కెమికల్స్ ఉన్నట్లు గుర్తించారు. ఆ మాస్కులను కట్టుకుని ముక్కు, నోటితో మనం పీలుస్తున్నది విషమే అని ఎంటీఎస్ కో–ఫౌండర్ డాక్టర్ డైటర్ సెడ్లాక్ అన్నారు. ఈ కెమికల్స్‌‌కు ఎక్కువ సేపు పీల్చడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆయన తెలిపారు.

ఎలాంటి ఇబ్బందులొస్తాయి?
మనం వాడే బ్లూ కలర్ సర్జికల్ మాస్కులను ఓపెన్ చేయగానే ఒక రకమైన పెయింటింగ్ లాంటి వాసన వస్తుంది. ఈ వాసనకు కారణం ఫార్మాల్డిహైడ్ కెమికల్ అని సైంటిస్టులు చెబుతున్నారు. దీని మోతాదు ఎక్కువగా ఉంటే కళ్లు మండడం, నీళ్లు రావడం, ముక్కు, గొంతులో ఇబ్బందికరంగా అనిపించడం, దగ్గు రావడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం, తలతిరగడం లాంటి ఎఫెక్ట్స్​ కనిపిస్తాయని డాక్టర్ డైటర్ తెలిపారు. అలాగే ఎనిలైన్‌‌ను కూడా మాస్కుల్లో గుర్తించామని, ఈ కెమికల్‌‌ను ఎక్కువ కాలం పాటు పీలిస్తే కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. మనుషుల హెల్త్‌‌తో పాటు పర్యావరణంపైనా ఎఫెక్ట్ చూపించే పాలీ కెమికల్స్, క్లోరోఫ్లోరో కార్బన్స్‌‌ కూడా మాస్కుల తయారీలో వాడుతున్నట్లు తమ రీసెర్చ్‌‌లో తేలిందన్నారు.  తుంపర్లు లాంటివి మాస్క్‌‌పై పడినప్పుడు వాటిని అవి దానిపై నిలవకుండా జారిపోయేందుకు టెక్స్‌‌టైల్స్‌‌లో వాడే పాలీఫ్లోరినేటెడ్ కెమికల్స్‌‌ను మాస్కుల తయారీలో వాడుతున్నారని తమ ల్యాబ్‌‌ టెస్టుల్లో గుర్తించామని, అయితే ఈ కెమికల్స్‌‌ను ఎక్కువగా పీల్చడం ఆరోగ్యానికి మంచిది కాదని డైటర్ స్పష్టం చేశారు. మాస్కుల్లోని కెమికల్స్‌‌కు ఎక్కువ కాలం ఎక్స్‌‌పోజ్ అవ్వడం వల్ల కొంత మందికి ముక్కు, నోరు భాగంలో దద్దుర్లు వచ్చినట్లు తాము గుర్తించామని హెచ్‌‌ఈఐ డైరెక్టర్ ప్రొఫెసర్ మైకెల్ బ్రాంగర్ట్ తెలిపారు. కలర్ డైస్‌‌లో వాడే కోబాల్ట్ కూడా సర్జికల్ మాస్కుల్లో గుర్తించామని, దీనిని కవర్ చేయడానికి మరికొన్ని కెమికల్స్‌‌ను కొని కంపెనీలు వాడుతున్నట్లు తేలిందని మైకెల్ చెప్పారు. మాస్కుల్లో గుర్తించిన ఈ కెమికల్స్ పీల్చుకోవడం వల్ల లంగ్స్‌‌పైనా ఎఫెక్ట్ ఉంటుందని, దీర్ఘకాలంలో ఆస్తమా, నిమోనియా లాంటి జబ్బులు రావొచ్చని హెచ్చరించారు. అయితే అన్ని సర్జికల్ మాస్కులకు ఇది వర్తిస్తుందని చెప్పలేమని, కంపెనీలు పాటించే స్టాండర్డ్స్‌‌ను బట్టి మార్పు ఉంటుందని తెలిపారు.

చైనాలో వేల కంపెనీలు పుట్టుకొచ్చాయ్​
కరోనా మహమ్మారికి ముందు నుంచి ప్రపంచంలో మాస్కుల తయారీలో చైనానే టాప్‌‌లో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి షురూ అయిన తర్వాత ఆ దేశంలో మాస్కుల ఉత్పత్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. నేటికీ ప్రపంచంలో వాడుతున్న మాస్కుల్లో 85 శాతం ఆ దేశం నుంచి సప్లై అవుతున్నవేనని సైంటిస్టులు తెలిపారు. అయితే 2020 తొలి ఐదు నెలల్లో చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన మాస్క్ తయారీ కంపెనీల సంఖ్య 70 వేలకు పైనే ఉందని, లాభాలు పెంచుకోవడం కోసం వీటిలో చాలా కంపెనీలు సరైన స్టాండర్డ్స్‌‌ పాటించడం లేదని, దీనిని ప్రపంచ దేశాలు సీరియస్‌‌గా పరిగణించాలని డాక్టర్ డైటర్ అన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులను కూడా మెడికల్ డివైజ్ కేటగిరీలో చేర్చి, వాటిపై కూడా పక్కా స్క్రూటినీ జరిగాకే ఇంపోర్ట్స్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే కెనడాలో మాస్కుల పరిశీలన తర్వాత రెండు కంపెనీలకు చెందిన మాస్కుల వాడకంపై నిషేధించేందుకు ఆ దేశ హెల్త్ డిపార్ట్‌‌మెంట్ డేటా రివ్యూ చేస్తోందని తెలిపారు.

నిమిషంలో 30 లక్షల మాస్కులు పడేస్తున్నం
కరోనా క్రైసిస్ స్టార్ట్‌‌ అయ్యాక గ్లోబల్​గా ప్రతి నిమిషానికి 30 లక్షల యూజ్ అండ్ త్రో మాస్కులను పడేస్తున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. వీటిలో ఉండే కెమికల్స్ ఎఫెక్ట్ పర్యావరణంపై పడుతోందని, వీటిలో ఉండే ప్లాస్టిక్ మెటీరియల్ ఒక రకంగా భూమిపై వదిలేసిన ‘టైమ్ బాంబ్’ లాంటిదని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.  సరైన పద్ధతిలో డిస్పోజ్ చేయకుండా ఎక్కడపడితే అక్కడ మాస్కులు పడేయడం వల్ల ప్లాస్టిక్ తర్వాత ఇవే పర్యావరణానికి అతి పెద్ద సమస్యగా పరిణమించడం ఖాయమని ఆ యూనివర్సిటీ ఎన్విరాన్‌‌మెంటల్ టాక్సికాలజిస్ట్ ఎల్విస్ జెన్బో అన్నారు. త్రీ లేయర్ మాస్కుల్లో తడిని వెంటనే పీల్చుకోకుండా ప్రొటెక్ట్ చేసే నాన్ అబ్జార్బెంట్ పాలిస్టర్ మెటీరియల్‌‌ను పై పొరలో వాడుతారని తెలిపారు. మధ్యలో ఉండే లేయర్‌‌‌‌లో పాలీప్రొపపైలీన్, పాలిస్టరిన్ లాంటి నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ వాడుతారని ఎల్విస్ చెప్పారు. లోపల ఉండే ఫస్ట్ లేయర్‌‌‌‌లో మన నోటి నుంచి వచ్చే తుంపర్లను పీల్చుకునేలా కాటన్ లాంటి అబ్జార్బెంట్ మెటీరియల్ ఉంటుందన్నారు. అయితే పై రెండి లేయర్లలో పాలిమర్స్ ఉండడం వల్ల అవి పర్యావరణానికి హాని చేస్తాయని అన్నారు. సరిగా డిస్పోజ్ చేయకపోవడం వల్ల కరోనా వైరస్ స్ప్రెడ్ అవడంతో పాటు భూమి, వాటర్ రిసోర్సెస్ లాంటివి కూడా పొల్యూట్ అవుతాయని తెలిపారు.

ఎలాంటివి వాడితే బెటర్
సామాన్య జనం వాడకం కోసం తెప్పించే మాస్కుల స్టాండర్డ్స్‌‌ విషయంలో దేశాలు అంత సీరియస్‌‌గా లేకపోవడం వల్లే విషపూరిత కెమికల్స్ ఉన్న మాస్కులు మార్కెట్‌‌లోకి వచ్చేస్తున్నాయని డాక్టర్ డైటర్ అన్నారు. డాక్టర్ కోసం సప్లై చేసే వాటి విషయంలో కచ్చితంగా స్టాండర్డ్ చెకింగ్ ఉంటోందని, ఇదే విధానాన్ని సాధారణ మాస్కుల దిగుమతుల విషయంలోనూ పాటించాలని ఆయన సూచిస్తున్నారు. పీపీఈ కిట్ల విషయంలో ఎంత సీరియస్‌‌గా ఉంటున్నారో అంతే సీరియస్‌‌గా సాధారణ మాస్కుల విషయంలోనూ ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెడికల్ ప్రొఫెషనల్స్ వాడే మాస్కులు, ఎన్‌‌95 మాస్కులు, మామూలు క్లాత్ మాస్కులు ఉపయోగించడం మేలని డైటర్ తెలిపారు. ముఖ్యంగా పిల్లల విషయంలో సర్జికల్ మాస్కుల కంటే క్లాత్ మాస్కులు వాడడం బెటర్ అని చెప్పారు. ఎవరైనా సరే తప్పనిసరి పరిస్థితుల్లో మార్కెట్‌‌లో దొరికే సర్జికల్ మాస్కులనే వాడాల్సి వస్తే ఆరు గంటలకు మించి దానిని పెట్టుకోకూడదని సూచించారు.