- ఆర్అండ్ బీ ఆఫీసుల ప్లేస్ లో పార్కింగ్ ప్రపోజల్స్ ?
- మూడు రోజుల్లో ఖాళీ చేయాలంటూ అధికారులపై ఫోర్స్
- ఇప్పటికే నిర్మించిన భవనాలు నిరుపయోగం
- వృథా అవుతున్న వందల కోట్ల ప్రజాధనం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలోని పాత ఆఫీస్ ల స్థలాలన్నీ ఒక్కొక్కటిగా ఖాళీ చేస్తున్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఎదుట ఏళ్ల కిందటి భవనాల్లో ఇంజనీరింగ్ ఆఫీస్‍లు ఉండేవి. వీటిని తొలగించి వీటి స్థానాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పుడు తాజాగా పొట్టి శ్రీరాములు జంక్షన్ పక్కనే ఉన్న ఆర్‍అండ్‍బీ, నేషనల్ హైవే ఇంజినీరింగ్ ఆఫీసులను కూడా ఖాళీ చేసేదుకు సిద్ధమవుతున్నారు. ఈ భవనాలకు ఎదురుగా ఇదే జంక్షన్ సమీపంలో కరీంనగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కాంప్లెక్స్ నేటికీ ఓపెన్ చేయకుండానే శిథిలావస్థకు చేరుకుంది. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలను వృథా వదిలేస్తున్న క్రమంలో ప్రభుత్వ ఆఫీస్‍లను కూల్చి పార్కింగ్ స్థలాలుగా.. ఇతర వాటికి నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవడంతో నిధులు వృథా అవుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మూడేళ్ల కింద రెనోవేషన్..
పొట్టి శ్రీరాములు జంక్షన్ సమీపంలో ఉన్న సుమారు రెండెకరాల స్థలంలో ఇంజినీరింగ్‍కు సంబంధించిన కీలక ఆఫీస్‍లు ఉన్నాయి. సిటీకి సెంటర్‍లో ఉండటంతో అందరికీ అందుబాటులో ఉండేది. ఈ కాంపౌండ్‍లో నేషనల్ హైవే ఎస్‍ఈ సర్కిల్ ఆఫీస్, ఈఈ డివిజన్ ఆఫీస్, డిప్యూటీ ఈఈ సబ్ డివిజన్ ఆఫీస్‍లు ఉంటాయి. వీటితోపాటు ఆర్‍అండ్‍బీ ఈఈ, డిప్యూటీ ఈఈ ఆఫీస్‍లు కూడా ఉన్నాయి. ఇందులో ఆర్అండ్‍బీ భవనం పాతది కావడంతో మూడేళ్ల కిందట సుమారు రూ.40లక్షలతో రెనోవేషన్ చేశారు. లోపల ఫ్లోరింగ్, కలరింగ్ చేయడంతో కొత్త బిల్డింగ్‍లా మారిపోయింది. ఈ సంతోషం ఆఫీసర్లకు ఎన్నో రోజులు నిలవలేదు. దీనికి ఎదురుగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పార్కింగ్ స్థలం పేరిట ఈ కాంపౌండ్‍లో ఉన్న అన్ని ఆఫీస్‍లను అతి త్వరలో తొలగించనున్నారు.
అద్దె గదులతో అవస్థలు...
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం ఇక్కడున్న ఆఫీస్ భవనాలను కూల్చివేయడంతో అద్దె భవనాల్లో ఆఫీస్‍లు ఏర్పాటు చేసుకోవడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఇందులోని క్వార్టర్స్ లో ఉన్న ఇంజనీరింగ్ అధికారుల కుటుం బాలు అద్దె ఇళ్లలోకి మారారు. కొన్ని ఇంజనీరింగ్ ఆఫీస్‍లు జడ్పీ క్వాటర్‍కు తరలించారు. తాజా గా ఆర్‍అండ్‍బీ ఆఫీస్‍లను ఉన్నపళంగా ఖాళీ చే యాలని ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడికి వెళ్లా లో తెలియక అధికారులు సతమతమవుతున్నారు.
ఓపెనింగ్ కాకుండానే కూల్చేశారు..
నగర ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని రూ.2 కోట్లు ఖర్చు చేసి ఐడీఎస్‍ఎంటీ నిధులతో నగర పాలక సంస్థకు చెందిన ఓల్డ్ గెస్ట్ హౌస్‌ను కూల్చివేసి భవన సముదాయాన్ని నిర్మించారు. 24 షెటర్లతో రెండు ఫ్లోర్‍లు నిర్మించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ కోసం కేటాయించారు. మిగిలిన రెండు ఫ్లోర్లు షాపింగ్ కాంప్లెక్స్ కు కేటాయించారు. కానీ దీని నిర్మాణం పూర్తయి సుమారు 15 ఏళ్లయినా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. దీని సమీపంలోనే ఇంటిగ్రెటెడ్ మార్కెట్ నిర్మిస్తుండటంతో ఇప్పటికే శిథిలావస్థకు చేరిన ఈ భవనం ఎందుకూ పనికి రాకుండా పోయింది. దీంతో ఓపెనింగ్ కాకుండానే ఈ భవన సముదాయాన్ని త్వరలో డిస్ మెంటల్ చేయనున్నారు.
దీంతో కరీంనగర్ నగర పాలక సంస్థలో కోట్ల నిధులు బూడిదలో పోసినట్లయ్యింది. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన భవనాలను సరైన ప్రణాళిక లేకుండా.. ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోకపోవడంతో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.