
- స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం వర్సెస్ తాటికొండ
- జనగామలో ఎదురులేదంటున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
- ఈసారి పోటీలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి?
- జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఆగమాగం
- పట్టు కోసం బీజేపీ ప్రయత్నాలు
జనగామ, వెలుగు : జనగామ జిల్లాలో అన్ని పార్టీలు అంతర్గత పోరుతో సతమతమవుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ తోపాటు, కాంగ్రెస్, బీజేపీలను అసమ్మతి పీడిస్తోంది. ముందస్తు ఎన్నికల హడావుడి స్టార్ట్కావడంతో పలువురు ఆశావహులు ఎమ్మెల్యే టికెట్‌కోసం పోటీపడుతున్నారు. లీడర్లు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయారు. సెకండ్క్యాడర్అయితే అధిష్టానం ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని జనాల్లో బీఆర్ఎస్పై వ్యతిరేకత ఉన్నా.. దానిని అనుకూలంగా మలుచుకోవడంలో విపక్షాలు విఫలమవుతున్నాయి. జిల్లాలో జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్నియోజక వర్గాలుండగా అన్నిచోట్లా ఇదే పరిస్థితి నెలకొంది.
బీఆర్ఎస్ లో అంతర్గత పోరు
అధికార బీఆర్ఎస్పార్టీలో అంతర్గత పోరు ఎక్కువైంది. స్టేషన్ ఘన్పూర్నియోజక వర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య వార్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టికెట్తమదంటే తమదని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో 20 సీట్లు మారిస్తే మళ్లీ అధికారం తమదేనని ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడిన మాటలు జనగామ జిల్లాలో హీట్ రేపాయి. 2018 ఎన్నికల్లోనే ఎమ్మెల్యే టికెట్లకేటాయింపులో మార్పులుంటాయని ప్రచారం జరిగినా సిట్టింగ్‌లకే అవకాశం దక్కడం, వారు గెలుపొందడం జరిగిపోయింది. తాజాగా ఎర్రబెల్లి వ్యాఖ్యలతో మళ్లీ టికెట్ల మార్పుపై చర్చ పెరిగింది. రాజయ్య, కడియం శ్రీహరిలు పరోక్షంగా ఒకరిపై ఒకరు నిత్యం మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉన్నారు. పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయాయి. కనీసం ఒకరిని ఒకరు పలుకరించుకోలేని స్థాయిలో వీరి మధ్య వైరం పెరిగింది. ఈ సారి కడియం శ్రీహరికి టికెట్రాకపోతే ఎంతటి నిర్ణయానికైనా వెనుకాడేది లేదని ఆయన అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు వీరికి పోటీగా జనగామ డిస్ట్రిక్ట్హాస్పిటల్సూపరెంటెండెంట్డాక్టర్ సుగుణాకర్‌రాజు చేరారు. స్టేసన్ ఘన్పూర్టికెట్ తనదేనని, త్వరలో సర్కారు కొలువుకు రాజీనామా చేసి బరిలో దిగుతానని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నేత నాగపురి కిరణ్ కుమార్ కూడా జనగామ ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారు. ఆయన తండ్రి నాగపురి రాజలింగం 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండగా, వరంగల్ జిల్లా సమితి ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ, చేర్యాల ఎమ్మెల్యే గా చేసిన సేవలు, అభివృద్ధి వీరికి కలిసి వచ్చే అంశం. కిరణ్ కొంత కాలం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత కేసీఆర్ పిలుపుతో టీఆర్ఎస్లో చేరారు.
ముత్తిరెడ్డిపై క్యాడర్ నారాజ్
జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిది ఏకఛత్రాధిపత్యం నడుస్తుండగా ఇటీవల కాలంతో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ స్థానంపై ఆశ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014, 2018 ఎన్నికల్లో మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పై ఈజీగా గెలుపొందిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వచ్చే ఎన్నికల్లోనూ టికెట్తనకే వస్తుందని, తానే గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోవడం ఆయనకు కలిసి వచ్చే అంశం కాగా, పార్టీ క్యాడర్ మాత్రం నారాజ్‌లో ఉంది. ఉద్యమ టైంలో తన వెంట ఉన్నవారిని వదిలి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ఆదరించి అందలం ఎక్కిస్తున్నారని పార్టీలోని పలువురు లీడర్లు లోలోన మదనపడుతున్నారు.
పాలకుర్తిలో ఎర్రబెల్లిపై అసంతృప్తి
పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రతి పక్షాలు సరిగా లేకపోవడం కలిసి వచ్చే అంశం. ఈ నియోజకవర్గంలో కూడా సెకండ్ క్యాడర్ అసంతృప్తిగా ఉంది. కాగా విపక్ష పార్టీలకు సరైన లీడర్ లేక సదరు అసమ్మతి వాదులు కిమ్మనకుండా బీఆర్ఎస్ లోనే ఉంటున్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు మొదటి నుంచి ఉద్యమకారులను వదిలి తన వర్గం టీడీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
కాంగ్రెస్‌లో ఎవరికి వారే...
మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదు. జనగామ నియోజకవర్గంలో మాజీ టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్జంగా రాఘవరెడ్డిలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురి అనుచరులు మూడు గ్రూపులుగా విడిపోయారు. పొన్నాల లక్ష్మయ్య ఎలక్షన్ టైంలో తప్ప మిగతా టైంలో కనిపించని పరిస్థితి నెలకొంది. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు నాయకుడే కరువయ్యాడు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన జంగా రాఘవరెడ్డి ఎర్రబెల్లి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన జనగామ పైనే కన్నేశారు. తాను జనగామ లేదా వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇటీవల కొండా మురళి, వేం నరేందర్ రెడ్డి పేర్లు వినిపించినా ఇప్పుడు ఆ ఊసే లేదు. తాజాగా మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ లీడర్ రామసహాయం సురేందర్ రెడ్డి మనవడు రఘురాంరెడ్డి తో పాటు రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. 2018 ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నుంచి సింగపురం ఇందిర పోటీ చేయగా ఈమె నియోజకవర్గానికి గెస్ట్ లా వచ్చి వెళ్తోందనే విమర్శలున్నాయి . మరో వైపు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య వరంగల్ ఎంపీ టికెట్ దక్కకపోతే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు దొమ్మాటి సాంబయ్య సైతం టికెట్ఆశిస్తున్నారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
అనుకూల అంశాలు :
- ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాడనే పేరుండడం
- నియోజకవర్గంలో విపక్ష లీడర్లు బలహీనంగా ఉండడం
- నియోజకవర్గంలోని చెరువులను దేవాదుల నీటితో నింపడం
- జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు
- కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండడం
ప్రతికూల అంశాలు
- ఉద్యమ కారులను వదిలి కొత్తగా పార్టీలో చేరిన వారిని ప్రోత్సహించడం
- జిల్లాలో ప్రధాన అనుచరులపై అవినీతి అరోపణలు
- ఎన్నికల హామీలు నెరవేరకపోవడం
- కార్యకర్తల్లో అంతర్గత పోరు
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
అనుకూల అంశాలు
- నియోజకవర్గంలో నిత్య పర్యటనలు.. శ్రేణులకు అందుబాటులో ఉండడం
- మామూలు కార్యకర్త సైతం ఎమ్మెల్యేను నేరుగా కలిసే వీలుంటుందనే అభిప్రాయం
- కేటీఆర్, కేసీఆర్‌లకు వీర విధేయుడనే పేరు
- మాదిగ సామాజిక వర్గం ఓటర్లు
- ఇతర పార్టీల లీడర్ల పై కక్ష సాధింపు చర్యలు లేకపోవడం
ప్రతికూల అంశాలు
- ఎమ్మెల్సీ కడియం శ్రీహరి రూపంలో భగ్గుమంటున్న అసమ్మతి
- నామినేటెడ్ తో పాటు, పార్టీ పదవులను,
- ఇతర పనులను డబ్బులిచ్చిన వారికే కట్టబెడతాడనే ఆరోపణలు
- దళిత బంధు పథకంలో అవినీతి ఆరోపణలు
- మహిళా నాయకురాళ్లతో అనుచితంగా ప్రవర్తిస్తారనే ఆరోపణలు
పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుఅనుకూల అంశాలు
- నియోజకవర్గంలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడం
- మంత్రిగా ఉండి ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయడం
- ఎక్కువగా నియోజకవర్గంలో పర్యటించడం, ఓటమి ఎరుగని లీడర్‌గా పేరు
ప్రతికూల అంశాలు
- టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత..
- ఉద్యమకారులను చిన్నచూపు చూస్తున్నారనే విమర్శ.
- ఇంటర్, డిగ్రీ కాలేజీలు, పాలకుర్తి లో 100 బెడ్స్ హాస్పిటల్ హామీ నెరవేర్చకపోవడం
- చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులు ఎక్కడివి అక్కడే ఉండడం
బీజేపీలోనూ గ్రూపులు
గత ఎన్నికలల్లో నామ మాత్రపు ఓట్లు సాధించిన బీజేపీ ఈ సారి ఎలాగైనా జిల్లాలో పట్టు నిలుపుకోవాలని శ్రమిస్తోంది. బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేందుకు పక్కా ప్లాన్ వేస్తోంది. నిత్యం జిల్లా కేంద్రం, నియోజకవర్గాలు, మండలాల్లో మీటింగ్‌లు పెట్టుకుని శ్రేణులను ఆ దిశగా సమాయత్తం చేస్తున్నారు. జనగామ నియోజక వర్గంలో టికెట్‌ను జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డితో పాటు ముక్కెర తిరుపతి రెడ్డి ఆశిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్నియోజక వర్గంలో మాదాసు వెంకటేశ్, బొజ్జుపెల్లి సుభాష్ పోటీ పడుతుండగా, మాజీ ఎంపీ విజయరామరావు పేరు కూడా వినిపిస్తోంది. వరంగల్ ఎంపీ టికెట్ లభించక పోతే స్టేషన్ ఘన్పూర్ నుంచి అయినా బరిలో నిలవాలని చూస్తున్నారు. ఈ పార్టీలో కూడా లీడర్లు గ్రూపులు మెయింటెయిన్ చేస్తున్నారు.