తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపై చర్చ జరగడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కృషే కారణం. ఓ వైపు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బీసీలను విస్మరిస్తూనే వస్తోంది. కానీ, రాహుల్ గాంధీ మాత్రం బీసీలకు న్యాయం జరగాలంటూ పోరాడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను త్వరలోనే అమలు చేయాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తూ ఉండడం శుభపరిణామం. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ ఉండడం హర్షణీయం. బీసీ గణాంకాలు, స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలు కోసం చైర్మన్, ముగ్గురు సభ్యులతో కూడిన బీసీ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను వర్గీకరణ ద్వారా అమలు చేయవలసిన అవసరం ఉందని బీసీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన మండల్ కమిషన్ సూచనలను కూడా ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలి.
తెలంగాణలో 23 శాతం బీసీ కోటా అమలుచేస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో కొన్ని వేల మంది బీసీలు సర్పంచ్ స్థానాలను కోల్పోయారు. మున్సిపాలిటీలు, గ్రేటర్ మున్సిపాలిటీల్లో మాత్రం బీసీ కోటా 34 శాతంగా అమలు అవుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని బీసీ కులాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల ముందు బీసీ కోటా 42 శాతానికి పెంచుతామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగానే అడుగులు పడుతూ ఉన్నాయి. స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం లేదు కాబట్టి 42 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలుచేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉంది.
చోద్యం చూస్తున్న మోదీ ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్లపై న్యాయ సమస్యలను పరిష్కరించకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. బీజేపీ ప్రభుత్వం తమకు అవసరమైన అంశాల కోసం భారత రాజ్యాంగాన్ని సవరించడానికి సిద్ధంగా ఉంటుంది కానీ బీసీల అవసరం కోసం మాత్రం సిద్ధంగా ఉండదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 15(4), 15(5),16(4) ప్రకారం బీసీ కులాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించారు. అయితే, ఈ వెనుకబడిన తరగతులకు సరైన న్యాయం జరుగుతుందా లేదా అనే విషయాన్ని ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఆలోచించాలి. మోదీ ప్రధాని అయిన తరువాత 2019లో ఆధిపత్య కులాల పేదల కోసం 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ అమలులోకి తెచ్చారు. ప్రధాని మోదీ బీసీలకు న్యాయం చేయలేరా? తాను బీసీ అంటూ చెప్పుకునే మోదీ మాత్రం బీసీలకు అండగా నిలబడడానికి ముందుకు రాకపోవడం వెన్నుపోటు పొడవడమే అవుతుంది. దేశంలోని 90శాతం సంపదకు యజమానులుగా కొనసాగుతున్న ఆధిపత్య కులాలకు రిజర్వేషన్లు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం బీసీల కోసం మాత్రం అడ్డు వేస్తూనే ఉన్నాయి. మోదీ నిజంగా బీసీ అయితే బీసీల సంక్షేమానికి శ్రీకారం చుట్టాలి.
పార్టీలకు అతీతంగా పోరాడాలి
బీసీ రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న పోట్లాటలు సరైనవేనా అనే ప్రశ్నలు కూడా వేసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ముందుకువచ్చి పోరాటం చేయాలి. పార్టీలు బీసీలను ఓట్లుగానే చూశాయి తప్ప రాజ్యాధికారంలో స్థానం ఇవ్వలేదు. తక్కువ శాతం ఉన్నవారే ఆ పదవులను అనుభవిస్తూ వస్తున్నారు. బీసీలలో చైతన్యం తీసుకు రావడానికి బీసీ నాయకులు భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బడుగు, బలహీనవర్గాల ప్రాతినిధ్యం పెరగాలంటే ఏమి చేయాలి అనే విషయమై ఆలోచించాలి. బీసీ కులాలన్నీ సంఘటితం కావాల్సిన సమయం వచ్చింది.
కులగణనకు రాహుల్ హామీ
పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ దేశంలో కులగణనను చేపట్టి తీరుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించారు. కులగణన లెక్కల ఆధారంగా ఆయా కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దేశంలోని మెజారిటీ ప్రజలకు న్యాయం చేసేందుకు రాహుల్ చేస్తున్న ప్రయత్నాలను తప్పకుండా అభినందించాల్సిందే. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లను తప్పక అమలు చేయాలి. రాష్ట్రంలో కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) సమావేశంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం శుభసూచకం. మంత్రులు, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు
పి విశ్వనాథన్, పిసి విష్ణునాథ్లు కూడా పాల్గొన్న సీఎల్పీ సమావేశంలో బీసీల రిజర్వేషన్లపై ఆయన చర్చించారు. బీసీలకు అండగా ఉంటామంటూ ఆయన చెప్పిన మాటలు రాష్ట్రంలోని బీసీ నేతలకు ఊరట కలిగిస్తున్నాయి.
- దుండ్ర కుమారస్వామి,
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు